Begin typing your search above and press return to search.

రష్యన్లు లైంగిక దాడులను 'ఆయుధంగా' ప్రయోగిస్తున్నారా..!

By:  Tupaki Desk   |   30 Nov 2022 4:30 PM GMT
రష్యన్లు లైంగిక దాడులను ఆయుధంగా ప్రయోగిస్తున్నారా..!
X
ఈ ఏడాది ఫిబ్రవరిలో రష్యా-ఉక్రెయిన్ మధ్య వార్ మొదలైంది. గత పది నెలలుగా యుద్ధం నిరాటకంగా కొనసాగుతూనే ఉండటంతో అనేక మంది అమాయక ప్రజలు ప్రాణాలను కోల్పోతున్నారు. ఉక్రెయిన్ పై పట్టు కోసం ప్రయత్నిస్తున్న రష్యన్ సేనలను ఆ దేశ సైనికులు సమర్ధవంతంగా నిలువరిస్తున్నారు. దీంతో ఇరు దేశాల మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది.

రష్యా-ఉక్రెయిన్ వార్ లో ఒకసారి రష్యా పట్టు సాధిస్తే మరోసారి ఉక్రెయిన్ తన బలాన్ని చాటుకుంటోంది. ఈ నేపథ్యంలో ఈ రెండు దేశాల మధ్య నెలల తరబడి కొనసాగుతూనే ఉంది. రష్యా ముందు ఉక్రెయిన్ సైన్యం చిన్నదే అయినప్పటికీ ఆ దేశ సైనికులు తెగువతో పోరాడుతున్నారు. ఉక్రెయిన్ పౌరులు సైతం ఆ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీ పిలుపుతో యుద్ధంలోకి దిగి పోరాడుతున్నారు.

ఉక్రెయిన్ కు నాటో దేశాలు ఆయుధాలు సరఫరా చేస్తుండటంతో ఆ దేశానికి ఆయుధ కొరత లేకుండా పోతుంది. ఇదే సమయంలో రష్యా నెలల తరబడి యుద్దం కొనసాగుతుండటంతో ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ పై కొంత వ్యతిరేక వస్తుంది. ఈ క్రమంలోనే రష్యా వీలైనంత త్వరగా ఉక్రెయిన్ ను స్వాధీనం చేసుకొని యుద్ధానికి ముగింపు పలకాలని భావిస్తోంది.

అయితే ఉక్రెయిన్ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురువుతుండటంతో రష్యా సైన్యం ఏమి చేయలేని పరిస్థితి నెలకొంది. ఇలాంటి తరుణంలో రష్యన్ సేనలు ఉక్రెయిన్ మహిళలపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారనే ఆరోపణలు గత కొంతకాలంగా విన్పిస్తున్నాయి. ఇదే అంశాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీ భార్య.. ఆదేశ ప్రథమ పౌరురాలు జెలెన్ స్కా సైతం ధృవీకరిస్తూ మాట్లాడటం సంచలనంగా మారింది.

యుద్ధాలు.. అల్లర్ల సమయంలో లైంగిక హింసను అరికట్టాలనే అంశంపై లండన్ వేదికగా జరుగుతున్న అంతర్జాతీయ సదస్సులో జెలన్ స్కా ప్రసంగించారు. యుద్ధం పేరుతో రష్యన్ సైనికులు ఉక్రెయిన్ మహిళలపై అకృత్యాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకరిపై అధిపత్యం చెలాయించడానికి లైంగిక హింసను ప్రయోగించడమనేది అత్యంత నీచమైన చర్య అన్నారు.

యుద్దం సమయంలో తమపై జరిగిన అకృత్యాలపై మహిళలు బయటికి వెల్లడించలేరని తెలిపారు. ఉక్రెయిన్ పై రష్యన్ బలగాలు ప్రయోగిస్తున్న మరో ఆయుధం లైంగిక హింస అని దీనిని ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. ఉక్రెయిన్ మహిళలపై రష్యన్లు చేస్తున్న అకృత్యాలు వారి భార్యలు సైతం ప్రోత్సహిస్తుండటం విచారకరమని జెలెన్ స్కా తెలిపారు.

యుద్ధ సమయాల్లో లైంగిక హింసకు పాల్పడే వారికి గుర్తించి కఠినంగా శిక్షించాల్సిన అవశ్యకత ఉందని జెలెన్ స్కా స్పష్టం చేశారు. రష్యన్ సేనలపై జెలెన్ స్కా చేసిన ఆరోపణలు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆమె వ్యాఖ్యలపై రష్యన్లు ఎలా స్పందిస్తారనేది మాత్రం వేచి చూడాల్సిందే..!


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.