Begin typing your search above and press return to search.

ఏపీ హైకోర్టు అమ‌రావ‌తిలోనే..!

By:  Tupaki Desk   |   3 March 2016 11:16 AM GMT
ఏపీ హైకోర్టు అమ‌రావ‌తిలోనే..!
X
ఏపీకి సంబంధించిన మ‌రో అంశంపై స్ప‌ష్ట‌త వ‌చ్చేసింది. విభజ‌న నేప‌థ్యంలో ఒక్కొక్క‌టిగా అన్నింటిని ఏర్పాటు చేసుకోవాల్సి ప‌రిస్థితి ఏపీకి ఏర్ప‌డింది. రాష్ట్ర విభ‌జ‌న పూర్తి అయినా.. ఇప్ప‌టికి ప‌లు కార్యాల‌యాల్ని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది. అసెంబ్లీ.. సెక్ర‌టేరియ‌ట్.. హైకోర్టు మొద‌లు చాలానే భ‌వ‌నాల్ని నిర్మించుకోవాల్సి ఉంది. ఈ నేప‌థ్యంలో వేటిని ఎక్క‌డ నిర్మిస్తార‌న్న సందేహాలున్నాయి.

ఇలాంటి వాటిల్లో ఒక‌టైన హైకోర్టు భ‌వ‌న నిర్మాణంపై తాజాగా స్ప‌ష్ట‌త వ‌చ్చేసింది. ఏపీ స‌ర్కారు ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్న రాజ‌ధాని న‌గ‌రం అమ‌రావ‌తిలోనే ఏపీ హైకోర్టును ఏర్పాటు చేస్తున్న‌ట్లు కేంద్ర‌మంత్రి స‌దానంద‌గౌడ వెల్ల‌డించారు. తాజా ప్ర‌క‌ట‌న‌తో ఏపీ హైకోర్టును ఎక్క‌డ ఏర్పాటు చేస్తార‌న్న అంశంపై ఇప్ప‌టివ‌ర‌కూ నెల‌కొన్న సందేహాలు తీరిపోయిన‌ట్లే.

ఏపీ హైకోర్టును రాయ‌ల‌సీమ‌లో ఏర్పాటు చేయాల‌న్న డిమాండ్ ప‌లువురు వ్య‌క్తం చేస్తుండ‌గా.. అలా కాదు.. విజ‌య‌వాడ‌.. గుంటూరులోనే ఏర్పాటు చేయాల‌ని డిమాండ్ ఉంది. ఈ నేప‌థ్యంలో.. ఈ వాద‌న‌ల‌కు చెక్ చెబుతూ.. తాజాగా కేంద్ర‌న్యాయ‌మంత్రి అమ‌రావ‌తిలోనే ఏపీ హైకోర్టు ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించ‌టంతో.. ఏపీలో హైకోర్టు ఎక్క‌డా అన్న చ‌ర్చ ఇక ముగిసిన‌ట్లేన‌ని చెప్పొచ్చు. అమ‌రావ‌తిలో హైకోర్టును ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు చెప్పిన కేంద్ర‌మంత్రి.. భ‌వ‌నాన్ని ఎప్ప‌టికి సిద్ధం చేస్తార‌న్న విష‌యాన్ని మాత్రం మాట వ‌ర‌స‌కు కూడా చెప్ప‌క‌పోవ‌టం గ‌మ‌నార్హం.

హైకోర్టు భ‌వ‌నం ఏర్పాటు చేసి.. దాన్ని పూర్తి చేసి.. త‌న కార్య‌క‌లాపాల్ని మొద‌లు పెట్టేందుకు త‌క్కువ‌లో త‌క్కువ మూడేళ్ల‌కు పైనే ప‌డుతుంద‌న్న అంచాన‌లు ఉన్న నేప‌థ్యంలో.. ఈ విష‌యంపై త్వ‌ర‌గా నిర్ణ‌యం తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. ఇబ్బందిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. జూన్ నాటికి ఏపీ పాల‌న మొత్తం అమ‌రావ‌తికి వ‌చ్చేయ‌నుంది. అనంత‌రం.. న్యాయ‌ప‌ర‌మైన అంశాల కోసం వివిధ శాఖ‌ల‌కు చెందిన అధికారులు నిత్యం అమ‌రావ‌తి టు హైద‌రాబాద్ కోర్టు ప‌నుల కోసం తిర‌గాల్సి ఉంటుందన్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు.