Begin typing your search above and press return to search.

భార‌త్ కు ర‌ష్యా టీకా.. ఎప్పుడంటే..?

By:  Tupaki Desk   |   27 April 2021 3:02 PM IST
భార‌త్ కు ర‌ష్యా టీకా.. ఎప్పుడంటే..?
X
దేశంలో క‌రోనా విల‌య తాండ‌వం రోజురోజుకూ ఉధృత‌మ‌వుతోంది. నిత్యం మూడు ల‌క్ష‌ల కేసులు నమోద‌వుతుండ‌డంతో.. 2 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోతుండ‌డంతో.. ప‌రిస్థితి చేయి దాటిపోయిందా? అనే సందేహం క‌లుగుతోంది. ఈ దారుణ మార‌ణ‌హోమాన్ని చూసి ప్ర‌పంచం మొత్తం చ‌లించిపోతోంది.

దీంతో.. ఎవ‌రికి చేత‌నైన‌ స‌హాయం వారు అందించేందుకు ముందుకు వ‌స్తున్నారు. ఇప్ప‌టికే ప‌లు దేశాలు ఆక్సీజ‌న్‌, వైద్య స‌హాయం అందించేందుకు ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ జాబితాలో ర‌ష్యాకూడా ఉంది. ఆక్సీజ‌న్, రెమ్ డెసివ‌ర్ ఇంజ‌క్ష‌న్లు అందిస్తామ‌ని ఆ దేశం ఈ మ‌ధ్య‌నే ప్ర‌క‌టించింది.

తాజాగా.. ఆ దేశం ఉత్ప‌త్తి చేసిన కొవిడ్ టీకా ‘స్పుత్నిక్‌-వి’ని ఇండియాకు స‌ర‌ఫ‌రా చేయ‌బోతోంది. ఇప్ప‌టికే ఇండియాలో కొవాగ్జిన్, కొవిషీల్డ్ వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ర‌ష్యా టీకా రాబోతుండ‌డంతో.. మొత్తం మూడు టీకాలు ప్ర‌జ‌ల‌కు అంద‌నున్నాయి.

మే 1న‌ ర‌ష్యా టీకా తొలివిడ‌త స‌ర‌ఫ‌రా చేయ‌నున్న‌ట్టు ర‌ష్యా డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ హెడ్ దిమిత్రివ్ తెలిపారు. నెలాఖ‌రు వ‌ర‌కు 50 మిలియ‌న్ల టీకాల‌ను పంపిణీ చేస్తామ‌ని వెల్ల‌డించారు. స్పుత్నిక్-వి స‌ర‌ఫ‌రాకు భార‌త్ ఇటీవ‌లే అనుమ‌తి ఇచ్చిన సంగ‌తి తెలిసిందే.

వ‌చ్చేనెల 1 నుంచి దేశంలో 18 సంవ‌త్స‌రాల నుంచి 45 సంవ‌త్స‌రాల్లోపు వారంద‌రికీ టీకా వేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన సంగ‌తి తెలిసిందే. అయితే.. దేశంలో అందుబాటులో ఉన్న రెండు టీకాల‌తోనే ఇది సాధ్యం కాద‌ని ప్ర‌భుత్వం భావించిన‌ట్టు స‌మాచారం. అందుకే.. ర‌ష్యా టీకాకు అనుమ‌తులు జారీచేసిన‌ట్టు తెలుస్తోంది.