Begin typing your search above and press return to search.

పాపం తెలంగాణ మంత్రులు.. ఏంటి పరిస్థితి?

By:  Tupaki Desk   |   31 Oct 2019 5:21 AM GMT
పాపం తెలంగాణ మంత్రులు.. ఏంటి పరిస్థితి?
X
ఇటీవలే మంత్రివర్గ విస్తరణలో బీసీ కోటాలో చోటు దక్కించుకున్నారు మంత్రి గంగుల కమలాకర్. కేసీఆర్ ఆయనకు బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖ బాధ్యతలు అప్పగించారు. ఈయన రాష్ట్రానికి మంత్రి కానీ.. ఇప్పుడు కరీంనగర్ నుంచి కదలడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.. ఇక్కడ నగర స్మార్ట్ సిటీ పనులతోపాటు అభివృద్ధి కార్యక్రమాలనే పరిమితమవుతున్నారట. విచిత్రం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా పౌరసరఫరాలపై సమీక్షించాల్సిన మంత్రి గంగుల ఇటీవలే కేవలం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పౌరసరఫరాలపై సమీక్షించారు. దీనికి రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ కూడా కరీంనగర్ వచ్చి పాల్గొనడం విస్తుగొలిపింది.

ఇక ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాకు ఒకే ఒక మంత్రి పదవి దక్కింది. నిర్మల్ ఎమ్మెల్యే అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి దేవాదాయ శాఖ మంత్రి అయ్యారు. ఆయన నిర్మల్ విడిచి కుమ్రం బీం ఆసిఫాబాద్ జిల్లాకు వెళ్లినా పక్కనే ఉన్న ఆదిలాబాద్ వెళ్లినా అక్కడి ఎమ్మెల్యేల నుంచి నిరసన వ్యక్తం కావడంతో అటు వెళ్లడమే మానేశారట.. ఇలా తెలంగాణలో మంత్రులు కేవలం జిల్లాలు, వారి నియోజకవర్గాలకే పరిమితమవుతున్న తీరు పార్టీలో చర్చనీయాంశమవుతోంది

ఈయనే కాదు.. తెలంగాణలో ఇప్పుడు ఏ మంత్రి రాష్ట్రానికి మంత్రిగా వ్యవహరించడం లేదట.. ఆయా నియోజకవర్గాలకు వెళితే ఆ ఎమ్మెల్యేలతో తగాదాలు, ఆదిపత్య పోరు, మంత్రులగా స్తానం దక్కలేదన్న అక్కసుతో ఇప్పుడున్న మంత్రులను నియోజకవర్గాలకే రాకుండా అడ్డుకుంటున్నారట గులాబీ ఎమ్మెల్యేలు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటించే మంత్రులు ముగ్గురే ముగ్గురు. వారే మంత్రులు హరీష్, ఈటల, కేటీఆర్. వీరు తప్ప ఇంకెవరు ఈ కుమ్ములాటల రాజకీయాల్లో పక్క నియోజకవర్గాలు, కనీసం జిల్లాలో కూడా పర్యటించడానికి భయపడుతున్నారు. ఇక కేసీఆర్ ను కాదని హైదరాబాద్ లో ఆ శాఖలను సొంతంగా సమీక్షించే ధైర్యం కూడా చేయడం లేదట..

ఇక గతంలో ఓడిపోయిన మంత్రులు, ఈ దఫా మంత్రి పదవి దక్కని సీనియర్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో పర్యటిస్తున్న మంత్రులకు వారి నుంచి హెచ్చరికలు కూడా వస్తున్నాయట.. నువ్వు జూనియర్ వి నా నియోజకవర్గంలో రాజకీయం చేస్తావా అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారట..

ఇలా తెలంగాణ మంత్రులు ఇప్పుడు ఉత్సవ విగ్రహాలు మారిపోతున్నారు.. వారు రాష్ట్రానికి మంత్రులుగా కాకుండా కేవలం తమ నియోజకవర్గాలకు, పాత జిల్లాలకే మంత్రులుగా వ్యవహరిస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. హైదరాబాద్ లో కేసీఆర్ భయం, జిల్లాల్లో ఎమ్మెల్యేల భయంతో వారంతా మిన్నకుండిపోతున్నారట..