Begin typing your search above and press return to search.

బంగ్లాదేశ్ ప్రధానికి తన బాధ చెప్పుకొన్న అద్వానీ

By:  Tupaki Desk   |   11 April 2017 11:30 AM GMT
బంగ్లాదేశ్ ప్రధానికి తన బాధ చెప్పుకొన్న అద్వానీ
X
బీజేపీ కురువృద్ధుడు ఎల్కే అద్వానీ జీవితంలో ఎన్నో సాధించినా మరెన్నో తీరని కోరికలూ ఉండిపోయాయి. అంతేకాదు, ఆయన మనసులో గూడు కట్టుకుపోయిన ఆవేదనలూ ఉన్నాయి. బీజేపీని ఈ స్థాయికి చేర్చిన అద్వానీ ప్రధాని కాలేకపోయారు, అంతేకాదు... రాష్ర్టపతి పదవి దక్కుతుందని ఆశపడినా అదీ నెరవేరేలా కనిపించడం లేదు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రాభవం తీవ్రంగా ఉండడంతో అద్వానీ మాటలను లెక్క చేసేవారే లేరిప్పుడు. అలా, అని మోడీ తనకు అన్యాయం చేస్తున్నారని చెప్పుకోవడానికీ ఎక్కడా అవకాశం కనిపించదు.. తాను ఎదురుపడితే ప్రధాని స్థాయిలో ఉండి కూడా పాదాభివందనం చేయడానికి ముందుకు వంగుతారు మోడీ, అలాంటప్పుడు అద్వానీ ఇంకా ఏమీ అనలేని పరిస్థితి. ఈ బాధలు, ఆవేదనలు ఎలా ఉన్నా అద్వానీ మనసులో మరికొన్ని బాధలు కూడా ఉన్నాయట. ముఖ్యంగా అది తన జన్మస్థలం గురించి.. ఆ బాధను బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో అద్వానీ పంచుకున్నారు.

భారత పర్యటనకు వచ్చిన బంగ్లా ప్రధాని షేక్ హసీనా ఢిల్లీలో ఇండియా ఫౌండేషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హసీనాతో పాటు బీజేపీ కురువృద్ధుడు అద్వానీ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా అద్వానీ మాట్లాడుతూ, పాకిస్థాన్ లో ఉన్న సింధ్ రాష్ట్రం భారత్ లో భాగం కాకపోవడం బాధాకరమని అన్నారు. తాను సింధ్ లో జన్మించానని... తన జన్మస్థలం భారత్ లో లేకపోవడం తనకు తీరని లోటు అని చెప్పారు.

తనలాంటి ఎంతో మంది ఇదే విషయంలో బాధ పడుతున్నారని తెలిపారు. బంగ్లాదేశ్ ప్రధాని భారత్ కు రావడంతో తన ఆవేదనను ఆమెతో పంచుకున్నానని చెప్పారు. తన చిన్న వయసులో సింధ్ ప్రాంతంలో ఆరెస్సెస్ లో చాలా చురుకుగా ఉండేవాడినని అద్వానీ ఆనాటి రోజులను గుర్తు చేసుకున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/