Begin typing your search above and press return to search.

శబరిమల గత ఏడాది ఆదాయం రూ.156 కోట్లు..ఈ ఏడాది ఎంతంటే?

By:  Tupaki Desk   |   26 Dec 2020 5:30 PM GMT
శబరిమల గత ఏడాది ఆదాయం రూ.156 కోట్లు..ఈ ఏడాది ఎంతంటే?
X
శబరిమల .. సాధరణంగా కార్తీకమాసం నుండి మొదలు సంక్రాంతి వరకు ఆ అయ్యప్ప స్వామి నినాదాలతో శబరిగిరులు మారుమోగిపోతుంటాయి. నిత్యం కొన్ని వేలమంది దర్శించుకునేవారు. కోట్లల్లో ఆదాయం. కానీ , కరోనా దెబ్బకి సీన్ పూర్తిగా మారిపోయింది. కరోనా నేపథ్యంలో పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతించడంతో స్వామివారికి హుండీ ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది. ఈ ఏడాది తొలి మండలపూజ సీజన్ 39 రోజుల్లో రూ.9.09 కోట్ల ఆదాయం వచ్చినట్టు ట్రావెన్‌ కోర్డ్ దేవస్థానం బోర్డు వెల్లడించింది.

గతేడాది ఇదే సమయానికి రూ.156.60 కోట్ల ఆదాయం సమకూరినట్టు తెలిపారు. అంటే గతేడాదితో పోల్చితే స్వామికి వారి ఆదాయం రూ.147 కోట్ల మేర తగ్గింది. అలాగే 39 రోజుల్లో కేవలం 71,706 మంది భక్తులు మాత్రమే అయ్యప్పను దర్శించుకున్నట్టు టీడీబీ ప్రెసిడెంట్ ఎన్ వాసు తెలిపారు. గతేడాదితో పోల్చితే శబరిమల ఆలయం గణనీయంగా పడిపోయింది.. అలాగే, మైనస్ ఐదు శాతం కంటే తక్కువ మంది భక్తులు దర్శనానికి వచ్చారు అని తెలిపారు.

మండల పూజ సీజన్ మొదలైన తర్వాత డిసెంబరు 24 వరకు సన్నిధానం, పంపా, నిలక్కల్ వద్ద 390 మందికి కరోనా వైరస్ పాజిటివ్ ‌గా నిర్ధారణ అయ్యిందని టీడీబీ ప్రెసిడెంట్ తెలియజేశారు. వీరిలో 96 మంది భక్తులు కాగా, 289 మంది ఆలయం వద్ద విధులు నిర్వర్తిస్తున్న అన్ని విభాగాలకు చెందిన సిబ్బంది ఉన్నట్టు వివరించారు. ఆలయ ఉద్యోగులకు సన్నిధానం వద్ద యాంటీజెన్ టెస్ట్ క్యాంప్ ‌ను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కరోనా వైరస్ నిర్ధారణ అయిన సిబ్బంది, వారితో కాంటాక్ట్ అయినవారిని సకాలంలో గుర్తించి సన్నిధానం విధుల నుంచి తొలగించి చికిత్సకు తరలిస్తున్నామని అన్నారు. కేవలం ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు చేయించుకున్న భక్తులను శబరిమలలోకి డిసెంబరు 26 నుంచి అనుమతించాలని కేరళ హైకోర్టు, ప్రభుత్వం టీడీబీకి సూచించాయి.