Begin typing your search above and press return to search.

అతను రియల్ హీరో అంటున్న సచిన్

By:  Tupaki Desk   |   28 Aug 2016 7:24 AM GMT
అతను రియల్ హీరో అంటున్న సచిన్
X
భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ మీద ప్రశంసల జల్లు కురిపించాడు దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్. ఆదివారం ఉదయం హైదరాబాద్ కు విచ్చేసిన సచిన్.. గోపీచంద్ తో పాటు పి.వి.సింధు.. సాక్షి మాలిక్.. దీపా కర్మాకర్ లకు బీఎండబ్ల్యూ కార్లను బహుమతిగా అందజేశాడు. ఒలింపిక్స్ లో సింధు రజత పతకం సాధించగా.. ఆమెకు కోచింగ్ ఇచ్చింది గోపీచందే. సాక్షి మాలిక్ కాంస్యం సాధించగా.. జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ పతకం గెలవకున్నా అద్భుత ప్రదర్శన చేసి అందరినీ ఆకట్టుకుంది. ఈ నలుగురికీ బీఎండబ్ల్యూ కార్లను చాముండీశ్వరీనాథ్ బహుమతిగా ప్రకటించగా.. ఆయనకు మిత్రుడైన సచిన్ హైదరాబాద్ విచ్చేసి తన చేతుల మీదుగా ఆ కార్లను వారికి అందజేశాడు.

ఈ బహుమతులు అందించిన అనంతరం సచిన్ వారితో సెల్ఫీ తీసుకున్నాడు. అనంతరం సచిన్ మాట్లాడుతూ.. కఠోర సాధనతోనే ఒలింపిక్స్ లో పతకాలు సాధించగలరని.. వీరిని చూసి భారత్‌ ఎంతో గర్విస్తోందని అన్నాడు. గోపీచంద్ గొప్ప కోచ్ అని కితాబిచ్చాడు సచిన్. పి.వి.సింధు మాట్లాడుతూ.. ‘‘నన్ను అభినందించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఒలింపిక్‌ పతకం సాధించినందుకు ఎంతో సంతోషంగా ఉంది’’ అని చెప్పింది. తనకు ప్రస్తుతం దక్కిన ప్రోత్సాహంతో భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధిస్తానని సాక్షి మాలిక్ చెప్పగా.. తాను ఒలింపిక్స్‌ లో నాలుగో స్థానంలోనే నిలిచినా ఇంత ప్రోత్సాహం దక్కుతుందని ఊహించలేదని.. ఇందుకు అందరికీ ధన్యవాదాలని దీపా కర్మాకర్ అంది.