Begin typing your search above and press return to search.

ఆ లేడీ క్రికెటర్ ఉద్యోగం ఇవ్వమని అడిగితే..

By:  Tupaki Desk   |   22 July 2017 11:23 AM GMT
ఆ లేడీ క్రికెటర్ ఉద్యోగం ఇవ్వమని అడిగితే..
X
హర్మన్ ప్రీత్.. హర్మన్ ప్రీత్.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ పేరే మార్మోగిపోతోంది. మహిళల వన్డే ప్రపంచకప్ లో మొన్న ఆస్ట్రేలియాతో సెమీఫైనల్లో ఆమె ఆడిన మెరుపు ఇన్నింగ్స్ ఇండియాను ఒక ఊపు ఊపేసింది. ఆ ఇన్నింగ్స్ ఆడినప్పటి నుంచి హర్మన్ ప్రీత్ ఎవరు.. ఏంటి.. ఆమె నేపథ్యమేంటి.. ఆమె గతమేంటి అని ఆరాలు తీయడం మొదలుపెట్టారు జనాలు. మీడియా ఫోకస్ కూడా ఆ అమ్మాయి మీదే నిలిచింది. ఈ సందర్భంగా హర్మన్ ప్రీత్ గురించి ఆసక్తికర విశేషాలు బయటికి వస్తున్నాయి. తాను క్రికెటర్ కావాలని ఆశపడి అది నెరవేర్చుకోలేకపోయిన హర్మన్ తండ్రి.. తన కూతురిని ఆ ఆటలోకి తీసుకొచ్చి మరో రకంగా తన కలను నెరవేర్చుకోవడం విశేషం. హర్మన్ అబ్బాయిలతోనే క్రికెట్ సాధన చేసి ఆటలో నైపుణ్యం సాధించడం కూడా ఆసక్తికరమే.

ఇక క్రికెట్ ను కెరీర్ గా ఎంచుకున్నాక హర్మన్ అనేక రకాలుగా ఇబ్బంది పడిందట. ఆర్థిక సమస్యలతో సతమతమైందట. జాతీయ జట్టులో తనకంటూ ఓ పేరు సంపాదించాక ఉద్యోగం ఇవ్వాలంటూ పంజాబ్ పోలీస్ ఉన్నతాధికారిని కలిసిందట హర్మన్. అప్పటికే పంజాబ్ నుంచి టీమ్ ఇండియాలో చోటు సంపాదించి మంచి పేరు సంపాదించిన హర్భజన్ సింగ్ కు డీఎస్పీగా ఉద్యోగం ఇచ్చిన నేపథ్యంలో తనకూ అదే ఉద్యోగం ఇవ్వాలని కోరిందట హర్మన్. ఐతే నువ్వేమైనా హర్భజన్ అనుకుంటున్నావా.. అతడి స్థాయి ఏంటి నీ స్థాయి ఏంటి.. నువ్వు ఆఫ్ట్రాల్ లేడీ క్రికెటర్ అంటూ ఉన్నతాధికారి ఆమెను తక్కువ చేసి మాట్లాడినట్లు హర్మన్ కోచ్ తెలిపాడు. ఆ తర్వాత కూడా ఉద్యోగం కోసం పంజాబ్ పోలీస్ విభాగాన్ని సంప్రదించినా పట్టించుకోలేదని అతను చెప్పాడు. ఐతే హర్మన్ తర్వాత రైల్వేలో ఉద్యోగం సంపాదించింది.