Begin typing your search above and press return to search.

క్రిష్ణం రాజు భౌతికకాయంపై కాషాయ జెండా

By:  Tupaki Desk   |   12 Sep 2022 11:01 AM GMT
క్రిష్ణం రాజు భౌతికకాయంపై  కాషాయ జెండా
X
ఆయన వెండి తెర రెబెల్ స్టార్. సినీ పెద్ద. మామూలు జనాలకు మంచి మనిషి. సౌమ్యుడు, వివాదరహితుడు. ఇక ఆయన సినీ జీవితంలో కానీ రాజకీయాల్లో కానీ చూస్తే ఎక్కడా ఆయన వన్ సైడెడ్ గా లేరు. రంగుల చిత్ర సీమను ఏలినా విచిత్ర రాజకీయ సీమలో కాలూనినా ఏ రంగూ తన ఒంటికి అంటించుకోలేదు. ఒక విధంగా చెప్పాలీ అంటే క్రిష్ణంరాజు అందరివారుగానే తుదిదాకా మెలిగారు.

అలాంటి క్రిష్ణంరాజు మరణించిన తరువాత ఆయన భౌతిక కాయం మీద కాషాయం రంగు పడింది. నిజానికి ఆయన బీజేపీకి మద్దతుదారుగా ఉన్నారు. అదే టైం లో ఆయన గత కొంతకాలంగా ప్రత్యక్ష రాజకీయాల్లో పాలుపంచుకోలేదు. మోడీ ప్రధాని అయిన తరువాత ఆయన్ని ఒకసారి కలసి వచ్చారు.

ఆయనకు రాజకీయ పదవులు ఏవీ మోడీ ఏలుబడిలో రాలేదు. ఆయన గవర్నర్ అవుతారని అంతా అనుకున్నా ఎందుకో అది ఆగిపోయింది. తన పదవుల కోసం ఆయన ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. నిజం చెప్పాలీ అంటే ఆయన 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం తరఫున రాజమండ్రీ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడాక ఇక ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై కొట్టేశారు.

ఆ తరువాత బీజేపీకి మద్దతుగా అపుడపుడు మీడియా సమావేశాలలో మాట్లాడినా ఆయన పూర్తి స్థాయి రాజకీయం ఆ తరువాత ఏనాడూ చేయలేదు. ఇంకా గట్టిగా చెప్పాలీ అంటే క్రిష్ణం రాజు సంస్థానాధీశుడు.

ఆయన పూర్వీకులు అంతా కాంగ్రెస్ తో తమ రాజకీయ జీవితాన్ని పెనవేసుకున్నారు. అలాంటి వంశీకుడైన క్రిష్ణం రాజు తొలుత ఆ పార్టీ నుంచే ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. బీజేపీలో రెండు సార్లు ఎంపీగా చేశారు. కేంద్ర మంత్రిగా చేశారు.

అయితే ఆయన ఒక మల్టీ టాలెంట్ పర్సనాలిటీ. అలాంటి ఆయనను కేవలం రాజకీయ గాటన కట్టేయడం ఏమంత సబబు కాదేమో. ఏది ఏమైనా ఏపీ నుంచి వెళ్ళిన సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి బీజేపీ కండువా ఆయన పార్ధిక దేహంపైన ఉంచి నివాళి అర్పించారు. క్రిష్ణంరాజుని తమ నాయకుడిగా వారు గౌరవించుకున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.