Begin typing your search above and press return to search.

అమిత్ షాను అంబోతు అనేశారు

By:  Tupaki Desk   |   20 Sep 2016 4:41 AM GMT
అమిత్ షాను అంబోతు అనేశారు
X
తెలంగాణ అధికారపక్ష నేతలు ఎంత దూకుడుగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవరం లేదు. తమ ప్రత్యర్థులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడే వారు..తమను మాత్రం తమ ప్రత్యర్థులు పల్లెత్తు మాట కూడా అనకూడదన్నట్లుగా వ్యవహరిస్తారు. ఒకవేళ రాజకీయ వైరుధ్యంతో ఎవరైనా ఘాటుగా విమర్శిస్తే..అందుకే రిటార్ట్ ఎంత తీవ్రంగా ఉంటుందో తాజాగా మరోసారి నిరూపితమైంది. తమ అధినేత కేసీఆర్ పై ఘాటు విమర్శలు చేసి.. బీజేపీ చీఫ్ పై ఇప్పటికే పలువురు టీఆర్ ఎస్ నేతలు విరుచుకుపడిన వైనం తెలిసిందే.

తాజాగా ఆ జాబితాలో చేరారు ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఎస్. వేణుగోపాలాచారి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిపై వరంగల్ సభలో అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై తాజాగా స్పందించిన ఆయన.. కేసీఆర్ ను విమర్శించే స్థాయి అమిత్ షాకు లేదని వ్యాఖ్యానించటం విశేషం. ఇదే పెద్దమాట అనుకుంటే.. ఇంతకంటే పెద్ద పెద్ద మాటల్నే అలవోకగా అనేశారు వేణుగోపాలాచారి. బీజేపీ చీఫ్ రాజకీయ అజ్ఞాని అని విమర్శించటమే కాదు.. అచ్చోసిన అంబోతులా మాట్లాడుతున్నారంటూ పే..ద్ద మాటనే అనేశారు.

తమ సిద్ధాంతాల్ని తెలంగాణ మీద రుద్దే ప్రయత్నం చేస్తూ.. అల్లకల్లోలం చేయటానికి అమిత్ షా ప్రయత్నిస్తున్నారన్న వేణుగోపాలాచారి.. లౌకికవాదంతో ఉన్న టీఆర్ ఎస్ కు ఓవైసీతో జత చేసి నిందించవద్దన్నారు. కేసీఆర్ ను విమర్శించే హక్కు.. స్థాయి అమిత్ షాకు లేదన్న ఆయన.. తెలంగాణకు ఢిల్లీలోని బీజేపీ సర్కారు చేసిందేమీ లేదన్నారు. కేంద్రంలో కొలువు తీరిన జాతీయ పార్టీ అధ్యక్షుడ్ని ఒక రాష్ట్ర అధికారపక్షానికి చెందిన నేత ఒకరు తీవ్రస్థాయిలో మండిపడటం ఇప్పుడు విస్మయానికి గురి చేస్తోంది. మరి.. ఈ ఫైరింగ్ కు తెలంగాణ కమలనాథులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.