Begin typing your search above and press return to search.

సాధువులను కొట్టి చంపిన గ్రామస్థులు ...ఎందుకంటే ?

By:  Tupaki Desk   |   20 April 2020 6:40 AM GMT
సాధువులను కొట్టి చంపిన గ్రామస్థులు ...ఎందుకంటే ?
X
మహారాష్ట్రలో ఒక దారుణమైన సంఘటన జరిగింది. ఇద్దరు సాధువులు సహా ముగ్గురిని స్థానికులు కొట్టి చంపిన ఘటన మహారాష్ట్రలో ఇప్పుడు కలకలం రేపుతోంది. ఈ ఘటనపై ప్రభుత్వం అత్యున్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించింది. ఈ ఘటనతో ప్రమేయం ఉన్నట్లుగా అనుమానిస్తోన్న వారిలో 110 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ సంఘటన పై పూర్తి వివరాలు చూస్తే ... మహారాష్ట్ర పాల్‌ ఘర్ జిల్లాలోని గడ్‌ చించలే గ్రామంలో నాలుగు రోజుల కింద ఈ ఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు చిన్నపిల్లలను ఎత్తుకుని వెళ్తున్నారనే పుకార్లు కొద్దిరోజులుగా పాల్‌ ఘర్ జిల్లాలో వెలువడుతున్నాయి. పిల్లలను చంపి, వారి కిడ్నీలను దొంగిలిస్తున్నారనే పుకార్లు వచ్చాయి. లాక్‌ డౌన్ కొనసాగుతున్నప్పటికీ.. జిల్లాలోని మారుమూల గ్రామాల్లో వాహనాల్లో అపరిచితులు తిరుగాడుతున్నారనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. దీనితో అప్రమత్తమైన గ్రామస్తులు.. 24 గంటల పాటు వంతులవారీగా కాపలా ఉంటున్నారు.

ఇదే సమయంలో గడ్‌ చించలే గ్రామం గుండా ఖన్వెల్ వైపు ఓ వాహనాన్ని వారు అడ్డుకున్నారు. డ్రైవర్ సహా అందులో ఇద్దరు సాధువులు ఉన్నారు. గ్రామస్తులు వారిని పలు ప్రశ్నలు అడగ్గా . వారు సరైన సమాధానాన్ని చెప్పలేకపోవడంతో గ్రామస్తుల అనుమానాలు మరింత బలపడ్డాయి. వారిని వాహనంలో నుంచి బయటికి లాగి, మూక దాడికి పాల్పడ్డారు దీనితో ఆ ముగ్గురూ సంఘటనా స్థలంలోనే మరణించారు. మృతులను సుశీల్‌ గిరి మహరాజ్, నీలేష్ తేల్‌ గడే, జయేష్ తేల్‌ గడేగా గుర్తించారు. పాల్‌ ఘర్ నుంచి నాశిక్‌ కు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. దీనికి సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ గా మారాయి. సంఘటనా స్థలంలో పోలీసులు ఉన్నప్పటికీ.. ఏమీ చేయలేకపోవడం కనిపించింది.

తమను సాధువులు వదిలేయాలంటూ ప్రాధేయపడుతున్నప్పటికీ.. గ్రామస్తులు పట్టించుకోకపోవడం, రాళ్లు, కర్రలు, చేతులకు అందిన వస్తువులతో దాడి చేయడం అక్కడికక్కడే ప్రాణాలను వదిలారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనను మహారాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. అత్యున్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించింది. దాడితో ప్రమేయం ఉన్నట్లుగా ఆరోపణలను ఎదుర్కొంటున్న అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 110 మందిని అదుపులోకి తీసుకున్నామని, విచారణ కొనసాగిస్తున్నట్లు తెలిపారు.