Begin typing your search above and press return to search.

ఉక్రెయిన్ పై దండయాత్ర.. పుతిన్ చేసిన చారిత్రక తప్పులేంటి?

By:  Tupaki Desk   |   19 Sep 2022 12:30 AM GMT
ఉక్రెయిన్ పై దండయాత్ర.. పుతిన్ చేసిన చారిత్రక తప్పులేంటి?
X
రాజులు.. రాజ్యాలు పోయాయి.. ప్రజాస్వామ్య దేశాలుగా ఎవరి బతుకు వారు బతుకుతూ.. మానవ సమాజాన్ని మరింత మెరుగ్గా తీర్చి దిద్దేందుకు ప్రయత్నాలు జరుగుతున్న వేళ.. రాజ్య విస్తరణ కాంక్ష.. పరాయి దేశాల్నిఏదో ఒక రకంగా తమ దారికి తెచ్చుకోవటానికి వీలుగా కొన్ని దేశాలు చేస్తున్న ప్రయత్నాలు తెలిసిందే. ఇలాంటి కోవలోకే వస్తుంది రష్యా అధినేత వాద్లిమర్ పుతిన్ సామ్రాజ్య కాంక్ష. పైకి ఏం చెప్పినా.. లోపల మాత్రం బంగారు బాతు లాంటి ఉక్రెయిన్ మీద అధిక్యతను సంపాదిస్తే.. మరింత బలపడతామన్న ఆయన ఆలోచన ఇప్పుడు ఖరీదైన తప్పుగానే కాదు.. చారిత్రక పొరపాటుగా మారిందన్నది ఇప్పుడు బలంగా వినిపిస్తున్న మాట.

యుద్ధం మొదలు పెట్టిన వారంలోపే ఉక్రెయిన్ ను లొంగదీసుకుంటామని బీరాలు పలికిన రష్యా.. నెలలు గడుస్తున్నా పట్టు సాధించటం తర్వాత.. చేజికొచ్చిన పట్టును సైతం విడుచుకోవాల్సిన పరిస్థితి. అయినప్పటికి బీరాలు పలికే విషయంలో పుతిన్ అస్సలు తగ్గట్లేదు. తాజాగా ఉజ్బెకిస్తాన్ లో జరిగిన సదస్సుకు హాజరైన ఆయన.. యుద్ధం మరిన్నిరోజులు కొనసాగుతుందన్న సంకేతాల్ని తన మాటలతో చెప్పే ప్రయత్నం చేశారు.

వారంలో ముగుస్తుందని భావించిన యుద్ధం ఇంతకాలం ఎందుకిలా? అసలేం జరిగింది? పుతిన్ ఎక్కడెక్కడ తప్పులు చేశారు? బలహీనమనుకున్న ఉక్రెయిన్ అంత బలంగా ఎలా పోరాడుతోంది? తాజా యుద్ధంతో అపార నష్టాన్ని మీద వేసుకున్న రష్యా ఆర్థిక పరిస్థితి మరింతగా దిగజారాల్సిన అవసరం ఏమిటి? అన్న సందేహాలకు ఇప్పుడు సమాధానాలు వెతుకుతున్నారు. అలా చేసినప్పుడు ముందుకు వచ్చే అంశాల్ని చూస్తే..

- అమెరికాతో సహా నాటో దేశాలన్నీ కలిసి కట్టుగా ఉక్రెయిన్ కు ఇంతలా సపోర్టు చేస్తాయన్న ఆలోచన లేకపోవటం.

- యుద్ధం ఎన్నాళ్లు జరిగినా ఉక్రెయిన్ ను ఆదుకోవటానికి.. సాయం చేయటానికి సిద్ధంగా ఉండటం

- హిమార్స్ రాకెట్ వ్యవస్థతో ఉక్రెయిన్ సేనలు వందలాది రష్యన్ స్థావరాల్ని ధ్వంసం చేసింది.

- తాజాగా అమెరికా 1500 కోట్ల డాలర్ల విలువైన సైనిక సాయం చేస్తాన్న హామీతో.. రష్యా పరోక్షంగా మరింత కాలం యుద్ధం తప్పదు. నిజానికి రష్యా చేస్తున్న యుద్ధం ఉక్రెయిన్ తో కాదు.. దానికి దన్నుగా నిలిచిన పశ్చిమ దేశాలతో అన్నది మర్చిపోకూడదు.

- ఉక్రెయిన్ మీద దాడులకు దిగితే అమెరికా.. యూరప్ దేశాలు ఆంక్షలు విధించినా.. చమురు, గ్యాస్ కోసం తమపై ఆధారపడతారని భావించారు. కానీ.. అది తప్పని తేలింది.

- ఉక్రెయిన్ పై దాడి షురూ చేసిన నాటి నుంచి రష్యాపై 9200లకు పైగా ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. వెయ్యికి పైగా మల్టీ నేషనల్ కంపెనీలు రష్యాను విడిచిపెట్టాయి. ఆయుధాల ఉత్పత్తి తగ్గింది. చివరకు ఉత్తర కొరియా నుంచి కూడా ఆయుధాల్ని కొనాల్సిన పరిస్థితి.

- యుద్ధం చిటికెలో ముగుస్తుందనే మితిమీరిన ఆత్మవిశ్వాసమే పుతిన్ కొంప ముంచింది. ప్లాన్ బి మీద సరైన కసరత్తు లేకుండానే యుద్ధానికి దిగి చేతులు కాల్చుకున్నపరిస్థితి. ఇప్పుడు వెనక్కి వెళ్లలేని.. ముందుకు పోలేని సిత్రమైన పరిస్థితి. దీంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి.

- ఉక్రెయిన్ లో కిరాయి సైనికుల్ని దింపటం పుతిన్ చేసిన పెద్ద తప్పిదం. వాగ్నర్ సంస్థతో పాటు పశ్చిమాసియా దేశాలకు చెందిన కొందరిని కాంట్రాక్టు.. ఔట్ సోర్సింగ్ పై నియమించుకొని వారిపై రష్యా ఆధారపడింది. అందుకు భిన్నంగా ఉక్రెయిన్ సైనికులు మాత్రం తమ దేశాన్ని ఎలాగైనా కాపాడుకోవాలన్న తలంపుతో పోరాడుతున్నారు.

- కిరాయి సైనికులకు తక్కువ జీతాలు ఇస్తూ ఉండటం కూడా దెబ్బేసింది. పరిచయం లేని భూభాగంలోకి వచ్చి పోరాడటం కిరాయి సైనికులకు ప్రతికూలంగా మారుతున్న పరిస్థితి.

- ఏప్రిల్ లో కీవ్.. ఉత్తర ప్రాంతంలో ఉక్రెయిన్ ప్రతిఘటన ధాటికి రష్యా సేనలు వెనుదిరిగాయి. ఆ వేళలో బలగాల్ని డోన్బాస్ మీదకు పంపి వ్యూహాత్మక తప్పిదం కూడా పుతిన్ తాజా ఇబ్బందికర పరిస్థితి కారణం.

- రష్యా సైనికుల్లో అంకిత భావం మిస్ అయి.. ఎంత త్వరగా వెనుదిరిగి వెళ్లి కుటుంబాలతో గడపాలన్న ఆలోచనతో ఉంటే.. ఉక్రెయిన్ సైనికులు మాత్రం దేశం కోసం దేనికైనా సిద్ధమన్న భావోద్వేగంతో యుద్ధం చేస్తున్నారు.