Begin typing your search above and press return to search.

అప్పుడు క్రికెట్ దేవుడే అతన్ని అపాడంట

By:  Tupaki Desk   |   29 Oct 2015 4:36 AM GMT
అప్పుడు క్రికెట్ దేవుడే అతన్ని అపాడంట
X
టన్నుల కొద్దీ పరుగులు కొల్లగొట్టి.. విధ్వంసకర బ్యాటింగ్ కు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన వీరేంద్ర సెహ్వాగ్ ఇటీవల తన 37వ బర్త్ డే రోజున క్రికెట్ కు గుడ్ బై చెప్పటం తెలిసిందే. ఆయన నిర్ణయం పలువురికి బాధ కలిగించింది. టీమిండియాకు ఎన్నో విజయాలు సాధించిన వీరూకి ఘనమైన వీడ్కోలు పలికి ఉంటే బాగుండేదన్న మాట వినిపించింది. అయితే.. ఈ భావన క్రికెట్ అభిమానులకే కాదు.. వీరేంద్ర సెహ్వాగ్ కు కూడా ఉందన్న విషయం తాజాగా అతగాడే బయటపెట్టాడు.

రిటైర్మెంట్ విషయంలో తనకున్న అసంతృప్తిని తన మాటల ద్వారా బయటపెట్టేశాడు. అందరిలానే కెరీర్ అత్యుత్తమ దశలో ఉన్నప్పుడే అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలుకుదామని అనుకున్నానని.. వీడ్కోలు ప్రసంగం ఇవ్వాలని అనుకున్నా.. తన రాత మరోలా ఉందని వాపోయాడు. తన రిటైర్మెంట్ ప్రకటన విషయంలో తన కొడుకులిద్దరూ విపరీతమైన అసంతృప్తితో ఉన్నట్లుగా వీరూ చెప్పుకొచ్చారు. వాస్తవాని​కి​ 2007లో జట్టులో చోటు కోల్పోయిన రోజే తాను రిటైర్మెంట్ ప్రకటిద్దామని అనుకున్నా​నని.. అయితే.. తొందరపడొద్దని మాస్టర్ బ్లాస్టర్.. కిక్రెట్ దేవుడు అయిన సచిన్ ఆపటం వల్లే తాను ఆగినట్లుగా వీరూ వెల్లడించాడు.

‘‘ 2007లో జట్టు నుంచి స్థానం కోల్పోయినప్పుడే క్రికెట్ ను వదిలేద్దామనుకున్నా. కానీ.. సచిన్ వారించాడు. తొందరపాటు వద్దని చెప్పాడు’’ అని వెల్లడించాడు. 2012 అక్టోబర్ లో ఆఖరి టీ20 మ్యాచ్ ను.. 2013 జనవరిలో చివరి వన్డేను ఆడిన సెహ్వాగ్.. 2013 మార్చిలో జరిగిన టెస్ట్ మ్యాచ్ అతని చివరిది. అప్పటి నుంచి సెహ్వాగ్ ను సెలక్టర్లు టీమిండియాకు ఎంపిక చేయలేదు. తన మనసులోని అసంతృప్తిని బాహాటంగా సెహ్వాగ్ బయటకు చెబితే.. మరోవైపు ఆయన్ను సన్మానించాలని బీసీసీఐ భావిస్తోంది.

సెహ్వాగ్ రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో బీసీసీఐ అతడ్ని ఘనంగా సన్మానించాలని భావిస్తోంది. వీలైతే కోట్లా స్టేడియంలో ఒక గేట్ కు సెహ్వాగ్ పేరు పెట్టాలన్న చర్చ జరుగుతోంది. ఇదే విషయాన్ని డీడీసీఏ అధ్యక్షుడు బన్సాల్ చెప్పటం గమనార్హం. ఒక ఆటగాడు తన ఆటకు వీడ్కోలు పలికేందుకు సెలెక్టర్లు అవకాశం ఎందుకివ్వరో? ప్రతి ఒక్కరికి ఇలాంటి అవకాశం ఇవ్వటం సాధ్యం కాకున్నా.. టీమిండియా సభ్యుడిగా.. భారత్ కు ఎన్నో విజయాలు సాధించిన సెహ్వాగ్ లాంటి వారికి ఆ అవకాశం ఇస్తే.. ఇప్పుడీ అసంతృప్తి ఉండేది కాదేమో.