Begin typing your search above and press return to search.

అక్కడ వారిని లైట్ తీసుకుంటున్నారు

By:  Tupaki Desk   |   7 Nov 2015 4:09 AM GMT
అక్కడ వారిని లైట్ తీసుకుంటున్నారు
X
క్రికెట్ ఆడే దేశాల్లో క్రికెట్ దేవుడు బయటకు వచ్చాడంటే సందడే సందడి. స్వదేశంలోనే కాదు.. విదేశంలోనూ సచిన్ కున్న క్రేజ్ అంతాఇంతా కాదు. ఇక.. భారత్ లో ఈ భారతరత్నం బయటకు అడుగు పెడితే చాలు.. సదరు ప్రాంతమంతా పండగ వాతావరణం నెలకొంటుంది. అదే ఏదైనా రాష్ట్రం వెళితే ఆయన ప్రతి అడుగును కవర్ చేయటానికి స్థానిక మీడియా పడే తపన అంతా ఇంతాకాదు. ఒక్క మీడియానే కాదు.. తమ ప్రాంతానికి వచ్చిన సచిన్ కు సాదరంగా స్వాగతం పలకటానికి ఎంతో ఉత్సాహాన్ని ప్రదర్శిస్తుంటారు.

మరి.. ఇంతటి క్రేజ్ ఉన్న సచిన్ అమెరికాకు వెళితే.. అక్కడ రోడ్ల మీద తిరిగితే..? లాంటి సందేహాలకు ఇప్పుడు సమాధానాలు లభిస్తున్నాయి. మరికొద్ది రోజుల్లో అమెరికాలో ఆసక్తికర టోర్నీ జరగనుంది. ఆటకు రిటైర్ మెంట్ ప్రకటించిన పలు దేశాలకు చెందిన అతిరథ మహారధులంతా మళ్లీ గ్రౌండ్ లోకి దిగనుండటం తెలిసిందే. ప్రపంచానికి పెద్దన్న అయిన అమెరికాలో క్రికెట్ క్రీడకు ఆదరణ తీసుకొచ్చేందుకు క్రికెట్ దేవుడు సచిన్.. ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు షేన్ వార్న్ లు నడుం బిగించటం తెలిసిందే.

తాము ఆడే టోర్నీపై ప్రచారం కల్పించేందుకు.. అక్కడి ఏర్పాట్లు పర్యవేక్షించేందుకు అమెరికాలో తిరుగుతున్న వారిని.. అక్కడి వారు లైట్ తీసుకుంటున్నారట. ఎవరూ పెద్దగా పట్టించుకోవటం లేదని చెబుతున్నారు. క్రికెట్ కు అమెరికాలో ఆదరణ లేకపోవటంతో అమెరికన్లకు సచిన్.. షేన్ వార్న్ ఎవరన్నది తెలీని పరిస్థితి.

అదే సమయంలో.. అమెరికాలో నివసించే భారతీయులు.. ఆస్ట్రేలియన్లు మాత్రం సచిన్ ను చూసి ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారట. వారు వెళ్లిన చోట ఈ దేశాలకు చెందిన వారు ఉంటే మాత్రం.. వారిని కలవటం తమ అదృష్టంగా చెప్పుకొని మురిసిపోతున్నారట.