Begin typing your search above and press return to search.

స‌చిన్ టెండూల్క‌ర్ కు పోలిస్ సెక్యూరిటీ ర‌ద్దు!

By:  Tupaki Desk   |   25 Dec 2019 5:54 AM GMT
స‌చిన్ టెండూల్క‌ర్ కు పోలిస్ సెక్యూరిటీ ర‌ద్దు!
X
మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ కు సెక్యూరిటీని పూర్తిగా ర‌ద్దు చేసింది మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం. ప్ర‌ముఖుల‌కు భ‌ద్ర‌తా ఏర్పాట్ల స‌మీక్ష‌లో భాగంగా స‌చిన్ కు పూర్తిగా సెక్యూరిటీని తొల‌గిస్తున్న‌ట్టుగా మ‌హారాష్ట్ర ఐపీఎస్ ఒక‌రు ప్ర‌క‌టించారు. ఇన్నాళ్లూ స‌చిన్ కు ఎక్స్ కేట‌గిరి సెక్యూరిటీని ఇచ్చిన‌ట్టుగా చెప్పారు. అంటే స‌చిన్ వెంట ఇర‌వై నాలుగు గంటలూ ఒక కానిస్టేబుల్ ఉంటారు. ఇప్పుడు ఆ ఏర్పాటును కూడా మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం ర‌ద్దు చేసింది.

అయితే స‌చిన్ కు అవ‌స‌ర‌మైతే ఎస్కార్ట్ ను ఏర్పాటు చేస్తామ‌ని మ‌హారాష్ట్ర పోలీసు అధికారి ప్ర‌క‌టించారు. ఇక ఇటీవ‌లే ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు తీసుకున్న ఉద్ధ‌వ్ ఠాక్రే కుటుంబ స‌భ్యుల‌కు భ‌ద్ర‌త‌ను పెంచారు. సీఎం త‌న‌యుడు, ఎమ్మెల్యే హోదాలో ఉన్న ఆదిత్య ఠాక్రేకు భ‌ద్ర‌త‌ను పెంచిన‌ట్టుగా పోలీసు అధికారి ప్ర‌క‌టించారు. ఆయ‌న‌కు వై ప్ల‌స్ కేట‌గిరి నుంచి జెడ్ కేట‌గిరికి పెంచారు భ‌ద్ర‌త‌ను.

ఇక భార‌తీయ జ‌న‌తా పార్టీ నేత‌ల‌కు అక్క‌డ భ‌ద్ర‌త‌ను త‌గ్గించారు. జెడ్ ప్ల‌స్ హోదాలో ఉన్న చాలా మంది బీజేపీ నేత‌ల భ‌ద్ర‌త‌ను వై ప్ల‌స్ స్థాయికి తీసుకొచ్చింది కొత్త ప్ర‌భుత్వం.

మ‌రో న‌ల‌భై ఐదు మంది సెల‌బ్రిటీలు, రాజ‌కీయ నేత‌ల భ‌ద్ర‌త విష‌యంలో కూడా మార్పు చేర్పులు జ‌రిగాయి. ఇటీవ‌లే సోనియా, రాహుల్, ప్రియాంక‌ల భ‌ద్ర‌త విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం కొన్ని నిర్ణ‌యాల‌ను తీసుకుంది. వారికి భ‌ద్ర‌తా ఏర్పాట్ల‌ను త‌గ్గించింది. దాన్ని రాజ‌కీయ క‌క్ష సాధింపుగా కాంగ్రెస్ వాళ్లు ఆరోపించారు. ఇప్పుడు మ‌హారాష్ట్ర‌లో కాంగ్రెస్ భాగ‌స్వామిగా ఉన్న ప్ర‌భుత్వం కూడా బీజేపీ వాళ్ల‌కు భ‌ద్ర‌త‌ను త‌గ్గించడం గ‌మ‌నార్హం.