Begin typing your search above and press return to search.

వైసీపీ ఫుల్.. అందుకే టీడీపీలోకి..

By:  Tupaki Desk   |   23 Feb 2019 5:03 AM GMT
వైసీపీ ఫుల్.. అందుకే టీడీపీలోకి..
X
ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. కాంగ్రెస్ హయాంలో వెలుగు వెలిగిన నేతలు.. ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ ను విడగొట్టడంతో రాజకీయాలకు దూరంగా జరిగారు.ఈ ఐదేళ్లు సైలెంట్ గా ఉన్న నేతలు ఇప్పుడు ఎన్నికల వేళ తమ భవిష్యత్ ను చూసుకుంటున్నారు. గత ఎన్నికల్లో పోటీచేయని మాజీ కాంగ్రెస్ నేతలంతా ఇప్పుడు సైకిలెక్కడమో.. లేక ప్రతిపక్ష ఫ్యాన్ గాలిలో కలిసిపోవడమో చేస్తున్నారు. మరో ఐదేళ్లు ఖాళీగా ఉండడం ఇష్టం లేకే ఈసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నారు.

ఈసారి అన్ని సర్వేలు ప్రతిపక్ష వైసీపీకి అనుకూలంగా వస్తుండడంతో ఆ పార్టీ సీట్లకోసం పోటీ మొదలైంది. కానీ జగన్ మాత్రం ఆది నుంచి పార్టీలో ఉన్న వారికి, గెలుపు గుర్రాలకే ప్రాధాన్యతనిస్తూ వలస నేతలకు చెక్ పెడుతున్నారు. వలస వచ్చిన వారు బలమైన నేతలైతేనే చేర్చుకుంటున్నారు. ఆ కోవలో కర్నూలు మాజీ ఎంపీ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి వైసీపీలో చేరుదామనుకున్నా.. ఆయన బలం, బలగం ఆలోచించి జగన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని సమాచారం. దీంతో ఆయన టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. కానీ టీడీపీ మాత్రం ఎవ్వరూ వచ్చినా తలుపులు బార్లా తెరుస్తూ వారికి టికెట్ల హామీలిస్తూ సొంతపార్టీలో కుంపటి రాజేస్తోంది.

తాజాగా కాంగ్రెస్ పార్టీ నేత - అనకాపల్లి మాజీ ఎంపీ సబ్బం హరి కీలక ప్రకటన చేశారు. తాను ఐదేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉన్నానని.. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరడమో.. లేదంటే రాజకీయాల నుంచి తప్పుకోవడమో రెండే ఆప్షన్లు తనకున్నాయని కుండబద్దలు కొట్టారు. త్వరలోనే బాబును కలిసి సీటు విషయమై చర్చించి టీడీపీలో చేరుతానని తెలిపారు.

వైఎస్ కు వీరాభిమాని సబ్బంహరి. అనామకుడైన హరిని వైఎస్ ఎంపీగా గెలిపించారు. అందుకే పోయిన 2014 ఎన్నికల్లో జగన్ కు సపోర్టుగా సబ్బంహరి వ్యాఖ్యానించారు. అనంతరం జనసేన పవన్ గురించి పాజిటివ్ గా మాట్లాడారు. ఇప్పుడు తెలుగు దేశం పార్టీయే దిక్కు అంటున్నారు.

నిజానికి సబ్బంహరి ప్రాతినిధ్యం వహిస్తున్న అనకాపల్లి విషయంలో వైసీపీలో తీవ్ర పోటీ ఉంది. ఇటీవలే టీడీపీ నుంచి వైసీపీలో చేరిన ఎంపీ అవంతి శ్రీనివాస్ అనకాపల్లి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. వైసీపీలో ఆయనకే సీటు కన్ఫం. టీడీపీలో మాత్రం అనకాపల్లి సీటు ఖాళీ అయ్యింది. అందుకే సబ్బం హరి చాకచక్యంగా టీడీపీ అధినేతకు జై కొట్టడం.. ఆ పార్టీ చేరుతున్నట్టు హడావుడిగా ప్రకటించారు. మరి హరిని టీడీపీ అధినేత స్వాగతిస్తారో లేదో చూడాలి మరి.