Begin typing your search above and press return to search.

మానస పుత్రిక కంట కన్నీరు... ?

By:  Tupaki Desk   |   8 Jan 2022 4:30 PM GMT
మానస పుత్రిక కంట కన్నీరు... ?
X
సంక్రాంతి పండుగ ముందుంది. తెలుగింటి లోగిళ్ళు సంబరాలు అంబరాలు తాకాలి. ఈ పండుగ వేళ ప్రభుత్వ ఉద్యోగులకు తీయని కబురు చెప్పారు జగన్. అది వారికి ఎంతవరకూ సంతృప్తి ఇచ్చింది అన్నది వేరే సంగతి కానీ జగన్ మాత్రం వారికి ఎంతో కొంత సాయం చేశారు. ఒక విధంగా వారికి కొంత హ్యాపీగా ఉంది. మరి అదే సమయంలో జగన్ మానసపుత్రిక అనదగిన సచివాలయాల సంగతేంటి అంటే కంట కన్నీరు ఒలుకుతోంది. సచివాలయాలు జగన్ బ్రెయిన్ చైల్డ్.

వస్తూనే జగన్ లక్షన్నర మందికి సచివాలయాల్లో ఉద్యోగాలు ఇచ్చారు. రెండేళ్ళు కాగానే ప్రొబేషన్ ఇస్తామని, జీతాలు పెంచుతామని ప్రభుత్వ ఉద్యోగంగా ఖాయం చేసి శాశ్వతమైన ధీమా కల్పిస్తామని చెప్పారు. 2021 నవంబర్ నాటికి రెండేళ్ళు పూర్తి అయ్యాయి. కానీ ప్రొబేషన్ అన్న ఊసే లేదు. రేపో మాపో అని అంతా ఆశపడుతున్న వేళ జగన్ పీయార్సీ ప్రకటన వేళ సచివాలయ ఉద్యోగులకు చేదు వార్తనే వినిపించారు.

జూన్ నుంచి కానీ వారికి ప్రోబేషన్ ఉండదని చెప్పేశారు. దాంతో సచివాలయ ఉద్యోగులు ఒక్కసారిగా బరస్ట్ అవుతున్నారు. తాము గొడ్డులా చాకిరీ చేస్తున్నామని, రెండేళ్ళుగా అనేక రకాలుగా తమనే వాడుకుంటున్నారని వాపోయారు. సచివాలయాలనే కేంద్రంగా చేసుకుని ప్రభుత్వ సేవలు అన్నీ అక్కడ నుంచే చేస్తున్నామని, ప్రాణాలనే తీసే కరోనా మహమ్మారి వేళ కూడా జడుపూ జంకూ లేకుండా ఇంటింటికీ తిరిగి వెళ్ళి మరీ జనాల బాగోగులు చూశామని అంటున్నారు.

తీరా తమకు ఇచ్చినది కేవలం పదిహేను వేల రూపాయలు మాత్రమేనని, అయినా ఆశతో ఉన్నమని, కానీ తమ ఆశలు చిదిమేసేలా ప్రొబేషన్ డిక్లేర్ చేయకుండా వాయిదా వేసుకుంటూ పోతున్నారని మండుతున్నారు. దానికి నిరసంగా సచివాలయ కార్యదర్శులు వాట్సప్ గ్రూపుల ఉంచి వరసబెట్టి ఎగ్జిట్ అవుతున్నారు. జాయింట్ కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారి అడ్మిన్ గా ఉన్న వాట్సప్ గ్రూపుల నుంచి వారు తప్పుకోవడం ద్వారా సరికొత్త నిరసనను తెలియచేస్తున్నారు.

చూడబోతే మూడవ వేవ్ కరోనా పొంచి ఉంది. ఈ సమయంలో సచివాలయ సేవలు అవసరం. అలాంటి సమయంలో వారంతా ఇలా నిరసన బాట పట్టడంతో అధికారులకు చమటలు పడుతున్నాయి. మరో వైపు స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ అజయ్‌జైన్‌ అయితే ఎగ్జిత్ అవుతున్న కార్యదర్శులతో మాట్లాడి నచ్చచెప్పాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలా కాకుండా ఎవరైనా మొండికేస్తే కఠిన చర్యలు కూడా సిద్ధపడాలని సూచించారని టాక్. నిజంగా అలా కనుక జరిగితే అదేంత వివాదం అవుతుందో చూడాలి

మొత్తానికి జగన్ తాను క్రియేట్ చేసిన సచివాలయ వ్యవస్థ పెద్ద పండుగ వేల వేదనాభరితం అవుతూంటే చూస్తూ ఊరుకోవడం భావ్యం కాదనే అంటున్నారు. ఈ విషయంలో చేయాల్సింది చేయాలని, తన మానసపుత్రిక కంట నీరు తుడవడమే ధర్మమని అంటున్నారు. మరి ఈ విషయంలో జగన్ యాక్షన్ ఏంటో చూడాలి.