Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ నయా రాజకీయం..ఎంపీగా సబిత.?

By:  Tupaki Desk   |   15 Sep 2018 11:55 AM GMT
కాంగ్రెస్ నయా రాజకీయం..ఎంపీగా సబిత.?
X
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో చేవెళ్ల చెల్లెమ్మ సబితా ఇంద్రారెడ్డి కీలకంగా వ్యవహరించారు. రాష్ట్ర హోంమంత్రిగా చెరగని ముద్రవేశారు. కానీ తర్వాత రాజకీయాల్లో ఓడిపోవడంతో సైలెంట్ అయ్యారు. సబిత లాంటి బలమైన నేతల అవసరం కాంగ్రెస్ కు అవసరమని గుర్తించిన కాంగ్రెస్ అధిష్టానం తాజాగా ఆమెను క్రియాశీల రాజకీయాల్లోకి రావాలని ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. అయితే సబితా మాత్రం తాను అసెంబ్లీకి కాకుండా పార్లమెంట్ కు పోటీచేస్తానని స్పష్టం చేసినట్టు వార్తలొస్తున్నాయి.

తొలి మహిళా హోంమంత్రిగా సబిత ఎంతో పేరు గడించారు. అయితే ఆ తర్వాతి కాలంలో కాంగ్రెస్ నాయకులపై పలు కేసులు బయటకు వచ్చాయి. దాల్మియా సిమెంట్ కేసులో సబిత పేరును సీబీఐ చార్జీషీట్ లో నమోదు చేసింది. అందులో ఏ4గా పేర్కొనడంతో ఆమె రాజీనామా చేశారు. 2013 మే 25న గవర్నర్ కు రాజీనామా సమర్పించారు. కేసులతో మనస్తాపం చెందిన సబిత అప్పటి నుంచి క్రియాశీల రాజకీయాలకు దూరంగా జరిగారు. రాష్ట్ర విభజన 2014 తర్వాత ఎన్నికల్లో సబిత పోటీ కూడా చేయలేదు. తెలంగాణ కాంగ్రెస్ కు ఇప్పుడు చురుకైన నాయకత్వం అవసరం కావడంతో సబితా ఇంద్రారెడ్డితో కాంగ్రెస్ సీనియర్లు చర్చలు జరుపుతున్నట్టు తెలిసింది. 2019 ఎన్నికల్లో ఆమెను పోటీచేయాలని ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం.

సీఎం కేసీఆర్ మహేశ్వరం నియోజకవర్గం నుంచి కీలక నేతను రంగంలోకి దించితే పార్లమెంటుకు లేదంటే మహేశ్వరం అసెంబ్లీ స్థానానికి పోటీకి దింపాలని కాంగ్రెస్ యోచిస్తోంది. కానీ సబిత మాత్రం చేవెళ్ల ఎంపీగా పోటీ చేయడానికే ప్రాధాన్యం ఇస్తోంది. నాయకత్వం కోసం కాంగ్రెస్ అధిష్టానం పాత నేతలతో చర్చలు జరుపుతుండడం కొద్దిరోజులుగా కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.