Begin typing your search above and press return to search.

'శ్రీమంతుడు' సంతోషం ఇంతింత కాదయా

By:  Tupaki Desk   |   16 Nov 2016 3:11 PM GMT
శ్రీమంతుడు సంతోషం ఇంతింత కాదయా
X
క్రికెట్ దేవుడు సచిన్ ఇప్పుడు కేవలం రాజ్యసభ ఎంపి మాత్రమే కాదు.. ఒక సమాజ సేవకుడు కూడా. రెండున్నర దశాబ్దాలకు పైగా భారత క్రికెట్ కి సేవలు అందించిన మాస్టర్ బ్లాస్టర్ ఇప్పుడు దేశానికి ''శ్రీమంతుడు'' సినిమాలో మహేష్‌ బాబు తరహాలో సేవ చేస్తున్నాడు. ఆ సినిమా ద్వారా పాపులర్ అయిన గ్రామాల దత్తత ప్రోగ్రామ్ ను మనోడు ముందుగానే అమలు చేశాడులే.

ప్రధాని మోడీ పిలుపునిచ్చిన 'సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన'కు అతిత్వరగా స్పందించిన సచిన్.. ఏపీలోని పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో పుట్టం రాజు కండ్రికను దత్తత తీసుకుని అభివృద్ధి పనులు చేపట్టాడు. ఇప్పుడా గ్రామాన్ని సందర్శించేందుకు వచ్చిన టెండూల్కర్ కళ్లలో.. సెంచరీ కొట్టినప్పుడు కనిపించే ఆనందం కనిపించడం విశేషం. 2.79 కోట్ల రూపాయలతో పుట్టంరాజు కండ్రికలో అభివృద్ధి పనులు నిర్వహించిన సచిన్.. ఆ గ్రామం ఇప్పుడున్న తీరును చూసి చాలా చాలా ఆనందించేశాడు. గ్రామంలోని వయోవృద్ధులతోను.. మహిళలతోను చాలాసేపు ముచ్చటించాడు. కుర్రకారుతో కలిసి టీ తాగడమే కాదు.. గ్రామమంతా కలియదిరిగాడు కూడా. స్థానిక ప్లేయర్లకు క్రికెట్ కిట్స్ పంచిపెట్టి తనలోని స్పోర్ట్స్ మన్ ను మరోసారి బయటకు తీశాడు.

'దత్తత తీసుకున్న గ్రామం పుట్టంరాజు కండ్రిక.. ఇప్పుడ బహిరంగ మలమూత్ర విసర్జన నుంచి విముక్తి పొందింది. స్వచ్ఛ్ భారత్.. సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజనలో భాగంగా మొదటి దశ పూర్తయింది' అంటూ.. ట్వీట్ చేసి మరీ సచిన్ తన ఆనందాన్ని పంచుకున్నాడు ఈ ''శ్రీమంతుడు''. మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానని.. త్వరలో మరోసారి గ్రామాన్ని విజిట్ చేస్తానని చెప్పాడు సచిన్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/