Begin typing your search above and press return to search.

రష్యా-ఉక్రెయిన్ వార్: షాకిచ్చిన బీర్ కంపెనీలు

By:  Tupaki Desk   |   30 March 2022 12:30 AM GMT
రష్యా-ఉక్రెయిన్ వార్:  షాకిచ్చిన బీర్ కంపెనీలు
X
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం భీకరంగా కొనసాగుతోంది. నెలరోజులకు పైగా ఉక్రెయిన్ పై బాంబులతో రష్యా విరుచుకుపడుతోంది. ఇప్పటికే వేలాది మంది మరణించారు. వందలాది భవనాలు నేలమట్టమయ్యాయి. మూడు దఫాలుగా జరిగిన చర్చలు కూడా విఫలం కావడంతో రష్యా సైన్యం ఉక్రెయిన్ లో బీభత్సం సృష్టిస్తోంది. ఉక్రెయిన్ సైన్యం సైతం రష్యా దాడులను తిప్పికొడుతోంది.

ఉక్రెయిన్ పై యుద్ధాన్ని ఆపాలంటూ అగ్రరాజ్యం అమెరికా సహా బ్రిటన్, జపాన్ నాటో దళాలు రష్యాకు ఇప్పటికే సూచించాయి. రష్యాలో పెట్టుబడులను సైతం నిలిపివేస్తున్నామని వ్యాపార దిగ్గజాలు సైతం కీలక నిర్ణయం తీసుకున్నాయి.

ప్రపంచంలోని అతిపెద్ద బీర్ ఉత్పత్తిదారు అయిన 'బ్రూయింగ్ కంపెనీ' 'ఏబీ ఇన్ బెవ్' తాజాగా రష్యా నుంచి నిష్క్రమిస్తున్నట్టు పేర్కొంది. రష్యాన్ ఫెడరేటషన్ లో 'బడ్వైజర్) బ్రాండ్ ను ఉత్పత్తి చేయడానికి, విక్రయించడానికి లైసెన్స్ ను సస్పెండ్ చేయాలని అబ్ ఇన్ బెవ్ ఆదేశించింది.

ప్రపంచ మార్కెట్లో అబ్ ఇన్ బెవ్ వాటా ఏకంగా 28శాతంగా ఉంది. ఈ కంపెనీతోపాటు పాశ్చాత్య బ్రూయింగ్ దిగ్గజాలు కార్ల్స్ బర్గ్, హీనెకెన్ కూడా రష్యానుంచి వైదొలుగుతున్నట్టు సోమవారం వెల్లడించాయి. రష్యాలో తమ వ్యాపారాన్ని నిలిపివేసేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రస్తుత యుద్ధ నేపథ్యంలో ఇదే సరైందని పేర్కొన్నారు.

కాగా యుద్ధం నాటి నుంచి కంపెనీ షేర్లు భారీగా పతనమయ్యాయి. ఈ నిర్ణయం తర్వాత సోమవారం కంపెనీ షేర్ 4.2 శాతం అధికంగా పెరిగాయి. రష్యాలోనే మూడో అతిపెద్ద బ్రూవర్ హీనెకెన్ కూడా కంపెనీని మూసేస్తున్నట్టు ప్రకటించింది.

ఇలా రష్యా నుంచి వరుసగా కంపెనీలు పెట్టుబడులను, వ్యాపారాలను ఉపసంహరించుకోవడంతో ఆ దేశానికి భారీ నష్టం వాటిల్లుతోందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ కంపెనీల్లో వేలాది మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారికి కూడా ఈ సహాయం అందించనున్నట్లు కంపెనీలు వెల్లడించాయి.