Begin typing your search above and press return to search.

రెండు రోజుల్లో టీ-కాంగ్రెస్ కు బిగ్ షాక్‌?

By:  Tupaki Desk   |   7 March 2019 7:14 AM GMT
రెండు రోజుల్లో టీ-కాంగ్రెస్ కు బిగ్ షాక్‌?
X
అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం పాల‌వ్వ‌డం - పార్టీ త‌ర‌ఫున గెలిచిన కొద్దిమంది ఎమ్మెల్యేలూ క్ర‌మంగా అధికార పార్టీలో చేరుతుండ‌టం - వ‌చ్చే లోక్ స‌భ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించే అవ‌కాశాలు స‌న్న‌గిల్లుతుండ‌టం వంటి ప‌రిణామాలతో కుదేలైన తెలంగాణ కాంగ్రెస్ కు రెండు రోజుల్లో భారీ షాక్ త‌గిలే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. సీనియ‌ర్ నేత - మాజీ హోంమంత్రి స‌బితా ఇంద్రారెడ్డి ఈ నెల 9న పార్టీకి రాజీనామా చేసే అవ‌కాశాలున్న‌ట్లు తెలుస్తోంది.

ఇటీవ‌ల తెలంగాణ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ ఉద్ధండులు చాలామంది టీఆర్ ఎస్ హ‌వాలో కొట్టుకుపోయారు. జానారెడ్డి - జీవ‌న్ రెడ్డి - రేవంత్ రెడ్డి వంటి సీనియ‌ర్లు ప‌రాజ‌యం పాల‌య్యారు. స‌బితా ఇంద్రారెడ్డి మాత్రం గులాబీ ప్ర‌భంజ‌నానికి ఎదురునిలిచి మ‌హేశ్వ‌రం నుంచి గెలుపొందారు. అసెంబ్లీలో పార్టీ గ‌ళం వినిపించేందుకు ప్ర‌స్తుతం పెద్ద దిక్కుగా ఉన్నారు. రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ కు ఉన్న అత్యంత బ‌ల‌మైన నేత ఆమే. చేవెళ్ల చెల్లెమ్మ‌గా పార్టీలో ఆమె పేరుగాంచారు.

కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ ఈ నెల 9న చేవెళ్లకు రానున్నారు. భారీ బ‌హిరంగ స‌భ‌ను ఉద్దేశించి ప్ర‌సంగించ‌నున్నారు. అదే రోజు స‌బితా ఇంద్రారెడ్డి పార్టీని వీడుతున్న‌ట్లు ప్ర‌క‌టించే అవ‌కాశాలున్న‌ట్లు తెలుస్తోంది. రాహుల్ స‌భ‌కు సంబంధించి త‌లెత్తిన వివాద‌మే ఇందుకు త‌క్ష‌ణ కార‌ణ‌మ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి టీఆర్ ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేఆరు. ప్ర‌స్తుతం రాహుల్ స‌భ‌ను నిర్వ‌హించే బాధ్య‌త‌ను పార్టీ పూర్తిగా ఆయ‌న‌కే అప్ప‌గించింది. స‌బితా ఇంద్రారెడ్డికి ఒక్క ప‌ని కూడా అప్ప‌గించ‌లేదు. ఈ ప‌రిణామంపై ఆమె తీవ్ర అసంతృప్తితో ఉన్న‌ట్లు స‌మాచారం. అందుకే త‌న కుమారుడు కార్తిక్ రెడ్డి, స‌బిత రాహుల్ స‌భ స‌న్నాహ‌క స‌మావేశాల‌కు గైర్హాజ‌ర‌య్యారు. 9న జ‌రిగే బ‌హిరంగ స‌మావేశానికీ వారు హాజ‌ర‌య్యే అవ‌కాశం లేదు.

నిజానికి పార్టీపై చేవెళ్ల చెల్లెమ్మ చాలాకాలంగా అసంతృప్తితో ఉన్నారు. ఇటీవ‌ల అసెంబ్లీ ఎన్నిక‌ల్లో త‌న కుమారుడు కార్తిక్ రెడ్డికి రాజేంద్ర న‌గ‌ర్ టికెట్ ఇప్పించేందుకు గ‌ట్టిగా ప్ర‌య‌త్నించారు. అయితే - పార్టీ అధిష్ఠానం మొండిచేయి చూపింది. దీంతో ఒకానొక స‌మ‌యంలో రెబ‌ల్ గా బ‌రిలో దిగే అవ‌కాశాల‌ను ప‌రిశీలించిన త‌ల్లీ కుమారులు చివ‌ర‌కు ఆ ప్ర‌య‌త్నాన్ని మానుకున్నారు. పార్టీకి విధేయ‌త ప్ర‌క‌టించారు.

ఇప్పుడు రాహుల్ స‌భ నిర్వ‌హ‌ణ‌లో త‌మ పాత్ర లేకుండా పోవ‌డం వారిలో అసంతృప్తిని మరింత పెంచింది. పార్టీలో త‌మ కంటే విశ్వేశ్వ‌ర్ రెడ్డికే అధిక ప్రాధాన్యం ద‌క్కుతున్న‌ట్లు వారు భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో రాహుల్ స‌భ జ‌రిగే రోజునే పార్టీకి గుడ్ బై చెప్పి షాకివ్వాల‌ని స‌బితా ఇంద్రారెడ్డి యోచిస్తున్నార‌ట‌. ఇప్ప‌టికే ఎమ్మెల్యేలు రేగ కాంతారావు, ఆత్రం స‌క్కు పార్టీని వీడ‌టంతో షాక్ తిన్న కాంగ్రెస్‌.. చేవెళ్ల చెల్లెమ్మ కూడా వెళ్లిపోతే తీవ్ర దిగ్భ్రాంతికి గుర‌వుతుంద‌న‌డంలో ఏమాత్రం సందేహం లేదు. మ‌రి ఆమెను బుజ్జ‌గించేందుకు అధిష్ఠానం రంగంలోకి దిగుతుందో లేదో వేచి చూడాల్సిందే!