Begin typing your search above and press return to search.

పంజాబ్ లో రష్యా ఆయుధం ?

By:  Tupaki Desk   |   2 Jun 2022 3:29 AM GMT
పంజాబ్ లో రష్యా ఆయుధం ?
X
ఇపుడిదే విషయం భద్రతా బలగాలతో పాటు పంజాబ్ పోలీసుల్లో సంచలనంగా మారింది. రెండు రోజుల క్రితం పంజాబ్ లో సింగర్ సిద్ధూ మూసేవాల హత్య జరిగిన విషయం తెలిసిందే. ఈ హత్య చేయటానికి దుండగులు 30 రౌండ్లు కాల్పులు జరిపారు. మరీ పాయింట్ బ్లాంక్ లో కాల్చటంతో సిద్ధూ కారులోనే చరిపోయాడు. ఘటనను దర్యాప్తుచేస్తున్న పోలీసులు దొరికిన బుల్లెట్ షెల్స్ ను బట్టి అవన్నీ ఏకే 47 రైఫిల్ వాడినట్లు అనుకున్నారు.

అయితే షెల్స్ ను నిపుణులతో పరీక్షలు జరిపించినపుడు అవి ఏకే 47 రైఫిల్ బుల్లెట్లు కావని బయటపడింది. దాంతో పోలీసులు ఆశ్చర్యపోయారు. మరింత లోతుల్లోకి వెళ్ళి పరిశోధన చేసినపుడు ఆ బుల్లెట్లు ఏఎన్ 94 రైఫిల్ బుల్లెట్లని బయటపడింది.

ఏఎన్ 94 రైఫిల్సంటే ప్రపంచం మొత్తంమీద రష్యా సైన్యం తప్ప మరోదేశం ఏదీ వాడటంలేదు. రష్యా సాయంతోనే ఐరిష్ రిపబ్లిక్ ఆర్మీ వేర్పాటువాదుల దళాల దగ్గర కూడా ఉన్నట్లు తేలింది. ఈ దళాలకు కూడా రష్యానే అందించుంటుందని అనుమానిస్తున్నారు.

సరే వాళ్ళసంగతి ఎలాగున్నా రష్యాలో ఉండాల్సిన తుపాకీ ఏఎన్ 94 పంజాబ్ లోని సిద్ధూ వ్యతిరేక ముఠాకు ఎలా దొరికిందనేది పెద్ద ప్రశ్నగా మారిపోయింది. హంతుకులు ముందు సిద్ధూని ఇంటిదగ్గరే కాల్చేయాలని ప్లాన్ చేశారట. ఇంటిదగ్గరకు కూడా వెళ్ళారట. అయితే ఇంటిదగ్గర హెవీ సెక్యూరిటి ఉండటం పైగా అందరి దగ్గరా ఏకే 47 తుపాకీలు ఉండటంతో సిద్ధూని కాల్చి చంపటం కష్టమని అనుకుని వెనక్కు వెళ్ళిపోయారట.

ఇదే విషయాన్ని కెనాడలో ఉంటున్న గోల్డీబ్రార్ అనే గ్యాంగ్ స్టర్ తో చెబితే ఆయనే రష్యా నుండి ఏఎన్ 94 తుపాకీని తెప్పించుంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. మరి బ్రార్ ఒకటే తుపాకీ తెప్పించారా ఇంకా ఉన్నాయా అనేది సంచలనంగా మారింది.

ఈ రైఫిల్ నుండి బుల్లెట్ సెకనుకు 900 మీటర్ల వేగంతో బయటకు వస్తుంది. 700 మీటర్ల దూరంలోని టార్గెట్ ను కూడా కచ్చితంగా ఛేదిస్తుంది. నిముషానికి 600 రౌండ్లు పేల్చగలదు. అంటే మన సైన్యం దగ్గర కూడా లేని అత్యంతాధునికమైన రైఫిల్ ఇపుడు గ్యాంగ్ స్టర్ దగ్గరున్న విషయం బయటపడింది.