Begin typing your search above and press return to search.

మూడో ప్రపంచయుద్ధం వైపా ఈ ప్రయాణం!

By:  Tupaki Desk   |   3 Nov 2016 3:52 PM GMT
మూడో ప్రపంచయుద్ధం వైపా ఈ ప్రయాణం!
X
1 సెప్టెంబరు 1939 నుంచి 2 సెప్టెంబరు 1945 మధ్యకాలం.. సుమారు 6 సంవత్సరాల ఒకరోజు.. ఇదే రెండో ప్రపంచయుద్దం జరిగిన సమయం!! అంటే సుమారు 70 ఏళ్ల కిందట జరిగిన దారుణ సంఘటన. ఈ భారీ దారుణం అనంతరం కారణాలు ఏవైనా మరోసారి ప్రపంచ యుద్దం అనే ఆలోచన చేయలేదు యావత్ ప్రపంచం. తర్వాతి కాలంలో ఇరాన్‌- ఇరాక్‌ - కువైట్‌ - ఆఫ్గనిస్థాన్‌ యుద్దాలు జరిగినప్పటికీ అవి ప్రపంచ యుద్ధంగా మారేటంత పెద్దవి కాదు. దీంతో మరో ప్రపంచ యుద్దం అనే ఆలోచననే దాదాపు ప్రపంచం మరిచిపోయింది. ఈ క్రమంలో మరోసారి సిరియా యుద్ధం.. మూడో ప్రపంచ యుద్ధం ఎంతో దూరంలో లేదని చెబుతోంది. ఈ సిరియా కారణంగా అమెరికా - రష్యా వైరి పక్షాలుగా పెద్దఎత్తున తలపడబోతున్నాయని అనుమానం రోజు రోజుకీ పెరిగిపోతుంది.

సిరియా యుద్ధంలో అమెరికా నేతృత్వంలోని నాటో దళాలు ఒకవైపు - సిరియా ప్రభుత్వానికి దన్నుగా రష్యా బలగాలు మరోవైపు మోహరించిన ఫలితంగా గత కొంతకాలంగా పశ్చిమాసియా - ఐరోపా దేశాల్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో లక్షలాది మంది ప్రజలు సిరియాను విడిచి టర్కీ - ఐరోపా దేశాలకు శరణార్ధులుగా వెళ్లారు. అయినా యుద్ధం ముగిసిపోతుందనే సంకేతాలు రావటం లేదు. దీంతో ఈ యుద్ధం ముదిరిపాకాన పడి మూడో ప్రపంచ యుద్ధంగా మారుతుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే... అమెరికాలో ప్రస్తుతం అధ్యక్ష ఎన్నిక సందడి నెలకొని ఉంది. దీంతో సిరియా పరిస్థితిపై అమెరికా పూర్తిస్ధాయిలో దృష్టి సారించే పరిస్థితి లేదనే చెప్పాలి. అయితే, ఎన్నిక పూర్తయ్యి కొత్త అధ్యక్షుడు కొలువు తీరిన తర్వాత మాత్రం వారి తొలి సవాలు సిరియానే అనేది నిస్సందేహం! ఈ విషయంలో కొత్త అధ్యక్షుడు కఠినమైన నిర్ణయం తీసుకుంటే సిరియా యుద్ధం ముదురుతుందే తప్ప తగ్గే అవకాశం లేదు. దీంతో ముందుగా ఐరోపా దేశాలు, ఆ తర్వాత ఇతర దేశాలు ఈ ముగ్గులో చిక్కుకునే అవకాశం కనిపిస్తోంది.

ఇలా అమెరికా ఒకపక్క అధ్యక్ష ఎన్నికల్లో మునిగితేలుతుంటే మరోపక్క రష్యా చాపకింద నీరులా యుద్ధ సన్నాహాలు అధికం చేసింది. ప్రచ్ఛన్న యుద్ధం కాలం తర్వాత ఇంత భారీ స్ధాయిలో తన సైన్యాన్ని మోహరించటం రష్యాకు ఇదే తొలిసారి. తాజాగా నార్వేను చుట్టి ఇంగ్లీషు ఛానల్‌ నుంచి జిబ్రాల్టర్‌ జలసంథి - మధ్యధర సముద్రం మీదగా సిరియా దిశగా రష్యాకు చెందిన విమాన వాహక నౌక ఒకటి ప్రయాణం కట్టింది. ఈ సన్నాహాలు చూస్తే సిరియా యుద్ధంలో అమీతుమీ తేల్చుకోవాలనేదే రష్యా ఆలోచన అయిఉంటుందని ఐరోపా దేశాల్లోని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇదే క్రమంలో రష్యా యుద్ధ నౌక వెన్నంటే మరో ఏడు నౌకలు సిరియా దిశగా వెళ్తున్నాయి. వీటిలో అణు సామర్ధ్యం కల నౌక ఒకటి, రెండు యాంటీ సబ్‌ మెరైన్‌ యుద్ధ నౌకలు, ఆయుధ సామగ్రితో నాలుగు నౌకలు ఇందులో ఉన్నాయి.

అయితే... సిరియా సంక్షోభం కారణంగా, లేక సాకుగా చూపించి అమెరికాపై రష్యా పూర్తిస్థాయి యుద్ధానికి దిగుతుందని అనుకోలేమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కానీ మాస్కో నుంచి వెలువడుతున్న సంకేతాలు మాత్రం అమీతుమీ తేల్చుకోవటానికే పుతిన్‌ మొగ్గుచూపుతున్నట్లు అనుమానించాల్సి వస్తోంది. ఈ క్రమంలో "అణు యుద్ధానికి మీరు సిద్ధంగా ఉన్నారా?" అని రష్యాలో ప్రభుత్వ అజమాయిషీలో ఉన్న మీడియా ప్రజలను ప్రశ్నిస్తోంది. దీంతో రష్యా ఆ దిశగా ముందుకెళ్తుందని భావిస్తున్నారు. అలాగే... దేశ వ్యాప్తంగా పౌర రక్షణ కసరత్తు చర్యలు రష్యాలో పెద్దఎత్తున జరుగుతున్నాయి. యుద్ధ పరిస్థితుల్లో తీసుకోవలసిన జాగ్రత్తలు - అణు బాంబుల నుంచి రక్షణ ఎలా పొందాలి?, గ్యాస్‌ మాస్క్‌ లను ఎలా ఉపయోగించాలి? వంటి మొదలైన అంశాలపై అవగాహన పెంపొందించే కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దీంతో... రష్యా అయితే ఈ విషయంలో పక్కాగా ప్లాన్ చేసుకుంటుందని చెబుతున్నారు. ఇక అమెరికా ఆలోచన ఏమిటనేది... ఎన్నికల హడావిడి అయినతర్వాత తెలియొచ్చు!!

ఏది ఏమైనా... ఇక ప్రపంచ యుద్ధాలు అనే విషయం చరిత్ర పుస్తకాలకే పరిమితమని అనుకుంటూ వస్తోన్న తరుణంలో... తాజాగా సిరియా యుద్ధం ఆ పరిస్థితిని మార్చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయని చెప్పొచ్చు. దీంతో మూడో ప్రపంచ యుద్ధం ఎంతో దూరంలో లేదని, సిరియా కారణంగా రష్యా - అమెరికా వైరి పక్షాలుగా పెద్దఎత్తున తలపడబోతున్నాయని అనుమానపడే వారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా రోజు రోజుకీ పెరిగిపోతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/