Begin typing your search above and press return to search.

అమెరిక‌న్ల‌కు వ‌ణుకు పుట్టే మాట చెప్పిన ర‌ష్యా

By:  Tupaki Desk   |   7 Oct 2017 5:34 PM GMT
అమెరిక‌న్ల‌కు వ‌ణుకు పుట్టే మాట చెప్పిన ర‌ష్యా
X
మొండిత‌నం..అంత‌కు మించిన పెంకిత‌నం.. ప్ర‌పంచం ఏమైపోతేనేం త‌న మాట‌ను నెగ్గించుకునే మూర్తీభ‌వించే మూర్ఖ‌త్వం ఉత్త‌ర‌కొరియా అధ్య‌క్షుడు కిమ్ సొంతం. గ‌డిచిన కొంత‌కాలంగా అణ్వ‌స్త్రాలు.. వ‌రుస క్షిప‌ణి ప‌రీక్ష‌ల‌తో ప్ర‌పంచానికి కొత్త దిగులు తెచ్చి పెట్టారు. మూడో ప్ర‌పంచ యుద్ధం గురించి ఎలాంటి ఆలోచ‌న‌లు లేని డిజిట‌ల్ ప్ర‌పంచంలో.. త‌న తీరుతో ఆ ప్ర‌మాదం ప‌క్క‌నే పొంచి ఉంద‌న్న భావ‌న‌కు గురి చేయ‌టంలో కిమ్ స‌క్సెస్ అయ్యారు.

ప్ర‌పంచానికి పెద్ద‌న్న లాంటి అమెరికా పేరెత్తితే చాలు.. అంతెత్తు ఎగిరిప‌డే కిమ్‌.. త‌న త‌దుప‌రి లక్ష్యం అమెరికానే అని చెప్ప‌ట‌మే కాదు.. తాను వేసే బాంబుల‌తో అమెరికాలో ఎంత విల‌యం చోటు చేసుకుంటుందో గ్రాఫిక్స్ తో వీడియోలు త‌యారు చేయించుకొని మ‌రీ ఆనందించే తత్త్వం కిమ్ సొంతం.

కిమ్ వీడియోలు చేసిన చాలామంది ఆయ‌న గ్రాఫిక్స్ ఆనందంతోనే ప‌రిమిత‌మ‌వుతార‌ని భావించారు. అయితే.. అగ్ర‌రాజ్యానికి కిమ్ రూపంలో పొంచి ఉన్న ప్ర‌మాదం ఎంత‌న్న‌ది ఇటీవ‌ల కాలంలో ప్ర‌యోగించిన అణ్వ‌స్త్ర ప్ర‌యోగాల‌తో అర్థ‌మైంది. అప్ప‌టి నుంచి కిమ్‌ను ఉద్దేశించి తొంద‌ర‌ప‌డి మాట్లాడే తీరుకు త‌న‌కు తాను చెక్ చెప్పుకున్నారు అమెరికా అధినేత ట్రంప్‌. ఇదిలా ఉంటే.. ఉత్త‌ర‌కొరియాను త‌క్కువ‌గా అంచ‌నా వేస్తే అడ్డంగా బుక్ కావ‌టం ఖాయ‌మ‌న్న విష‌యాన్ని తాజాగా ర‌ష్యాకు చెందిన ప్ర‌తినిధి ఒక‌రు స్ప‌ష్టం చేస్తున్నారు.

ర‌ష్యా అంత‌ర్జాతీయ వ్య‌వ‌హారాలు చూసే క‌మిటికి చెందిన ఆంటోన్ మోరోజోవ్ అనే అధికారి.. మ‌రో ఇద్ద‌రు క‌లిసి ఈ నెల (అక్టోబ‌రు) 2 నుంచి 6 వ‌ర‌కు ప్యాంగ్ యాంగ్ లో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా వారు ఉత్త‌ర‌కొరియా క్షిప‌ణి వ్య‌వ‌స్థ‌ల్ని ప‌రిశీలించారు.

దీనికి సంబంధించిన వివ‌రాల్ని ఆయ‌న వెల్ల‌డిస్తూ.. స‌దూర లక్ష్యాల్ని సైతం టార్గెట్ చేసే భారీ క్షిప‌ణి ప‌రీక్ష‌కు ఉత్త‌ర కొరియా సిద్ధ‌మ‌వుతుంద‌ని.. వారికి ప్ర‌స్తుతం ఉన్న సామ‌ర్థ్యంతో అమెరికాలోని ప‌శ్చిమ తీర ప్రాంతాల్ని ధ్వంసం చేసే స‌త్తా ఉంద‌ని వారు చెప్ప‌టం గ‌మ‌నార్హం.

ఉత్త‌ర కొరియా క్షిప‌ణి బ‌లాన్ని చూసిన‌ప్పుడు త‌మ‌కు అనిపించిందేమంటే.. గ‌తంతో పోలిస్తే కొరియా మ‌రింత బ‌లంగా యుద్ధం చేయ‌గ‌లిగేలా ఉంద‌నిపించిన‌ట్లుగా చెప్పారు. త‌మ ప‌రిశీల‌న సంద‌ర్భంగా అమెరికాలోని ప‌శ్చిమ తీర ప్రాంతాల్ని ఢీ కొట్టే స‌త్తా ఉంద‌న్న విష‌యాన్ని స్ప‌ష్టం చేసే లెక్క‌ల స‌మాచారాన్ని త‌న‌కిచ్చిన్న‌ట్లుగా స‌ద‌రు ర‌ష్యా నిపుణుడు వెల్ల‌డించారు. ర‌ష్యా నిపుణుడి మాట అమెరిక‌న్ల‌కు కొత్త భ‌యాన్ని క‌లిగిస్తుంద‌న‌టంతో సందేహం లేదని చెప్పాలి.