Begin typing your search above and press return to search.

ఈ శతాబ్దంలోనే అతి పెద్ద విషాదం...?

By:  Tupaki Desk   |   8 March 2022 1:30 AM GMT
ఈ శతాబ్దంలోనే అతి పెద్ద విషాదం...?
X
యుద్ధం ఎపుడూ ఓటమే. ఆవేశం ఎపుడూ నష్టమే. ప్రేమ జయిస్తుంది. శాంతి లాభాన్ని చేకూరుస్తుంది. ఇవన్నీ అందరికీ తెలిసినవే. కానీ యుద్ధోన్మాదంతో ఉన్న వారికి ఈ హిత వచనాలు చెవికి ఎక్కవు. అందుకే సమరమే అంటూ రంకెలు వేస్తారు. రణ నినాదాన్ని చెవులారా వినాలనుకుంటారు.

ఇపుడు అదే జరిగింది. రష్యా ఉక్రెయిన్ మీద ఒక్కసారిగా పడిపోయింది. ప్రపంచ దేశాలు వద్దు అంటున్నా గత పన్నెండు రోజులుగా అక్కడ భీకరమైన యుద్ధాన్ని చేస్తోంది. ఉక్రెయిన్ అందాలను మొత్తం నేలమట్టం చేసింది. శిధిల సీమగా ఆ దేశాన్ని మార్చేసింది. నిన్నటిదాకా టూరిజం స్పాట్స్ గా ఉన్న ఉక్రెయిన్ లోని పలు ప్రదేశాలు ఇపుడు శ్మశాన వాటికలను తలపిస్తున్నాయి.

ఉక్రెయిన్ ఈ యుద్ధం పుణ్యామా దారుణంగా నష్టపోయింది ఆ నష్టం ఎంత అంటే ఐక్య రాజ్య సమితి లెక్కల ప్రకారం చూస్తే ఈ శతాబ్ధంలోనే అతి పెద్దది అంటున్నారు. ఇక ఉక్రెయిన్ నుంచి వలల పోతున్న వారు ఇతర ప్రాంతాలలో శరణార్ధులుగా మారుతున్న వారు దాదాపుగా రెండు కోట్ల మంది దాకా ఉంటారని అంటున్నారు.

ఇలా ఉక్రెయిన్ ని వదిలిపోతున్న వారిలో వృద్ధులు, మహిళలు, పిల్లలే ఎక్కువగా ఉన్నారు. తమ సొంత దేశం వదిలి పొరుగు దేశాలలో వీరంతా తలదాచుకుంటున్నారుట. ఈ విధంగా చూస్తే ఉక్రెయిన్ విషాదం ఈ శతాబ్దంలోనే అతి పెద్దది అంటున్నారు. 1940 ప్రాంతంలో జరిగిన రెండవ ప్రపంచ యుద్ధంలో కంటే కూడా ఇది పెద్ద విపత్తు అని కూడా అంచనా వేస్తున్నారు.

ఇప్పటికైనా యుద్ధం విరమించకపోతే మాత్రం ఉక్రెయిన్ కోలుకోవడం ఎప్పటికీ కష్టమనే అంటున్నారు. ఫిబ్రవరి 24కు ముందు ఉక్రెయిన్ స్థితికి చేరుకోవాలీ అంటే కొన్ని దశాబ్దాల కాలం పట్టినా ఆశ్చర్యం లేదు అన్న మాట కూడా ఉంది. మొత్తానికి తమ వారిని తమ దేశానికి కాకుండా చేసిన ఈ యుద్ధం అంతా పుతిన్ పుణ్యమేనని ఉక్రెయిన్ పౌరులు తిట్టుకుంటున్నారు.