Begin typing your search above and press return to search.

క‌రోనా టెర్ర‌ర్ః ఆసుప‌త్రిలో చేరిన స‌చిన్‌.. ఏంటి ప‌రిస్థితి?

By:  Tupaki Desk   |   2 April 2021 6:27 AM GMT
క‌రోనా టెర్ర‌ర్ః ఆసుప‌త్రిలో చేరిన స‌చిన్‌.. ఏంటి ప‌రిస్థితి?
X
క్రికెట్ దిగ్గ‌జం స‌చిన్ టెండూల్క‌ర్ కొవిడ్ బారిన ప‌డిన విష‌యం తెలిసిందే. మార్చి 27న పాజిటివ్ గా నిర్ధార‌ణ కావ‌డంతో సెల్ఫ్ క్వారంటైన్లో ఉన్నారు స‌చిన్‌. అయితే.. క‌రోనా ల‌క్ష‌ణాలు తీవ్రం కావ‌డంతో ఆయ‌న ఆసుప‌త్రిలో చేరారు. దీంతో.. ఏం జ‌రుగుతుందోన‌ని అభిమానులు ఆందోళ‌న వ్య‌క్తంచేస్తున్నారు.

అయితే.. త‌న‌కు ఇబ్బంది ఏమీ లేద‌ని, ఆరోగ్యంగా తిరిగి వ‌స్తాన‌ని సోష‌ల్ మీడియాలో స‌చిన్ ట్వీట్ చేశారు. కాగా.. ఈ ద‌ఫా సెల‌బ్రిటీలుగా కూడా ఎక్కువ సంఖ్య‌లో కొవిడ్ బారిన ప‌డుతున్నారు. ఇప్ప‌టికే.. బాలీవుడ్ ప్ర‌ముఖులు, అమీర్ ఖాన్‌, సంజ‌య్ లీలా భ‌న్సాలీ, మాధ‌వ‌న్ వంటి ఎంతో మందికి కొవిడ్ సోకింది. ప‌లువురు రాజ‌కీయ నాయ‌కులకూ క‌రోనా వ్యాపించడంతో.. అంద‌రూ క్వారంటైన్లో ఉన్నారు.

కాగా.. దేశంలో సెకండ్ వేవ్ భారీ స్థాయిలో విజృంభిస్తోంది. మార్చి 29న అత్య‌ధికంగా 68 వేల 20 కేసులు న‌మోదు కాగా.. గ‌డిచిన 24 గంట‌ల్లో రికార్డు స్థాయికి కేసుల సంఖ్య పెరిగింది. ఒక్క రోజులోనే 81, 466 కేసులు న‌మోదు కావ‌డంతో తీవ్ర ఆందోళ‌న‌కు గురిచేస్తోంది. గ‌త సంవ‌త్స‌రం అక్టోబ‌రు త‌ర్వాత దేశంలో అత్య‌ధిక స్థాయిలో న‌మోదైన కేసుల సంఖ్య ఇదే. 469 మంది ప్రాణాలు కోల్పోయారు. గ‌త 117 రోజుల త‌ర్వాత న‌మోదైన‌ అత్య‌ధిక కొవిడ్‌ మ‌ర‌ణాలు ఇవే.

అయితే.. కేంద్రం, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ముంద‌స్తుగానే ప్ర‌జ‌ల‌ను హెచ్చ‌రించాయి. కానీ.. చాలా మంది నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నందువ‌ల్లే కేసులు తీవ్ర‌స్థాయిలో పెరుగుతున్నాని నిపుణులు చెబుతున్నారు. జ‌నాలు ఎక్కువ‌గా సంద‌ర్శించే షాపింగ్ మాల్స్‌, అన్ని ర‌కాల మార్కెట్లలో భౌతిక దూరం పాటించాల‌ని, తప్ప‌నిస‌రిగా మాస్కు ధ‌రించాల‌ని ప్ర‌భుత్వాలు సూచిస్తున్నాయి. కానీ.. చాలా మంది నిర్ల‌క్ష్యం వ‌హిస్తున్న‌ట్టుగా తెలుస్తోంది.

ఇదిలాఉండ‌గా.. ఇప్ప‌టి వ‌ర‌కూ ఎన్నో వేరియంట్లుగా మార్పు చెందిన మ‌హ‌మ్మారి.. మ‌రింత బ‌ల‌వంతంగా రూపాంత‌రం చెందిన‌ట్టు బ్రిట‌న్, సౌతాఫ్రికా, బ్రెజిల్ వేరియంట్లు నిరూపించాయి. ఈ ర‌కానికి చెందిన వేరియ‌ట్లు భార‌త్ లోనూ క‌నిపిస్తున్నాయ‌ని నిపుణులు ఆందోళ‌న వ్య‌క్తంచేస్తున్నారు. మ‌రోవైపు బ్రెజిల్ లో క‌రోనా మ్యుటేష‌న్ తో వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా మ‌రో కొత్త ర‌కాన్ని కూడా క‌నుగొన్నారు. దీంతో.. ఏం జ‌రుగుతుందోననే ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. అందువ‌ల్ల‌.. ప్ర‌తీ ఒక్క‌రు కొవిడ్ నిబంధ‌న‌లు ఖ‌చ్చితంగా పాటించాల‌ని ప్ర‌భుత్వం ఆదేశిస్తోంది. ఉల్లంఘిస్తున్న వారికి ఏపీలో ఫైన్లు కూడా విధిస్తున్నారు.