Begin typing your search above and press return to search.

కేసులు ఉంటే బీజేపీలో సేఫ్‌!!

By:  Tupaki Desk   |   11 Dec 2021 2:30 PM GMT
కేసులు ఉంటే బీజేపీలో సేఫ్‌!!
X
ఏపీ, తెలంగాణ రాజ‌కీయాల్లో నేత‌ల వైఖ‌రి వింత‌గా ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. త‌మ‌కు ఏదైనా ఇబ్బంది వ‌స్తే.. త‌మ‌పై కేసులు ఉంటే.. ముఖ్యంగా ఆస్తులు, అక్ర‌మ సంపాద‌న‌లు, బ్యాంకు రుణాల ఎగ‌వేత‌లు వంటివి ఉంటే.. ఇలాంటి వారు.. బీజేపీ పంచ‌న చేరుతున్నారు. తాజాగా తెలంగాణ‌లో దాదాపు 31 కేసులు(వీటిలో సీఎం కేసీఆర్‌ను దూషించార‌నే కేసుకూడా ఉంది) ఉన్న తీన్మార్ మ‌ల్ల‌న్న బీజేపీ గూటికి చేరిపోయారు. గ‌తంలో త‌న‌కు తాను గెలిచే స‌త్తా ఉన్న‌ప్ప‌టికీ.. ఇత‌ర పార్టీల నుంచి ఆహ్వానం ఉన్న‌ప్ప‌టికీ.. మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ కేసుల భ‌యంతోనే బీజేపీ పంచ‌న చేరార‌నే టాక్ వినిపించింది.

ఇక‌, ఏపీలోనూ ఇదే త‌ర‌హాలో కొంద‌రు టీడీపీ నాయ‌కులు.. కేసుల‌కు భ‌య‌ప‌డి బీజేపీ జెండా క‌ప్పుకొన్నారు. రాజ్య‌స‌భ టికెట్ పొందిన‌, టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు ఎంతో స‌న్నిహితులైన సుజ‌నా చౌద‌రి, సీఎం ర‌మేష్‌, టీజీ వెంక‌టేష్‌, మాజీ మంత్రి ఆదినారాయ‌ణ‌రెడ్డి, ధ‌ర్మ‌వ‌రం మాజీ ఎమ్మెల్యే వ‌ర‌దాపురం సూరి ఇలా చాలా మంది నాయ‌కులు బీజేపీ కండువా క‌ప్పుకొన్నారు. ఇలా చెప్పుకొంటూ పోతే.. బీజేపీ పార్టీ ఇలాంటి వారికి పున‌రావాస కేంద్రంగా మారింద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. నెటిజ‌న్లు కూడా ఇదే విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ.. కేసులున్నాయా? ఏం భ‌యం వ‌ద్దు.. బీజేపీలో చేరిపో!! అంటూ వెట‌కారంగా కామెంట్లు రువ్వుతున్నారు.

నిజానికి అవినీతి వ్య‌తిరేక‌మ‌ని.. ప‌దే ప‌దే చెప్పుకొనే కాషాయం పార్టీ.. మ‌రి కేసులు ఉన్న‌వారిని ఎలా చేర్చుకుంటొందో.. అదేస‌మ‌యంలో.. జైలు నుంచి వ‌చ్చిన వారికి కండువా ఎలా క‌ప్పుతోందో అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గా మారింది. తాజాగా తీన్మార్ మ‌ల్ల‌న్న ప‌లు కేసుల్లో చిక్కుకుని జైలుకు వెళ్లి.. బెయిల్ కోసం.. పెద్ద సంగ్రామ‌మే చేసి ఎట్ట‌కేల‌కు బ‌య‌ట ప‌డ్డారు. మ‌రి.. ఆయ‌న‌ను పార్టీలోకి ఎలా చేర్చుకున్నార‌నేది ప్ర‌శ్న‌. ఇదిలావుంటే, మ‌ల్ల‌న్న బీజేపీలోకి వెళ్ల‌డాన్ని ఆయ‌న మ‌ద్ద‌తు దారులే ఇష్ట‌ప‌డ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. బహుజన వాదంతో ముందుకొచ్చిన తీన్మార్ మల్లన్న కాషాయం పార్టీలో చేరడాన్ని ఆయన అనుచరులు చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు.

తాజాగా తీన్మార్ మల్లన్న అనుచరులు బీఎస్పీలో చేరిన సందర్భంగా మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీన్ ఆసక్తికర ట్వీట్స్ చేశారు. బహుజనులకు న్యాయం చేయాలన్న ఆశతో తీన్మార్ మల్లన్న వెంట నడిచి.. ఆయన బీజేపీలో చేరడంతో నిరాశకు గురైన మిత్రులందరికీ ఇదే మా ఆహ్వానమంటూ సంచలనానికి తెరతీశారు. ఈ ప‌రిణామం చూస్తే.. మ‌ల్ల‌న్న‌కు ఇంటి సెగే ఎక్కువ‌గా త‌గిలే క‌నిపిస్తోంది. ఎందుకంటే.. ఆయ‌నను న‌మ్మిన వారంతా కూడా బీజేపీకి వ్య‌తిరేకంగా అడుగులు వేస్తే.. ఆయ‌న మాత్రం క‌మ‌లం గూటికి చేరుకున్నారు. కేవ‌లం కేసుల భ‌యంతోనే ఇలా చేస్తున్నార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.