Begin typing your search above and press return to search.

ఆ పేలుడు పదార్థాలు సచిన్ వాజేనే కొన్నాడట..!

By:  Tupaki Desk   |   1 April 2021 7:06 AM GMT
ఆ పేలుడు పదార్థాలు సచిన్ వాజేనే కొన్నాడట..!
X
ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్‌ అంబానీ ఇంటి సమీపంలో పేలుడు పదార్థాల వాహనం కేసులో విచారణ జరిగేకొద్ది పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆ వాహనంలో ఉన్న జిలెటెన్‌ స్టిక్స్‌ ను పోలీసు అధికారి సచిన్‌ వాజేనే కొనుగోలు చేసినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ ‌ఐఏ) వర్గాలు బుధవారం వెల్లడించాయి. అయితే, ఆ పేలుడు పదార్థాలను వాజే ఎక్కడి నుంచి కొనుగోలు చేశారన్నది మాత్రం చెప్పలేదు.

ఫిబ్రవరి 25న దక్షిణ ముంబయిలో ముకేశ్‌ అంబానీ ఇంటికి సమీపంలో కనుగొన్న పేలుడు పదార్థాల వాహనం కేసును ఎన్ ‌ఐఏ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో అరెస్టై, సస్పెన్షన్‌ కు గురైన వాజే.. ప్రస్తుతం ఎన్‌ ఐఏ కస్టడీలో ఉన్నారు. అయితే జిలటెన్‌ స్టిక్స్ ‌తో ఉన్న వాహనాన్ని అంబానీ ఇంటి వద్ద నిలిపిన సమయంలో వాజే కూడా అక్కడే ఉన్నట్లు తమ వద్ద సీసీటీవీ ఫుటేజ్‌ ఉందని ఎన్ ఐ ఏ వర్గాలు పేర్కొన్నాయి. అంతేకాకుండా, ఆ వాహనంలో పెట్టిన పేలుడు పదార్థాలను కొనుగోలు చేసింది కూడా వాజేనే అని తెలిపాయి. దర్యాప్తులో భాగంగా ముంబయి పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయం ప్రాంగణంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ‌లను కూడా సేకరించనున్నట్లు చెప్పాయి. తద్వారా వాజే కదలికలను తెలుసుకోనున్నారు. మరోవైపు అంబానీ నివాసం సమీపంలో ఆ వాహనాన్ని పార్క్‌ చేసింది వాజే వ్యక్తిగత డ్రైవరేనని ఎన్‌ ఐఏ దర్యాప్తులో తేలింది. డ్రైవర్‌ స్కార్పియోను తీసుకురాగా, ఆ వెనుకే వాజే తెల్లరంగు ఇన్నోవా కారులో అనుసరించారని ఎన్ ‌ఐఏ అధికారులు చెప్పారు.

ఫిబ్రవరి 17న మాన్‌ సుఖ్‌ హిరేన్‌ స్కార్పియోను ములంద్‌ ఎరోలీ రోడ్డులో నిలిపాడు. అదే రోజు పోలీసు హెడ్‌ క్వార్టర్స్ ‌కు వచ్చి కారు తాళాలను సచిన్‌ వాజేకు ఇచ్చి ఉంటారు. ఆ తర్వాత వాజే వ్యక్తిగత డ్రైవర్‌ ఆ స్కార్పియోను తీసుకొచ్చి సాకేత్‌ హౌసింగ్‌ సొసైటీలోని సచిన్ వాజే నివాసంలో పార్క్‌ చేశాడు. ఫిబ్రవరి 24 రాత్రి వరకు స్కార్పియో, పోలీసు అధికారి ఇంటి వద్దే ఉంది. ఫిబ్రవరి 25 రాత్రి 10 గంటలకు డ్రైవర్‌ స్కార్పియోను తీసుకెళ్లి అంబానీ ఇంటి సమీపంలో పార్క్‌ చేశాడు. కారు దిగి వెనకాలే తెల్లరంగు ఇన్నోవా కారులో ఫాలో అవుతూ వచ్చిన సచిన్ వాజే నడుపుతున్న ఇన్నోవాలో ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోయారని ఎన్ ఐ ఏ అధికారులు తెలిపారు. సాక్ష్యాలను మాయం చేసేందుకు..కొద్ది గంటల తర్వాత సచిన్ వాజే మళ్లీ ఇన్నోవా కారులో వచ్చి స్కార్పియోలో బెదిరింపు లేఖ పెట్టి వెళ్లినట్లు ఎన్ఐఏ అధికారులు పేర్కొన్నారు. సాక్ష్యాలను మాయం చేసేందుకు నిందితులు కొన్ని సీసీటీవీ రికార్డులను ధ్వంసం చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది.