Begin typing your search above and press return to search.

ప‌క్క దేశాల‌కు పారిపోతున్న ర‌ష్య‌న్ యువ‌త‌.. కార‌ణ‌మిదే!

By:  Tupaki Desk   |   28 Sep 2022 8:16 AM GMT
ప‌క్క దేశాల‌కు పారిపోతున్న ర‌ష్య‌న్ యువ‌త‌.. కార‌ణ‌మిదే!
X
ఉక్రెయిన్ పైన ర‌ష్యా యుద్ధం ప్రారంభించి 8 నెల‌లు పూర్తి కావ‌స్తోంది. అయితే ఇంత‌వ‌ర‌కు ఆ దేశంపై ప‌ట్టు సాధించ‌లేక‌పోయింది. మొద‌ట్లో కొన్ని ప్రాంతాల‌ను త‌న అధీనంలోకి తీసుకుంటూ వెళ్లిన ర‌ష్యా రానురాను చేతులెత్తేసింది. ఉక్రెయిన్ తేలిగ్గా లొంగిపోతుంద‌ని ర‌ష్యా ఆశించ‌గా.. అదేమీ జ‌ర‌గ‌క‌పోగా ఉక్రెయిన్ ఇంకా మొండిగా పోరాడుతోంది. ఉక్రెయిన్‌కు బ్రిట‌న్‌, అమెరికా, తదిత‌ర దేశాల నుంచి ఆయుధాలు అందుతున్నాయి. వీటితో ఉక్రెయిన్‌.. ర‌ష్యాపై పోరాడుతోంది.

ఇప్ప‌టికే వేలాది మంది సైనికులు మర‌ణించారు. వీరంతా ఉక్రెయిన్ సైనికులు అనుకుంటే పొర‌పాటే. వీరిలో దాదాపు 20,000కు పైగా ర‌ష్య‌న్ సైనికులు కూడా ఉన్నారు. ఉక్రెయిన్ లొంగ‌క‌పోవ‌డం, భారీ ఎత్తున సైనికులను కోల్పోవ‌డంతో మ‌రింత మంది సైన్యాన్ని సేక‌రించాల‌ని ర‌ష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ నిర్ణ‌యించుకున్నారు. ఉక్రెయిన్ యుద్ధంలో విజ‌యం సాధించ‌డానికి మ‌రింత సైనికుల‌ను స‌మీక‌రించాల‌ని పుతిన్ ఇప్ప‌టికే నిర్ణ‌యం తీసుకున్నారు.

ఈ నేప‌థ్యంలో గతంలో సైన్యంలో పనిచేసిన అనుభవం ఉన్నవారు, మిలిట‌రీ శిక్షణ పొందిన వారు యుద్ధంలోకి బలవంతంగా తీసుకోనున్నారు. దీంతో త‌మ దేశాధ్య‌క్షుడు పుతిన్ నిర్ణయంతో రష్యా యువతలో భయాందోళనలు ఏర్పడ్దాయి. దీంతో ఉక్రెయిన్‌తో యుద్ధం చేయ‌డం లేని యువ‌కులు పెద్ద ఎత్తున దేశాన్ని వదిలిపెట్టి పారిపోతున్నారు. ర‌ష్యా స‌రిహ‌ద్దు దేశాలైన జార్జియా, క‌జ‌కిస్థాన్ త‌దిత‌ర దేశాల‌కు ప‌య‌న‌మ‌వుతున్నారు.

ఇప్పటికే వేలాది వాహనాలు జార్జియా దేశ సరిహద్దుల్లో ఉండ‌టం గ‌మ‌నార్హం. రష్యా యువ‌కులు భారీగా జార్జియాలోకి వెళ్తోంది. అలాగే కజకిస్తాన్, ఫిన్లాండ్, మంగోలియా దేశాల్లోకి వెళ్లేందుకు ర‌ష్య‌న్ యువ‌కులు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు వార్తా క‌థ‌నాలు పేర్కొంటున్నాయి. దీంతో ఆయా దేశాలకు రష్యాతో ఉన్న సరిహద్దు వద్ద పెద్ద ఎత్తున వాహనాలు క్యూ కట్టాయ‌ని తెలుస్తోంది. ఇక ర‌ష్య‌న్ యువ‌త ఎక్కువ‌గా వెళ్తున్న‌ జార్జియా వద్ద సరిహద్దు దాటేందుకు 48 గంటల సమయం పడుతోంద‌ని స‌మాచారం. ఏకంగా 3000 వాహ‌నాలు ఇక్క‌డ నిలిచిపోయాయ‌ని అంటున్నారు.

కాగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచే చాలా మంది రష్యా ప్రజలు జార్జియా రాజధాని టిబిలిసికి వెళ్లిపోవ‌డం గ‌మ‌నార్హం. పది లక్షల జనాభా ఉండే టిబిలిసిలోకి 40,000 మంది రష్యన్లు వ‌చ్చిన‌ట్టు అంచ‌నా.

రష్యా అధ్యక్షుడు పుతిన్ నుంచి పాక్షికంగా సైనిక సమీకరణ చేయాల‌ని ఆదేశాలు ఇవ్వ‌గానే చాలా మంది అన్నీ వదిలిపెట్టి వేరే దేశాలకు ప్ర‌యాణం క‌ట్టారు. రష్యా నుంచి ఇతర దేశాలకు వెళ్లే విమానాల టికెట్లు రికార్డు స్థాయిలో బుక్ అవ్వ‌డం గ‌మ‌నార్హం. మ‌రోవైపు వేలాది మంది ర‌ష్య‌న్ల రాకతో జార్జియా రాజధాని టిబిలిసిలో అపార్ట్మెంట్ల రేట్లు రికార్డు స్థాయిలో పలుకుతున్నాయ‌ని చెబుతున్నారు.

ర‌ష్య‌న్ యువ‌కులు దేశం వ‌దిలి పారిపోతుండ‌టంతో దేశ స‌రిహ‌ద్దుల‌ను మూసివేయాల‌ని ఆ దేశం నిర్ణ‌యించ‌వ‌చ్చ‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలోనే స‌రిహ‌ద్దులు మూయ‌క‌ముందే దేశాన్ని దాటి పోవాల‌ని యువ‌త ప్ర‌య‌త్నిస్తోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.