Begin typing your search above and press return to search.

మెజార్టీ రాకపోతే కేసీఆర్ వేసే ప్లాన్ ఇదేనట..

By:  Tupaki Desk   |   4 Nov 2018 12:24 PM GMT
మెజార్టీ రాకపోతే కేసీఆర్ వేసే ప్లాన్ ఇదేనట..
X
ఏదో తేడా కొడుతోంది. అందరినుంచి అదే మాట.. తాజా సర్వేలు.. ఈరోజు ఓ పత్రికాధినేత కూడా ఇదే విషయాన్ని తన పత్రికలో నొక్కి వక్కాణించాడు.. కేసీఆర్ గెలుపు అంత ఈజీ కాదని... తేడా కొట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదని చెప్పుకొచ్చాడు.. ముందస్తు ఎన్నికలప్పుడు 80 సీట్లకు పైగా వస్తాయని ధీమా వ్యక్తం చేసిన కేసీఆర్ కు ఇప్పుడు పరిస్థితులు అంత అనుకూలంగా లేవని వార్తలొస్తున్నాయి. 50 సీట్లకు వచ్చి మెజార్టీకి ముందర ఆగిపోతారని విశ్లేషిస్తున్నారు. కాంగ్రెస్ బలం పెరుగుతుందని అంటున్నారు. కాంగ్రెస్ కు కూడా మెజార్టీ పూర్తి స్థాయిలో వచ్చే అవకాశం లేదని.. అంటున్నారు. మరి ఈ ఎన్నికల్లో చిన్నా చితక పార్టీలే కీరోల్ గా మారబోతున్నాయి. మరి అధికారం ఎవరినీ వరిస్తుందనేది హాట్ టాపిక్ గా మారింది..

ఇక్కడే కేసీఆర్ చక్రం తిప్పబోతున్నారని తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి ఆదివారం సాయంత్రం విలేకరులతో మాట్లాడుతూ చెప్పుకొచ్చారు. కేసీఆర్ కు 50శాతం సీట్ల కంటే తక్కువవస్తాయని.. పూర్తిస్థాయిలో మెజార్టీ వచ్చే అవకాశం లేదని తేల్చేశారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే కేసీఆర్.. మజ్లిస్, బీజేపీతో చర్చలు జరిపి మరోసారి అధికారానికి కుట్ర పన్నబోతున్నాడని ఆయన ఆరోపించారు. అంతేకాదు.. మోడీ కి, కేసీఆర్ కు మంచి స్నేహం ఉందని.. ఢిల్లీ నుంచే అంతా మోడీ తెరవెనుక ఉండి నడిపిస్తున్నాడని.. తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ ను ప్రోత్సహిస్తున్నారని చెప్పుకొచ్చాడు.

దీన్ని బట్టి కేసీఆర్ ప్లాన్ బీ కూడా రెడీ చేసుకున్నాడని అర్థమవుతోంది. దాదాపు 50 సీట్లు వచ్చి ఆగిపోతే ఎంఐఎం గెలిచే 7 సీట్లతో పాటు బీజేపీ గెలిచే ఐదు ఆరు సీట్లను కలుపుకొని తెలంగాణలో అధికారంలోకి రావడానికి కేసీఆర్ ప్లాన్ చేసుకున్నట్టు సమాచారం. అయితే ఇక్కడే ట్విస్ట్ ఉంది. మజ్లిస్ తో కేసీఆర్ కు సాన్నిహిత్యం ఉంది.. అలాగే బీజేపీతోనూ సత్సంబంధాలున్నాయి. మరి ఒకరంటే మరొకరు పడని బీజేపీ, మజ్లిస్ లను ఒకే ఒరలో ఇమడ్చే కేసీఆర్ ఎత్తుగడకు ఇరు పార్టీలు ఒప్పుకుంటాయా.? లేదా అన్నది సస్పెన్స్ గా మారింది.

అయితే మజ్లిస్ ను ప్రభుత్వంలో కలుపేసుకొని బీజేపీని బయట నుంచి మద్దతు ఇచ్చేలా కేసీఆర్ ప్లాన్ చేసినట్లు సమాచారం. చూడాలి మరి.. కేసీఆర్ కు మెజార్టీ రాకపోతే ఏం జరుగుతుందో ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో..