Begin typing your search above and press return to search.

కన్యలకు మాత్రమే స్కాలర్ షిప్

By:  Tupaki Desk   |   25 Jan 2016 2:15 PM GMT
కన్యలకు మాత్రమే స్కాలర్ షిప్
X
అవును. స్కాల‌ర్‌ షిప్ పొందాలంటే క‌న్య‌గా ఉండాల‌ట‌. ఇదెక్కడి కొ(చె)త్త నిబంధ‌న అనుకుంటున్నారా? స‌మాజంలో ఎదుర‌వుతున్న వింత పోక‌డ‌కు చెక్ పెట్టేందుకు ఈ కొత్త నిర్ణ‌యాన్ని అధికారికంగా అమలులోకి తీసుకువ‌చ్చారు.

దక్షిణ ఆఫ్రికా దేశంలో ఈ వింత నిబంధ‌న తెర‌మీద‌కు వ‌చ్చింది. ఆ దేశంలోని క్వాజులా నాతల్‌ రాష్ట్రంలోని ఉతుకెలా జిల్లాలో బాలికలు చదువు పూర్తయ్యేలోగానే తల్లులయి పోతున్నారు. ప‌రిస్థితి ఏ స్థాయికి చేరిపోయిందంటే... పాఠశాలల్లోనే గర్భం దాల్చిన బాలికల సంఖ్య ఇప్పటి వరకు దాదాపు 20,000కు చేరింది. ఏటా ఈ సంఖ్య‌లో పెరుగుద‌ల క‌నిపిస్తున్న నేప‌థ్యంలో దీనికి చెక్ పెట్టేందుకు ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. బాలికలు చదువు పూర్తయ్యే వరకు పూర్తిగా చ‌దువుపైనే దృష్టిని కేంద్రీకరించాలని భావిస్తూ ఆ ప్రాంత మేయర్ ఈ కొత్త స్కాలర్‌షిప్‌ల విధానాన్ని ప్రతిపాదించారు.

పాఠ‌శాల‌ వయసులోనే బాలిక‌ల్లో గర్భధారణను అరికట్టేందుకు ఈ కొత్త నిర్ణ‌యం తెర‌మీద‌కు వ‌చ్చింది. అలాంటి వాటిని అరిక‌ట్ట‌డ‌మే కాకుండా ప్రాణాంత‌క వ్యాధి అయిన ఎయిడ్స్ వంటివి అరిక‌ట్టేలా చేసేందుకు ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. అయితే ఈ స్కాల‌ర్‌షిప్‌లు పొందేందుకు హాజ‌ర‌య్యే క‌న్వ‌త్వ ప‌రీక్ష‌లు స్వ‌చ్ఛంద‌మేన‌ని మేయ‌ర్‌గారు సెల‌విచ్చారు. దీనిపై స‌హ‌జంగానే విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఆడ‌వారి విష‌యంలో ఇదేం చెత్త నిర్ణ‌య‌మ‌ని మండిప‌డ్డారు. అయినా స్థానిక మేయ‌ర్‌గారు స‌సేమిరా అంటూ....అమ్మాయిల అనుమ‌తితోనే...వారి మేలుకోస‌మే స్కాల‌ర్‌ షిప్ టెస్ట్‌ లు నిర్వ‌హిస్తుంటే త‌ప్పేముంద‌ని ఎదురు ప్ర‌శ్నిస్తున్నారు.