Begin typing your search above and press return to search.

'సత్రం' సమస్యగా మారుతోంది బాబు

By:  Tupaki Desk   |   28 Jun 2016 8:07 AM GMT
సత్రం సమస్యగా మారుతోంది బాబు
X
సంచలనం సృష్టిస్తోన్న అమరావతి సదావర్తి సత్రం భూముల వేలం వ్యవహారం హైకోర్టు నోటీసుతో కొత్త మలుపు తిరిగింది. ఈ వ్యవహారంలో వెయ్యికోట్ల కుంభకోణం జరిగిందంటూ ఇప్పటికే వైసీపీ - కాంగ్రెస్ ఆరోపణలు గుప్పిస్తూ ఆందోళన చేస్తున్న సంగ‌తి తెలిసిందే. వివిధ కోణాల్లో చెడ్డ‌పేరు వ‌చ్చే ప్ర‌మాదం ముంచుకొస్తున్న నేప‌థ్యంలో స‌దావ‌ర్తి స‌మ‌స్య‌కు పార్టీ అధినేత చంద్రబాబు చెక్ పెట్టాల‌ని త‌మ్ముళ్లు కోరుతున్నారు.

అమరావతి లోని సదావర్తి సత్రానికి తమిళనాడులో ఉన్న 83.11 ఎకరాల భూమిని ఏపి సర్కారు నిర్వహించిన వేలం పాటలో - కేవలం రూ.22కోట్లకే అధికారపార్టీ టిడిపికి చెందిన నేతలు దక్కించుకున్న వైనం వివాదాస్పదమైంది. ఆ భూముల విలువ ఎకరానికి రూ.6.25కోట్లు ఉన్నప్పటికీ - వేలంలోఎకరాన్ని కేవలం రూ.27లక్షలకే దక్కించుకోవటానికి టీడీపీ ప్రముఖులు అడ్డదారులు తొక్కారని, తద్వారా రూ.978కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టారని తీవ్రస్థాయిలో విమర్శలతో టిడిపి ఉక్కిరిబిక్కిరవుతోంది. సదావర్తి సత్రం భూములు ఉన్న ప్రాంతంలో టీసీఎస్ వంటి అగ్రశ్రేణి కంపెనీలు ఉన్నాయి. అలాంటి చోట భూమికి డిమాండ్ ఉండటం సహజమే. పైగా తమిళనాడు రాజధాని చెన్నైకి అత్యంత సమీపంలో ఉండటం కూడా దీని డిమాండ్ పెరగటానికి కారణమైంది.

ఈ భూముల‌పై వైసీపీ నేత ధర్మాన ప్రసాదరావు కొద్దిరోజుల నుంచి ఆందోళన చేస్తున్నారు. తమిళనాడులోని తారంబూరుకు ఆయన నేతృత్వంలో ఓ ప్రతినిధి బృందం వెళ్లి అక్కడి సత్రం భూములను సందర్శించి వచ్చింది. విచిత్రమేమంటే సత్రం భూములను వేలం వేస్తున్నారన్న విషయం తమకు తెలియదని, తెలిస్తే ఎకరాకు రూ.2కోట్ల చొప్పున తామే కొనుక్కునే వాళ్లమని ప్రతినిధి బృందానికి - స్థానిక తెలుగు వారు చెప్పడం గమనార్హం. దీంతో ఏపీ ప్రభుత్వం నిర్వహించిన వేలంలో లొసుగులున్నాయన్న విషయం బయటకు పొక్కినట్టయింది. ఈ నేప‌థ్యంలోనే తాజా వేలాన్ని రద్దు చేసి - మొత్తం వ్యవహారంపై విచారణ జరిపించాలని బ్రాహ్మణ ఫెడరేషన్ నేత ద్రోణంరాజు రవికుమార్ హైకోర్టులో కేసు వేయడంతో సోమవారం ఏపి ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దీంతో ఈ వివాదం కొత్తమలుపు తిరిగింది. సత్రం భూముల వేలంపై ముందుగా ప్రముఖ జాతీయ - స్థానిక దినపత్రికల్లో తెలియచేయకపోవడం - దేవాదాయ ధర్మాదాయ శాఖకు చెందిన భూముల అమ్మకం గురించి హైకోర్టు నుంచి ముందస్తు అనుమతి పొందకపోవడం - సత్రం భూముల అమ్మకం గురించి నోటీసు బోర్టులో పెట్టకపోవడం - వేలం వేసే భూముల స్థాయికి తగిన అధికారిని నియమించకపోవడం వంటి అనేక అంశాలు ప్రభుత్వానికి సమస్యలు సృష్టించేవేనని న్యాయ నిపుణులు చెబుతున్నారు.

చిన్న పత్రికలలో ప్రకటన వేశామని చెబుతున్నా, ఇది రెండు రాష్ట్రాల వ్యవహారం కాబట్టి నిబంధనల ప్రకారం జాతీయ దినపత్రికల్లో ప్రముఖంగా ప్రచారం చేయాల్సి ఉంది. వేలం విషయాన్ని నోటీసు బోర్డులపైనా ప్రకటించాలి. ఆ తర్వాత వెబ్‌ సైట్ ద్వారా వేలం విషయాన్ని వెల్లడించాలి. రెండింటిలో ఎటు నుంచి ఎక్కువ స్పందన వస్తే దానిని అనుసరించాలి. అయితే, వీటిలో ఏపి దేవాదాయ శాఖ ఏ ఒక్క నిబంధననూ పాటించలేదని ధర్మాన ప్రసాదరావు ఆరోపణ. అంతేకాదు - ఈ విషయంలో కార్యనిర్వాహక అధికారి సరైన నిబంధనలు పాటించలేదంటూ, ధర్మాన బృందం వెళ్లినప్పుడు జాయింట్ డైరెక్టర్ భ్రమరాంబ చెప్పిన విషయం ఓ చానెల్‌ లో ప్రసారం కావడం సర్కారుకు ఇబ్బంది కలిగించేదే. అంతేకాకుండా ఈ వ్యవహారంలో టీడీపీ ఎమ్మెల్యే - అదే పార్టీకి చెందిన కాపు కార్పొరేషన్ చైర్మన్ కుటుంబ సభ్యులుండటంతో రాజకీయ రంగు పులుముకుంది. కోర్టు కూడా ఇప్పుడు వారికే నోటీసులు జారీ చేయడాన్ని గమనిస్తే, రానున్న రోజుల్లో ఇది పెనుదుమారం రేపే అవకాశాలు కనిపిస్తున్నాయి. సదావర్తిసత్రం భూముల వ్యవహారంలో తమ ప్రభుత్వ ప్రతిష్ఠ మరింత దెబ్బతినకుండా ఉండాలంటే వేలాన్ని రద్దు చేసి, తిరిగి బహిరంగవేలం నిర్వహించడమే మంచిదన్న అభిప్రాయం టిడిపి నేతల్లో వ్యక్తమవుతోంది.