Begin typing your search above and press return to search.

సచిన్ కొడుకొచ్చాడు.. అరంగేంట్రంలోనే సెంచరీ కొట్టేశాడు.. అచ్చం నాన్నలాగే

By:  Tupaki Desk   |   14 Dec 2022 1:30 PM GMT
సచిన్ కొడుకొచ్చాడు.. అరంగేంట్రంలోనే సెంచరీ కొట్టేశాడు.. అచ్చం నాన్నలాగే
X
అర్జున్ టెండూల్కర్.. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు. కానీ, తండ్రికి తగ్గవాడేనా? కనీసం తండ్రికి క్రికెట్ లో వారసుడేనా? రంజీ ట్రోఫీల్లో అయినా ఆడగలడా..? సచిన్ ఎంతో ముందుచూపుతో ఎడమ చేతి పేస్ బౌలింగ్.. ఎడమ చేతి బ్యాటింగ్ తో క్రికెటర్ గా తీర్చిదిద్దినా అర్జున్ టెండూల్కర్ కెరీర్ అంతర్జాతీయ స్థాయికి ఎదగలేదు. ఆఖరికి ముంబై రంజీ జట్టుకూ ఆడలేని స్థితిలో గోవా రంజీ జట్టుకు మారిపోయాడు. నాలుగేళ్ల కిందట టీమిండియా అండర్ -19 ప్రాబబుల్స్ కు అర్జున్ను ఎంపిక చేస్తేనే పెద్ద గొడవైంది.

ఆ తర్వాత ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కు తీసుకున్నా అది కూడా సచిన్ ప్రభావంతోనే అని విమర్శలు వచ్చాయి. అయితే, ఎట్టకేలకు ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. రంజీ ట్రోఫీ 2022-23 సీజన్‌లో భాగంగా మంగళవారం రాజస్థాన్‌తో మొదలైన మ్యాచ్‌తో అర్జున్‌ ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లోకి అడుగు పెట్టాడు. ఇప్పటివరకు 7 లిస్ట్‌-ఏ మ్యాచ్‌లు, 9 టీ20లు ఆడాడు. 23 ఏళ్ల అర్జున్ టెండూల్కర్ ‌.. గ్రూప్‌-సి జట్టయిన గోవాకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

క్లిష్ట సమయంలో సెంచరీ..

గోవా చాలా చిన్న జట్టు. అక్కడినుంచి జాతీయ స్థాయికి ఎదిగిన ఆటగాళ్లు లేరు. కాస్తోకూస్తో పేరు వచ్చాక గోవా జట్టు నుంచి వెళ్లిపోయి వేరే జట్టుకు ఆడినవాళ్లు మాత్రం ఉన్నారు. ఇక అలాంటి గోవాను అర్జున్ ఎంచుకుని తెలివైన పనిచేశాడు. పైగా గోవా.. అర్జున్ స్వస్థలం ముంబైకి చాలా సమీపం. దీంతో అర్జున్ కు అన్నివిధాలా అనుకూలం. మరోవైపు రాజస్థాన్ తో మ్యాచ్ లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన గోవా.. సుయాశ్‌ ప్రభుదేశాయ్‌ (81 నాటౌట్‌), స్నేహల్‌ సుహాస్‌ ఖౌతాంకర్‌ (59) అర్ధసెంచరీలతో రాణించడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. సుయాశ్‌, అర్జన్‌ టెండూల్కర్‌ క్రీజ్‌లో ఉన్నారు. రాజస్తాన్‌ బౌలర్లలో అంకిత్‌ చౌధరీ 2 వికెట్లు పడగొట్టగా.. అరాఫత్‌ ఖాన్‌, కమలేశ్‌ నాగర్‌కోటీ, మానవ్‌ సుతార తలో వికెట్‌ దక్కించుకున్నారు. అయితే, ఆ సమయానికి అర్జున్ 4 పరుగులతో అజేయంగా క్రీజ్‌లో ఉన్నాడు. ఇదిలా ఉంటే, ఐపీఎల్‌ 2022 సీజన్‌తో క్యాష్‌ రిచ్‌ లీగ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అర్జున్‌ టెండూల్కర్‌.. ముంబై ఫ్రాంచైజీలో స్థానం దక్కించుకున్నప్పటికీ, ఐపీఎల్‌ అరంగేట్రం చేసే అవకాశం మాత్రం దొరకలేదు. ఎంత సచిన్‌ కుమారుడైనా టాలెంట్‌ ఉంటేనే తుది జట్టులో అవకాశం కల్పిస్తామని ముంబై కోచ్‌ జయవర్ధనే అప్పట్లో ప్రకటించాడు. ఎట్టకేలకు అర్జున్‌ తన స్వయంకృషితో గోవా రంజీ టీమ్‌లో చోటు దక్కించుకున్నాడు. రాజస్తాన్‌తో మ్యాచ్‌లో అర్జున్‌ ఏ మేరకు రాణిస్తాడో వేచి చూడాలి. ఈ మ్యాచ్‌లో ఆటతీరుపై అతని భవితవ్యం ఆధారపడి ఉంది.

మొదటి మ్యాచ్ లోనే..

గోవా రెండో రోజు ఇన్నింగ్స్ లో అర్జున్ ఆటే హైలైట్. అచ్చం తండ్రిలాగే అరంగేట్రంలోనే అర్జున్ సెంచరీ కొట్టాడు. 1988 రంజీ ట్రోఫీలో గుజరాత్ తరఫున బరిలో దిగిన 15 ఏళ్ల సచిన్ సెంచరీతో మెరిశాడు. 34 ఏళ్ల తర్వాత అతడి కుమారుడు మళ్లీ ఆ రికార్డును సాధించాడు. రెండో రోజు బుధవారం టీ సమయానికి అర్జున్ 112 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఈ మ్యాచ్ లో అర్జున్ 7వ స్థానంలో బ్యాటింగ్ కు దిగాడు. సుయాష్ ప్రభుదేశాయ్ తో కలిసి ఇన్నింగ్స్ ను నిర్మించాడు. 8వ వికెట్ కు వీరు 209 పరుగులు జోడించారు. ప్రభుదేశాయ్ 172 పరుగులతో అజేయంగా ఉన్నాడు. కాగా, అర్జున్ ఈ ఏడాది ముస్తాక్ అలీ టి20 టోర్నీ, విజయ్ హజారే వన్డే టోర్నీల్లోనూ గోవాకు ఆడాడు. ఏడు చొప్పున వికెట్లు పడగొట్టాడు.

ఇలాగే రాణిస్తే మంచిదే

అర్జున్ ఎడమ చేతి వాటం పేసర్. ఎడమ చేతివాటం బ్యాట్స్ మన్. అతడు ఇలాగే రాణిస్తే టీమిండియాకు కావాల్సిన ఆటగాడు అవుతాడు. ఎందుకంటే భారత్ లో పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్లు తక్కువ. అందులోనూ ఎడమచేతి వాటం పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్లు లేనే లేరు. ఎప్పుడో ఇర్ఫాన్ పఠాన్ వంటి వారు వచ్చినా ఎక్కువ కాలం నిలదొక్కుకోలేదు. అర్జున్ టెండూల్కర్ రూపంలో ఇప్పుడా లోటు తీరే అవకాశం ఉంది. అయితే, అది సచిన్ కుమారుడు ఎంతమేరకు నిలకడగా రాణిస్తాడు? అనేదానిపై ఆధారపడి ఉంటుంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.