Begin typing your search above and press return to search.

తెలంగాణలో రైతుబంధు ఎత్తేస్తారా?

By:  Tupaki Desk   |   13 Feb 2019 6:39 AM GMT
తెలంగాణలో రైతుబంధు ఎత్తేస్తారా?
X
తెలంగాణలో కేసీఆర్‌ ను మళ్లీ అధికారంలోకి తెచ్చిన పథకం రైతు బంధు. కానీ, ఇప్పుడా పథకాన్ని కేసీఆర్ అటకెక్కించడానికి సిద్ధమవుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. కేసీఆర్‌ కు దక్కిన ఫలితాలను చూసిన పలు ఇతర రాష్ట్రాలు - చివరకు కేంద్రం కూడా అదే తరహా పథకాన్ని అమల్లోకి తెచ్చాయి. ఇలాంటి వేళ కేసీఆర్ దీన్ని ఎత్తేయడానికి సిద్దంకావడం ఆశ్చర్యకరమే.

రైతుబంధు పథకాన్ని ఆపేసే అవకాశముందని తెలంగాణ వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథే ఈ మాట అన్నారు. రైతు బంధు పథకం ముఖ్యఉద్దేశం రైతులు మౌలిక సదుపాయాలు మెరుగుపరుచుకోవడం అని.. వారు అది సాధించాక ఈ పథకం అవసరం ఉండదని ఆయన అన్నారు. వ్యవసాయానికి అవసరమైన మౌలిక వసతులను రైతు ఈ డబ్బుతో సమకూర్చున్న తరువాత పథకం అవసరం ఉండదని ఆయన చెప్పారు. అప్పుడు పథకాన్ని ఆపేస్తారంటున్నారు.

అయితే.. పార్థసారథి మాటలతో టీఆరెస్ నేతల్లో గుబులు మొదలైంది. ఒక్కసారిగా వారంతా నష్ట నివారణ చర్యల్లో పడ్డారు. పార్థసారథి అలా ఎలా చెప్పగలుగుతారని.. ఇది ప్రతిష్ఠాత్మక కార్యక్రమంఅని వారంటున్నారు. విషయం ముఖ్యమంత్రి వరకు చేరడంతో ఆయన కార్యాలయం నుంచి పార్థసారథికి వివరణ అడిగినట్లు సమాచారం. అయితే, సారథి మాత్రం తన వ్యాఖ్యలను సమర్థించుకుంటున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు టీఆరెస్ పార్టీయే పార్థ సారథి నోటి నుంచి ఈ మాట చెప్పించిందన్న వాదనా వినిపిస్తోంది. కేంద్రం ఇలాంటి పథకాన్నే అమల్లోకి తెచ్చి రూ.6 వేలు ఇస్తామనడంతో ఇప్పుడు రాష్ట్రంలో ఇవ్వకుండా తప్పుకోవచ్చన్న ఉద్దేశంలో సీఎం ఉన్నారని... అయితే, ప్రజల్లో అప్పుడు ఎలాంటి స్పందన వస్తుందో ముందుగా తెలుసుకునేందుకే ఐఏఎస్ అధికారి ద్వారా అనిపించారని విపక్షాలు విమర్శిస్తున్నాయి.