Begin typing your search above and press return to search.

కొడుకు ఎంపికపై రచ్చ..సచిన్ ఏమన్నాడంటే?

By:  Tupaki Desk   |   8 Jun 2018 3:52 PM GMT
కొడుకు ఎంపికపై రచ్చ..సచిన్ ఏమన్నాడంటే?
X
ఒక మేటి క్రికెటర్ తనయుడు ఆ ఆటలో రాణిస్తాడనీ గ్యారెంటీ లేదు. ఇందుకు చరిత్రలో ఎన్నో ఉదాహరణలు కనిపిస్తాయి. సునీల్ గవాస్కర్ కొడుకు రోహన్ గవాస్కర్ పరిస్థితేంటో తెలిసిందే. సచిన్ టెండూల్కర్ బాటలో క్రికెట్ లోకి వచ్చిన అతడి తనయుడు అర్జున్ టెండూల్కర్ కూడా ఇప్పటిదాకా గొప్ప ప్రదర్శనేమీ చేసింది లేదు. సచిన్ పదహారేళ్లకే అంతర్జాతీయ క్రికెట్ లో సంచలనాలు సృష్టిస్తే అర్జున్ ఇంకా రంజీ జట్టు తలుపు కూడా తట్టలేదు. విదేశాల్లో పేరు మోసిన శిక్షకుల సాయంతో అతడిని తీర్చిదిద్దే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. ఓ మోస్తరు ప్రదర్శనతో నెట్టుకొస్తున్నాడు.

అలాంటివాడిని తీసుకొచ్చి శ్రీలంకలో పర్యటించబోయే భారత అండర్-19 జట్టుకు ఎంపిక చేయడం వివాదాస్పదమవుతోంది. నాలుగు రోజుల - వన్డే మ్యాచ్‌ ల నిమిత్తం భారత అండర్‌-19 జట్టు వచ్చే నెలలో శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఈ సీజన్ లో అర్జున్ ప్రదర్శన ఏమంత గొప్పగాలేదు. అతను ప్రధానంగా ఫాస్ట్ బౌలర్. మిడిలార్డర్ లో బ్యాటింగ్ కూడా చేస్తాడు. అతడి కంటే మెరుగైన చాలామంది కుర్రాళ్లు అవకాశం కోసం ఎదురు చూస్తుంటే అర్జున్‌కు ఎలా చోటిచ్చారంటూ జూనియర్ సెలక్టర్లను విమర్శిస్తున్నారు. దీనిపై సామాజిక మాధ్యమాల్లో జోరుగా చర్చ నడుస్తోంది.

ఐతే సచిన్ అండ్ కో మాత్రం ఈ విమర్శల్ని పట్టించుకోవట్లేదు. తన కొడుక్కి ఈ అవకాశం రావడం పట్ల సచిన్ మామూలుగానే స్పందించాడు. ‘‘అర్జున్‌ అండర్‌-19 జట్టుకు ఎంపికైనందుకు చాలా సంతోషంగా ఉంది. అతడి క్రికెట్‌ కెరీర్లో ఇది కీలక మైలురాయి. అర్జున్‌ ఏం చేయాలనుకున్నా నేను - అంజలి ఎప్పుడూ ప్రోత్సహిస్తాం. అతడి విజయం కోసం ప్రార్థిస్తాం’’ అని సచిన్ పేర్కొన్నాడు.