Begin typing your search above and press return to search.

సుప్రీంలో ట్రావెన్ కోర్ బోర్డు సంచ‌ల‌న వాద‌న‌!

By:  Tupaki Desk   |   6 Feb 2019 11:11 AM GMT
సుప్రీంలో ట్రావెన్ కోర్ బోర్డు సంచ‌ల‌న వాద‌న‌!
X
కొన్ని న‌మ్మకాల విష‌యంలో ప్ర‌జ‌లు ఎంత ప‌ట్టుద‌ల‌తో ఉంటార‌న్న విష‌యం శ‌బ‌రిమ‌ల ఎపిసోడ్‌తో చాలామందికి అర్థ‌మైంది. వామ‌ప‌క్షవాదులు.. ప్ర‌గ‌తిశీల భావ‌న‌ల పేరుతో మెజార్టీ ప్ర‌జ‌ల మ‌నోభావాల‌కు భిన్నంగా వ్య‌వ‌హ‌రించ‌టం.. ఇలాంటి వాటి విష‌యంలో మీడియా సాపేక్షంగా ఉండే బ‌దులు.. ఒక‌వైపున‌కు వొంగిన‌ట్లుగా వ్య‌వ‌హ‌రించ‌టం చూస్తున్న‌దే.

ఒక ప్ర‌భుత్వం ద‌గ్గ‌ర ఉండి మ‌రీ సుప్రీంకోర్టు తీర్పును అమ‌లు చేయ‌టానికి ప‌డుతున్న పాట్లు తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. సుప్రీం కోర్టు ఇప్ప‌టివ‌ర‌కూ ఇచ్చిన అన్ని తీర్పుల అమ‌లు విష‌యంలోనూ కేర‌ళ స‌ర్కారు ఇదే తీరులో వ్య‌వ‌హ‌రించ‌గ‌ల‌దా? అన్న క్వ‌శ్చ‌న్ ప‌లువురి నోట వినిపిస్తోంది.

శ‌బ‌రిమ‌ల పుణ్య‌క్షేత్రానికి ఉన్న స్థ‌ల పురాణం.. ఆ దేవాల‌యానికి ఉన్న ప్ర‌త్యేక‌త దృష్ట్యా కొన్ని వ‌య‌స్కుల మ‌హిళ‌ల్ని మాత్ర‌మే అనుమ‌తించ‌టం లేద‌ని.. అది మిన‌హా మిగిలిన వారిని అనుమ‌తిస్తార‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌ద‌ని ప‌లువురు వాదిస్తున్నా.. వామ‌ప‌క్ష భావ‌జాలాన్ని మ‌ది నిండా నింపుకున్న వారు మాత్రం.. వితండ వాదాన్ని వినిపిస్తున్నార‌న్న విమ‌ర్శ ఉంది.

ఇదిలా ఉంటే.. శ‌బ‌రిమ‌లై ఆల‌య ప్ర‌వేశం విష‌యంలో కొంద‌రు మ‌హిళ‌ల‌పై ఉండే ప‌రిమితుల విష‌యంలో సుప్రీంకోర్టు ఇప్ప‌టికే తీర్పు ఇచ్చింది. అన్ని వ‌య‌స్కుల వారు గుడికి వెళ్లొచ్చ‌న్న పేర్కొంది. దీనిపై తీవ్ర‌స్థాయిలో వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మైన నేప‌థ్యంలో.. ఈ అంశంపై మ‌రోమారు విచార‌ణ సాగుతోంది. రివ్యూ పిటిష‌న్ పై జ‌రుగుతున్న విచార‌ణ‌లో భాగంగా శ‌బ‌రిమ‌ల అయ్య‌ప్ప ఆల‌యాన్ని న‌డిపించే ట్రావెన్ కోర్ దేవ‌స్థానం బోర్డు సంచ‌ల‌న వాద‌న‌ల్ని వినిపించింది.

ఐదుగురు స‌భ్యులున్న ధ‌ర్మాస‌నం ఎదుట ట్రావెన్ కోర్ బోర్డు త‌ర‌ఫు న్యాయ‌వాది త‌న వాద‌న‌లు వినిపిస్తూ.. అన్ని వ‌య‌స్కుల మ‌హిళ‌లు దేవ‌స్థానంలోకి అనుమ‌తించాల‌న్న త‌న వాద‌న‌ను వెల్ల‌డించింది. గ‌తంలో బోర్డు వినిపించిన వాద‌న‌కు పూర్తి భిన్న‌మైన వాద‌న‌గా దీన్ని చెప్పాలి. గ‌తంలో ట్రావెన్ కోర్ బోర్డు వినిపించిన వాద‌న‌కు భిన్నంగా.. సుప్రీంకోర్టు తీర్పును స‌మ‌ర్థించేలా వాద‌న‌లు వినిపిస్తున్న న్యాయ‌వాదిని ఉద్దేశించి సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తి ఒక‌రు.. బోర్డు తీరులో మార్పు వ‌చ్చిందా? అని ప్ర‌శ్నించారు.

దానికి స‌ద‌రు న్యాయ‌వాది స‌మాధానం ఇస్తూ.. ఔను.. మార్పు వ‌చ్చింది.. సుప్రీం తీర్పును గౌర‌వించాల‌ని బోర్డు నిర్ణ‌యించింది. దీనికి సంబంధించిన ద‌ర‌ఖాస్తు చేసింది అంటూ బ‌దులిచ్చారు. ఇప్ప‌టివ‌ర‌కు భ‌క్తుల మ‌నోభావాల పేరుతో వినిపించిన వాద‌న‌కు భిన్న‌మైన వాద‌న‌ను వినిపించిన ట్రావెన్ కోర్ట బోర్డు తీరుపై ఎలాంటి స్పంద‌న‌లు వెలువ‌డ‌తాయ‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. ఏమైనా సుప్రీంకోర్టు గ‌తంలో ఇచ్చిన తీర్పును స‌మ‌ర్థించేలా ఉన్న ట్రావెన్ కోర్ వాద‌న ఇప్పుడు సంచ‌ల‌నంగా మారాయి.