Begin typing your search above and press return to search.

రష్యా-ఉక్రెయిన్ సంబంధం ఏంటి?.. యుద్ధం ఎందుకు?

By:  Tupaki Desk   |   2 March 2022 3:30 AM GMT
రష్యా-ఉక్రెయిన్ సంబంధం ఏంటి?.. యుద్ధం ఎందుకు?
X
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఇప్పుడు ఎక్కడ చూసినా యుద్ధం.. యుద్ధం... ఇవే వార్తలు. యుద్దంలో ఎలా జరుగుతుంది? అక్కడ చిక్కుకున్న వారిని ఎలా కాపాడుతున్నారు? ఎంతమంది దేశానికి వచ్చారు? ఇవే వార్తలు. అయితే ఈ ఉక్రెయిన్, రష్యా పంచాయితీ ఇప్పుడే మొదలైందా? ఎందుకు యుద్ధం తలెత్తింది? ఇరు దేశాల నడుమ ఉన్న సంబంధం ఏంటి? అనే వాటిపై అనేక సందేహాలు ఉన్నాయి. అయితే ఉక్రెయిన్, రష్యా పంచాయితీ ఇప్పటిది కాదు.. ఎప్పటినుంచో ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

రష్యా-ఉక్రెయిన్ మధ్య వివాదం దాదాపు ఎనిమిదేళ్లుగా కొనసాగుతోంది. ఇరు దేశాల నడుమ కోల్డ్ వార్ జరుగుతోంది. ఫలితంగా ఆ రెండు దేశాల ప్రజలనే కాకుండా ప్రపంచ దేశాలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈ రెండు దేశాలది కేవలం సరిహద్దు బంధం కాదు. వీటిది సాంస్కృతిక బంధం. అంటే రెండు దేశాల ప్రజలది ఒకే భాష. ఒకే మతం. దీనివల్ల ఎంత లాభం ఉంటుందో... అంతే నష్టం కూడా ఉంటుంది.

రష్యా-ఉక్రెయిన్ మధ్య సంబంధం ఇప్పుడే మొదలైంది కాదు. 9వ శతాబ్దంలోనే వీటికి సంబంధం ఉండేది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ ను రస్ అనే గ్రూప్ ఏర్పాటు చేసింది. రస్ స్కావేండియాకు చెందినది. ఇప్పుడు గొడవ పడుతున్న రెండు దేశాలకు మూలం కీవ్ రస్. ఇప్పటి రష్యా రాజధాని మాత్రం 12వ శతాబ్దంలో ఏర్పడింది.

రష్యా, ఉక్రెయిన్, బెలారస్ నుంచి బాల్టిక్ సముద్రం వరకు వ్లాదిమిర్ 1 కలిపారు. 988 సంవత్సరంలో దీనిని ఏకీకృతం చేశారు. తూర్పు స్లామిక్ భాషల నుంచి రష్యన్, ఉక్రెనియిన్, బెలారసియన్ భాషలు ఏర్పడ్డాయి. దీనిపై రష్యన్ అధ్యక్షుడు పుతిన్ ఇటీవలె పలు వ్యాఖ్యలు కూడా చేశారు. ఇరు దేశాల ప్రజలది ఒకే భాష, ఒకే మతం అని గుర్తు చేశారు. పేరుకు ఇలా ఉన్న... ఈ రెండు దేశాల నడుమ సంబంధాలు భిన్నంగా ఉన్నాయి. అందుకు వేర్పాటు వాదమే కారణం అని చెబుతున్నారు విశ్లేషకులు. ఈ దేశాలను విభజించిన తీరు వల్లే ఇరు దేశాల నడుమ గొడవలు తలెత్తుతున్నాయని అంటున్నారు.

కీవ్ చుట్టూ పోలిష్-లిథువేనియన్ కామన్వెల్త్ పాలనలో ఉన్నాయి. నేటికీ వాటికి సంబంధించిన ఆనవాళ్లు ఉన్నాయని చరిత్రకారులు చెబుతున్నారు. ఉక్రెయిన్ పశ్చిమ భాగంలో ప్రజలు యూనియెట్ చర్చి, లేదా తూర్పు క్యాథలిక్ చర్చిలో ప్రార్థనలు చేస్తారు. వీరు పోప్ ను మతాధిపతి గా భావిస్తారు. దీనికి భిన్నమైన సంస్కృతి క్రిమియాలో ఉంది.

కాలక్రమేణా జరిగిన మార్పుల వల్ల రూసిఫికేషన్ అనే పద్ధతి ఉక్రెయిన్ పై అనేక ఆంక్షలు విధించింది. ఉక్రేనియన్ భాషను నిషేధించింది. అంతేకాకుండా రష్యన్ ప్రజలను ఆర్థడాక్స్‌లోకి మారాలని ఒత్తిడి చేసింది. ఈ నేపథ్యంలో జాతీయవాదంపై స్పృహ కలిగింది. పశ్చిమ ప్రాంతంలో చాలామంది తమని తాము ఉక్రెనియన్లుగా ప్రకటించుకున్నారు.

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత పశ్చిమ ఉక్రెయిన్ ను రష్యా స్వాధీనం చేసుకుంది. ఆ దేశ అధ్యక్షుడు జోసెఫ్ స్టాలిన్ కఠిన నిబంధనలు విధించారు. ఎన్నో ఆంక్షలు పెట్టాడు. సామూహిక వ్యవసాయం లో పాల్గొనాలని ఒత్తిడి తెచ్చారు. తూర్పు ప్రాంతాన్ని రష్యాలో కలపడానికి బలగాల్ని దించారు. అందుకు చాలా కఠినంగా వ్యవహరించారు.

రష్యన్ల సంఖ్యను పెంచడానికి ఎన్నో దురాగతాలకు పాల్పడ్డారని చరిత్రకారులు చెబుతున్నారు. రష్యన్ ను ఆధిపత్య భాష గా మార్చారు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ ప్రజలు జాతియత భావాన్ని తెరమీదకు తెచ్చారు. 1991 సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం అనంతరం ఇరు దేశాలు వేర్వేరుగా ఉంటున్నాయి. సరిహద్దులను నిర్దేశించుకున్నాయి. అయితే అక్కడ జరిగిన కొన్ని లోపాల వల్లే ఇరు దేశాల నడుమ తరుచూ ఘర్షణలు జరుగుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఉక్రెయిన్ తూర్పు ప్రాంత ప్రజలకు మాస్కో తో కలవడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతారు. వారు ఆర్ధడాక్స్‌ మతాన్ని అవలంబిస్తారు. రష్యన్ భాష మాట్లాడడానికి ఆసక్తి చూపుతారు. కానీ పశ్చిమ ప్రాంతంలో క్యాథలిక్ మతాన్ని అవలంబిస్తారు. ఈ విధంగా పలు కారణాల వల్ల ఉక్రెయిన్-రష్యా నడుమ తరుచూ వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఆ దేశాల ప్రజలనే కాకుండా ప్రపంచ దేశాలను ఆందోళనకు గురి చేస్తున్నాయి.