Begin typing your search above and press return to search.

నా కొడుకు 'సచిన్' వల్లే ఓడిపోయాడు

By:  Tupaki Desk   |   4 Jun 2019 8:31 AM GMT
నా కొడుకు సచిన్ వల్లే ఓడిపోయాడు
X
కేంద్రంలో మరోసారి భారీ మెజారిటీతో మోదీ అధికారంలోకి రావడంతో కాంగ్రెస్‌ పార్టీలోని అంతర్గత విభేదాలు మరోసారి ముదురుతున్నాయి. 2018 డిసెంబరులో కాంగ్రెస్ విజయం సాధించి - అధికారంలోకి వచ్చిన రాష్ట్రాల్లోనూ ఇప్పుడు బీజేపీ ఘన విజయం సాధించడంతో కాంగ్రెస్ పార్టీ నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ రచ్చకెక్కుతున్నారు.

తాజాగా రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు సచిన్ పైలట్‌ పై మండిపడ్డారు. తన కుమారుడు సచిన్ పైలట్ వల్లే ఓడిపోయాడన్నారు. డిసెంబరులో రాజస్థాన్‌లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కానీ.. అక్కడికి అయిదు నెలల్లో మేలో జరిగిన ఎణ్నికల్లో ఆ రాష్ట్రంలోని 25 లోక్ సభ స్థానాలకు 25 స్థానాల్లోనూ కాంగ్రెస్ ఓడిపోయింది. 25 స్థానాలనూ బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. బీజేపీ సుడిగాలిలో రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లోత్ కుమారుడు వైభవ్ గెహ్లోత్ కూడా కొట్టుకుపోయారు. వైభవ్ జోధ్ పూర్ నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. దీంతో.. అశోక్ గెహ్లోత్ ఇప్పుడు సచిన్ పైలట్‌పై ఆరోపణలు చేశారు. వైభవ్ ఓటమికి రాజస్థాన్ కాంగ్రెస్ చీఫ్ సచిన్ పైలట్ బాధ్యత వహించాలని అన్నారు.

నిజానికి జోధ్‌ పూర్‌ పై అశోక్ గెహ్లట్‌ కు గట్టి పట్టుంది. ఇక్కడి నుంచి ఆయన ఐదుసార్లు లోక్‌ సభకు ఎన్నికయ్యారు. జోధ్‌ పూర్‌ లో గెలుపు తథ్యమని సచిన్ పైలట్ తనతో పలుమార్లు చెప్పారని - ఎన్నికల ప్రచారం కూడా బాగా చేశామని చెప్పారని గెహ్లోతో గుర్తు చేశారు. ఇక్కడ పెద్ద మెజారిటీతో గెలవబోతున్నట్టు చెప్పారని అన్నారు. కాబట్టి కనీసం ఇక్కడి ఓటమికి అయినా సచిన్ పైలట్ బాధ్యత తీసుకుంటే బాగుంటుందని అన్నారు.

కాగా మొన్న డిసెంబరులో కాంగ్రెస్ పార్టీ రాజస్థాన్‌ లో అధికారం అందుకున్నప్పుడు సచిన్ పైలట్ సీఎం కావాలని చాలా ప్రయత్నించారు. కానీ, రాహుల్ గాంధీ సీనియర్ నేత అయిన అశోక్ గెహ్లోత్ వైపు మొగ్గు చూపారు. అశోక్ గెహ్లోత గతంలోనూ సీఎంగా పనిచేయడం - అందరిలో మంచి పేరుండడంతో పాటు కర్ణాటకలో కాంగ్రెస్ అధికారం అందుకునే దిశగా వ్యూహ రచన చేయడం.. ఆ రోజు కర్ణాటకలో రాజకీయాన్ని బీజేపీ తన చేతిలోకి తీసుకుని అధికారం కైవసం చేసుకునే దిశగా సాగుతున్నప్పుడు అశోక్ గెహ్లోత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కట్టుదాటకుండా చేయడంతో పాటు సుప్రీంలో కేసు వేయించడం వరకు అన్నీ సమన్వయంతో చేసి బీజేపీ అధికారం చేపట్టకుండా అడ్డుకోగలిగారు. దీంతో ఆయన నిర్వహణ సామర్థ్యాలపై నమ్మకంతో మరోసారి రాహుల్ గాంధీ ఆయన్నే రాజస్థాన్ సీఎంని చేశారు. దీనిపై సచిన్ కొంత బాహాటంగా - కొంత లోలోపల అసంతృప్తిగానే ఉన్నారు. ఆ సమయంలో రాహుల్ గాంధీ అశోక్ గెహ్లోత్ - సచిన్ పైలట్లతో ఫొటో దిగి ‘యునైటైడ్ కలర్స్ ఆఫ్ రాజస్థాన్’ అంటూ సోషల్ మీడియాలో షేర్ చేయడం గుర్తుండే ఉంటుంది.

కానీ... రాహుల్ సయోధ్య కుదిర్చినా ఆ యునైటెడ్‌ నెస్ మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో కనిపించలేదు. 25కి 25 సీట్లూ కాంగ్రెస్ కోల్పోవడం.. జోధ్ పూర్‌ లో వైభవ్ ఓటమి.. ఇప్పుడు అశోక్ గెహ్లోత్ ఆరోపణలు చూస్తుంటే రాజస్థాన్‌ లో బీజేపీ క్లీన్ స్వీప్ సాధించడానికి కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ కావాల్సినంత సహకారం అందించారని అర్థమవుతోంది.