Begin typing your search above and press return to search.

పుతిన్ ప్రకటనపై పెరిగిపోతున్న ఉత్కంఠ

By:  Tupaki Desk   |   9 May 2022 6:30 AM GMT
పుతిన్ ప్రకటనపై పెరిగిపోతున్న ఉత్కంఠ
X
రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ చేయబోయే ప్రకటనపై ప్రపంచదేశాల్లో ఉత్కంఠ పెరిగిపోతోంది. ప్రతి సంవత్సరం మే 9వ తేదీన రష్యాలో విక్టరీ డే నిర్వహిస్తారు. రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ దేశం జర్మనీ ఓటమికి నిదర్శనంగా రష్యాలో విక్టరీ డే నిర్వహిస్తుంటారు. ఈ విక్టరీ డే సందర్భంగా దేశాన్ని ఉద్దేశించి అధినేతలు ప్రసంగించటం మామూలే. ఈ నేపధ్యంలోనే ఈరోజు పుతిన్ ప్రసంగించబోతున్నారు.

మామూలు రోజుల్లో అయితే పుతిన్ ప్రసంగంపై పెద్దగా ఆసక్తుండేది కాదు. కానీ ప్రస్తుతం జరుగుతున్న ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ప్రపంచదేశాల్లో టెన్షన్ పెరిగిపోతోంది. ఎందుకంటే గడచిన రెండునెలలుగా ఉక్రెయిన్ పై నూరుశాతం పట్టును రష్యా సాధించలేకపోతోంది. ప్రపంచదేశాలు ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం చేస్తోందని అంటున్నాయి. ఇదే సమయంలో పుతిన్ మాత్రం ఉక్రెయిన్ పై జరుగుతున్నది కేవలం సైనికచర్య మాత్రమే అని సమర్ధించుకుంటున్నారు.

యుద్ధమైనా, సైనికచర్యఅయినా ఉక్రెయిన్లోని చాలా నగరాలను రష్యా సైన్యం ధ్వంసం చేసేసిన మాట వాస్తవం. ఇంత జరిగినా ఉక్రెయిన్ పై రష్యా సంపూర్ణ ఆధిక్యం సాధించలేదు. అందుకనే సైనికచర్యను పూర్తిస్ధాయి యుద్ధంగా మార్చే ప్రమాదముందని ప్రపంచదేశాల్లో ఆందోళన పెరిగిపోతోంది. సైనికచర్య కాస్త పూర్తిస్ధాయి యుద్ధంగా మారితే ప్రపంచ దేశాల్లో పరిస్ధితులు పూర్తిగా మారిపోతాయి. ఇదే సమయంలో అణుయుద్ధం తప్పదేమో అనే ఆందోళన కూడా పెరిగిపోతోంది.

అవసరమైతే అణ్వాయుధాలు ప్రయోగిస్తామని ఇప్పటికే పుతిన్ చేసిన హెచ్చరికలను ప్రపంచదేశాలు గుర్తుచేసుకుంటున్నాయి. రష్యా దగ్గర అణ్యాయుధాలు అపారంగా పోగుపడున్నాయి. ఒక్క అణ్యాయుధాన్ని ప్రయోగిస్తే అది ఉక్రెయిన్ మీద మాత్రమే ప్రభావం చూపదు. అందుకనే పొరుగునే ఉన్న రుమేనియా, పోలండ్, బల్గేరియా లాంటి దేశాల్లో టెన్షన్ పెరిగిపోతోంది.

రెండునెలలుగా ఉక్రెయిన్ పై సంపూర్ణ ఆధిక్యత సాధించలేకపోవటం నిజంగా పుతిన్ కు అవమానమే. దాన్ని అధిగమించేందుకు పుతిన్ ఎంతకైనా తెగించే అవకాశముందని అనుమానిస్తున్నారు. చిట్టెలుక లాంటి ఉక్రెయిన్ను స్వాధీనం చేసుకోలేకపోయారనే అవమానం పుతిన్ను జీవితాంతం వెంటాడుతునే ఉంటుంది. అందుకనే ఏదో ఒకటి పుతిన్ ప్రకటించబోతున్నట్లు ప్రచారం పెరిగిపోతోంది. మరి ఏమి ప్రకటిస్తారో చూడాల్సిందే.