Begin typing your search above and press return to search.

'కౌ ప్లాస్మా'... కరోనా చికిత్సకు కొత్త విధానం

By:  Tupaki Desk   |   30 July 2020 2:30 AM GMT
కౌ ప్లాస్మా... కరోనా చికిత్సకు కొత్త విధానం
X
విశ్వవ్యాప్తంగా చికిత్సా విధానమే అంటూ లేకుండా లక్షలాది మందిని పొట్టనబెట్టుకుంటున్న కరోనా మహమ్మారి నుంచి ఉపశమనం పొందేందుకు ప్రస్తుతమున్న చికిత్సా విధానం ఒక్క ప్లాస్మా చికిత్సే. చాలా తక్కువ మోతాదులోనే జరుగుతున్న ఈ చికిత్స ఇప్పటికే విజయవంతమైంది కూడా. అయితే మానవుల ప్లాస్మా ద్వారా ఈ చికిత్సను పెద్ద ఎత్తున చేపట్టేందుకు దాదాపుగా వీల్లేదు. ఇలాంటి కీలక తరుణంగా అమెరికా శాస్త్రవేత్తలు ప్లాస్మా చికిత్సలోనే ఓ కొత్త విధానాన్ని కనిపెట్టారు. అదే ‘కౌ ప్లాస్మా’. గోమాతలుగా మనం పరిగణించే ఆవుల నుంచి సేకరించే ప్లాస్మా ద్వారా ఈ చికిత్స కొనసాగుతుంది. ప్రస్తుతానికి ఈ చికిత్సా విధానం ఇంకా ప్రారంభం కాకున్నా.. కరోనాను పారదోలేందుకు మాత్రం భవిష్యత్తులో ఈ చికిత్సా విధానం అన్ని దేశాలకు సంజీవనిలా మారే అవకాశాలు లేకపోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.

అయినా కౌ ప్లాస్మా చికిత్సలో జరిగేదేంటన్న విషయానికి వస్తే... ఆవుల‌కు మనుషులకు సోకే వైరస్ లను ఎదుర్కొనే శక్తి ఉందని ఇప్పటికే రుజువు అయింది. అంత్రాక్స్‌, స్మాల్ పాక్స్, ఇన్ ఫ్లూయెంజా వంటి వైరస్ లకు ఆవు శరీరంలో తయారైన యాంటీ బాడీలతోనే చికిత్స చేస్తారు. అవ‌న్నీ విజయవంతం అయ్యాయి కూడా. ఈ నేపథ్యంలోనే శాబ్ బయోథెరాప్యుటిక్స్ అనే ఫార్మా కంపెనీ ప్లాస్మా యాంటీ బాడీల క్లోనింగ్ ను ఆవులలో చేస్తోంది. ఆవుల యాంటీ బాడీలను, హ్యూమన్ యాంటీ బాడీలను కలుపుతున్నారు. ఆ తర్వాత వీటి డీఎన్ ఏ కణాలను ప్రయోగశాలలో ఆవు అండాల్లో ప్రవేశపెడుతున్నారు. అలా ఎదిగే గోవులు తర్వాత కాలంలో యాంటీ బాడీ గనులుగా మారతాయట.

అయితే, ఆవులపై మాత్రమే ఎందుకు ఈ ప్ర‌యోగం చేస్తున్నార‌నే సందేహం చాలా మంది వ్య‌క్తం చేస్తున్నారు. ఎప్ప‌టిలాగే, చిట్టెలుకలు, కోతులపై చేయొచ్చుగా అనే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అయితే వాటి ద్వారా వచ్చే ప్లాస్మా చాలా తక్కువని అదే గోవుల్లో అయితే ఎటువంటి హాని లేకుండా ప్రతి నెల 30 నుంచి 35 లీటర్లను సేకరించవచ్చని శాబ్ సంస్థ చెబుత‌న్న మాట‌. ఈ చికిత్సా విధానం పూర్తి స్థాయిలో అమలులోకి వచ్చేందుకు కాస్తంత సమయం పట్టినా.. ఇతర వైరస్ లను జయించినట్టుగానే కౌ ప్లాస్మాతో కరోనాను కూడా పూర్తిగానే ఎదుర్కోవచ్చన్న భావన వ్యక్తమవుతోంది. గోవుల్లో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండటం, హ్యుమన్ ప్లాస్మా కంటే గోవుల్లో ఉండే ప్లాస్మాలోనే యాంటి బాడీలు శక్తివంతంగా ఉండటమే ఇందుకు కారణమంటున్న వాదన ఇందుకు బలం చేకూరుస్తోంది. అందుకే ఆవుల్లోనే కృత్రిమంగా కరోనా యాంటి బాడీలను తయారు చేసే ప్రయోగాలు మొద‌లుపెట్టామ‌ని శాబ్ సంస్థ చెబుతోంది.