Begin typing your search above and press return to search.

ఉక్రెయిన్‌పై ర‌ష్యా.. అప్ప‌టి వ‌ర‌కు యుద్ధం చేస్తూనే ఉంటుందా?

By:  Tupaki Desk   |   25 March 2022 10:47 AM GMT
ఉక్రెయిన్‌పై ర‌ష్యా.. అప్ప‌టి వ‌ర‌కు యుద్ధం చేస్తూనే ఉంటుందా?
X
ఉక్రెయిన్‌పై రష్యా దాడులు 31వ రోజు కూడా కొనసాగుతున్నాయి. ఇరవైపుల నుంచి శాంతి చర్చల్లో ఎలాంటి పురోగతి లేకపోగా.. యుద్ధంతో నష్టం ఇరువైపులా భారీగానే నమోదు అవుతోంది. ఈ తరుణంలో ఉక్రెయిన్‌ ఆర్మీ చేసిన ప్రకటన ఒకటి ఆసక్తికర చర్చకు దారి తీసింది. ఈ యుద్ధాన్ని రష్యా మే 9వ తేదీన ముగించాలని భావిస్తోందని ఉక్రెయిన్‌ ఆర్మీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఒక్క‌సారిగా ఈ విష‌యం ప్ర‌పంచ వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారింది.

ఇక‌, ఉక్రెయిన్‌పై ర‌ష్యా ఆ తేదీనే ఎందుకు యుద్ధాన్ని నిలుపుద‌ల చేయాల‌ని నిర్ణ‌యించుకునే విష‌యం కూడా ఆస‌క్తిగా మారింది. నాజీ.. జర్మనీపై తమ విజయానికి గుర్తుగా ఆరోజు రష్యా ‘విక్టరీ డే’ పేరుతో దేశవ్యాప్తంగా సంబురాలు జరుపుతుంటుంది. కాబట్టి, అదే రోజున ఉక్రెయిన్‌ యుద్ధాన్ని ముగించి.. ప్రకటన చేసుకునే(ఎలాంటిదనేది చెప్పలేదు) అవకాశం ఉందని రష్యా ఆర్మీ అంచనా వేస్తోంది. విక్టరీ డే అనేది 1945లో గ్రేటర్ జర్మన్ రీచ్ లొంగిపోయినందుకు గుర్తుచేసే సెలవుదినం.

ఈ మేరకు ఉక్రెయిన్‌ ఆర్మ్‌డ్‌ బలగాల్లోని జనరల్‌ స్టాఫ్‌ ఇంటెలిజెన్స్‌ విభాగపు సమాచారం ప్రకారం ఉక్రెయిన్‌ ఆర్మీ ఈ ప్రకటన విడుదల చేసినట్లు.. ది కీవ్‌ ఇండిపెండెట్‌ మీడియా హౌజ్‌ ట్వీట్‌ చేసింది. మ‌రోవైపు రష్యాపై ఉక్రెయిన్‌ సంచలన ఆరోపణలకు దిగింది. ఉక్రెయిన్‌ నుంచి పౌరులను రష్యా బలగాలు బలవంతంగా మాస్కో తరలిస్తున్నాయని, తద్వారా వాళ్లను బంధీలుగా చేసుకుని రాజధాని కీవ్‌ను ఆక్రమించుకునే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపిస్తోంది.

ఈ మేరకు 4 లక్షల మంది ఉక్రెయిన్‌ పౌరులను(అందులో 84,000 మంది పిల్లలు) కిడ్నాప్‌ చేసిందని ఉక్రెయిన్‌ ఆంబుడ్స్‌మన్‌ ల్యుద్‌మైల డెనిసోవా ఆరోపిస్తున్నారు. అయితే రష్యా మాత్రం ఆ ఆరోపణలను ఖండిస్తోంది. తాము ఎవ‌రినీ బందీలుగా త‌మ దేశంలోకి తీసుకురాలేద‌ని.. తెలిపింది. మ‌రోవైపు.. ఇరు దేశాల మ‌ధ్య శాంతి చ‌ర్చ‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి. అయితే.. ఎక్క‌డా ఎవ‌రూ వెన‌క్కి త‌గ్గ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

ఇటీవ‌ల నాటోలో తాము చేరాల‌నే ఉద్దేశాన్ని వెన‌క్కి తీసుకుంటున్న‌ట్టు ఉక్రెయిన్ అధ్య‌క్షుడు ప్ర‌క‌టించారు. దీంతో అయినా.. ర‌ష్యా కొంత వెన‌క్కిత‌గ్గుతుంద‌ని ఆశించారు కానీ, అది జ‌ర‌గ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌స్తుతం వెల్ల‌డైన అంశాల‌ను బ‌ట్టి. .మే 9వ తేదీ వ‌ర‌కు యుద్ధం కొన‌సాగితే.. ఉక్రెయిన్ ఇక‌, ఎడారి అయిపోతుంద‌ని.. అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.