Begin typing your search above and press return to search.

సాధువుల హింసాకాండ

By:  Tupaki Desk   |   13 May 2016 4:51 AM GMT
సాధువుల హింసాకాండ
X
ముక్కుమూసుకొని తపస్సు చేసుకునే చందంగా.. ఇహపరమైన వాంఛలకు దూరంగా వ్యవహరించే సాధువుల్లోనూ రాజకీయం కోణం ఇంత వయలెంట్ గా ఉంటుందా? అని షాక్ తినే పరిస్థితి. సాధువుల మధ్య ఎన్నికల చిచ్చు రగలటం ఒక ఎత్తు అయితే.. ఇందులో భాగంగా రెండు పక్షాలుగా మారిన సాధువులు పోటాపోటీగా ఘర్షణకు దిగటమే కాదు.. తుపాకీలతో కాల్పుల వరకూ వెళ్లిన ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది.

మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో సింహస్థ కుంభమేళా సందర్భంగా సాధువుల అఖాడా ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల సందర్భంగా సాధువులు రెండు వర్గాలుగా చీలిపోయారు. వీరి మధ్య లొల్లి ఓ రేంజ్ లో పెరగటమే కాదు.. కోట్లాట తుపాకీ కాల్పుల వరకూ వెళ్లింది. ఇరు వర్గాల మీద పెరిగిన ఘర్షణలో ఒక వర్గం మరో వర్గం మీద కాల్పులు జరపగా.. ఆరుగురు సాధువులు తీవ్రంగా గాయపడటం గమనార్హం.

గాయాల పాలైన సాధువుల్ని ఆసుపత్రికి తరలించి దీనికి బాధ్యులుగా భావిస్తున్న పలువురు సాములోరి మీద పోలీసులు కేసు నమోదు చేయటమే కాదు.. ఇద్దరు సాధువుల్ని అదుపులోకి తీసుకున్నారు. అయినా.. సాధువుల చేతికి తుపాకీలు ఎలా వస్తాయి చెప్మా అన్న సందేహానికి తగ్గట్లుగా పోలీసుల మాటలు కాస్త చిత్రంగా ఉన్నాయన్న వాదన ఉంది. ఎందుకంటే.. గాయపడ్డ సాధువుల వంటి మీద తుపాకీ తూటాల గాయాలు లేవని.. త్రిశూలాల గాయాలు మాత్రమే ఉన్నాయని చెబుతున్నారు. గాయపడ్డ సాములోరికి దెబ్బలు తగిలింది తూటాల వల్లా? త్రిశూలాల వల్లా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఏమైనా అన్ని వదిలేసుకొని తమదైన లోకంలో ఉండే సాధువుల మధ్య కూడా రాజకీయ రచ్చ మరీ ఇంతలా ఉంటుందా?