Begin typing your search above and press return to search.

ప్ర‌జ‌ల సెంటిమెంట్‌ తో ఆట‌లెందుకు పిన‌ర‌యి?

By:  Tupaki Desk   |   4 Oct 2018 7:33 AM GMT
ప్ర‌జ‌ల సెంటిమెంట్‌ తో ఆట‌లెందుకు పిన‌ర‌యి?
X
అధికారం ఉన్న‌దే ఒక్క రాష్ట్రంలో. అలాంట‌ప్పుడు ఎంత జాగ్ర‌త్త‌గా ఉండాలి. పేరుకు జాతీయ పార్టీనే కానీ.. దేశ వ్యాప్తంగా ఉన్న రాష్ట్రాలన్నింటిని క‌లిపి గుప్పెడు అంటే గుప్పెడు ఎమ్మెల్యేల్ని.. ఎంపీల్ని గెలిపించుకోలేని ప‌రిస్థితుల్లో ఉన్నాయి వామ‌ప‌క్ష పార్టీలు. మారిన కాలంతో పాటు మార‌ని తీరు.. చెప్పే సిద్దాంతాల‌కు.. చేసే ప‌నుల‌కు మ‌ధ్య పొంత‌న లేని వైనం వారి మీద ఉన్న గౌర‌వాన్ని త‌గ్గించేలా చేశాయ‌ని చెప్పాలి.

దేశం మొత్త‌మ్మీదా ఈ రోజున వామ‌ప‌క్ష ప్ర‌భుత్వం ఉన్న‌దంటే అదొక్క కేర‌ళ‌లో మాత్ర‌మే. అలాంట‌ప్పుడు ఆచితూచి నిర్ణ‌యాలు తీసుకోవ‌టంతో పాటు.. ప్ర‌జ‌ల మ‌న‌సుల్ని ఎరిగి.. వారి సెంటిమెంట్ల‌కు త‌గ్గ‌ట్లు నిర్ణ‌యాలు తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. కాదంటే.. ఉన్న ఒక్క రాష్ట్రంలోనూ ప‌వ‌ర్ చేజారిపోవ‌టం ఖాయం. కానీ.. ఈ విష‌యాల్ని కేర‌ళ ముఖ్య‌మంత్రి పిన‌ర‌యి విజ‌య‌న్ గుర్తిస్తున్న‌ట్లుగా లేదు.

సుప్రీంకోర్టు వెలువ‌రించిన శ‌బ‌రిమ‌ల ఆల‌య ప్ర‌వేశం తీర్పుపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్న సంగ‌తి తెలిసిందే. గాంధీ జ‌యంతి సంద‌ర్భంగా కేర‌ళ‌లోని వివిధ ప్రాంతాల్లోని మ‌హిళ‌లు సుప్రీం తీర్పుపై శాంతియుతంగా నిర‌స‌న వ్య‌క్తం చేయ‌టం.. దానికి గంట‌ల వ్య‌వ‌ధిలో వేలాది మంది మ‌హిళ‌లు స్వ‌చ్చందంగా రోడ్ల మీద‌కు రావ‌టం..త‌మ మ‌నోభావాల్ని గౌర‌వించాల‌ని కోర‌టం తెలిసిందే.

ఇదిలాఉంటే.. సుప్రీం తీర్పును రివ్యూ పిటిష‌న్ వేయ‌మంటూ కేర‌ళ ముఖ్య‌మంత్రి చేసిన ప్ర‌క‌ట‌న‌పై ఆగ్ర‌హం వ్య‌క్త‌మ‌వుతోంది. రాబోయే అయ్య‌ప్ప సీజ‌న్లో శ‌బ‌రిమ‌ల‌లో మ‌హిళా భ‌క్తుల‌కు అవ‌స‌ర‌మైన ఏర్పాట్లు చేయ‌నున్న‌ట్లుగా వెల్ల‌డించారు. ముఖ్య‌మంత్రి వ్యాఖ్య‌ల‌పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తోంది. ఇదిలా ఉంటే.. సుప్రీం తీర్పు నేప‌థ్యంలో శ‌బ‌రిమ‌ల‌కు పెద్ద సంఖ్య‌లో మ‌హిళ‌లు వ‌స్తార‌ని తాము భావించ‌టం లేద‌ని టీడీబీ అధ్య‌క్షుడు ప‌ద్మ‌కుమార్ వెల్ల‌డించారు.

ఓవైపు మ‌హిళ‌లు సుప్రీం తీర్పుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ చేప‌ట్టిన నిర‌స‌న అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్ల‌గా.. ఆయ‌న స్పందిస్తూ అయ్య‌ప్ప ఆల‌యానికి వెళ్లి పూజ‌లు చేయాల‌నుకునే మ‌హిళ‌ల‌ను ఆపే హ‌క్కు ఏ ఒక్క‌రికి లేద‌న్నారు. సుప్రీం తీర్పును ప్ర‌జ‌లు అంగీక‌రించాల్సిందేన‌ని.. ప్ర‌భుత్వం ఉన్న‌ది తీర్పులు అమ‌లు చేసేందుకేన‌న్నారు. ప్ర‌జ‌లు ఎన్నుకుంటే అధికారంలోకి వ‌చ్చిన ప్ర‌భుత్వం.. అదే ప్ర‌జ‌లు నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్న వైనంపై సీఎం స్పందిస్తున్న తీరు చూస్తే.. వామ‌ప‌క్ష నేత‌ల్లో ఉన్న అస‌లు స‌మ‌స్య ఏమిటో ఇట్టే అర్థ‌మ‌వుతుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. అధికారం ఉన్న ఒక్క రాష్ట్రంలోనూ ప‌వ‌ర్ చేజార్చుకోవాల‌న్న‌ట్లుగా వామ‌ప‌క్ష నేత‌ల తీరు ఉంద‌న్న అభిప్రాయాన్ని ప‌లువురు వ్య‌క్తం చేస్తున్నారు.