Begin typing your search above and press return to search.

మోడీపై రాహుల్ గాంధీ పేల్చిన బాంబు ఇదే!

By:  Tupaki Desk   |   21 Dec 2016 1:16 PM GMT
మోడీపై రాహుల్ గాంధీ పేల్చిన బాంబు ఇదే!
X
మొత్తానికి రాహుల్ గాంధీ ఆ ర‌హ‌స్యాల‌ను బ‌య‌ట‌పెట్టేశారు! అదేనండీ... ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీకి సంబంధించిన కొన్ని విష‌యాలు తాను బ‌య‌ట‌పెడితే బ్ర‌హ్మాండం బ‌ద్ద‌లైపోతుంద‌ని ఆ మ‌ధ్య రాహుల్ అన్నారు క‌దా! పార్ల‌మెంటులో తాను మాట్లాడ‌తానంటే భాజ‌పా నాయ‌కుడు అడ్డుప‌డుతున్నార‌నీ, ఒక్క ఛాన్స్ ఇస్తే మోడీ గురించి కొన్ని ర‌హ‌స్యాలు చెప్తానంటూ కొద్ది రోజుల కింద‌ట రాహుల్ గాంధీ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఆ ర‌హ‌స్యాన్ని ఇప్పుడు బ‌య‌ట‌పెట్టేశారు. గుజ‌రాత్‌ లోని మోడీ స్వ‌గ్రామంలో జ‌రిగిన ఒక స‌భ‌లో ప్ర‌ధాన‌మంత్రిపై రాహుల్ గాంధీ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

గుజ‌రాత్ ముఖ్య‌మంత్రిగా న‌రేంద్ర మోడీ ఉన్న‌ప్పుడు భారీ ఎత్తున ముడుపు అందుకున్నారంటూ రాహుల్ గాంధీ తీవ్ర‌స్థాయిలో ఆరోప‌ణ‌లు చేశారు. ఒక‌టీ రెండూ కాదు.. ఏకంగా రూ. 40.1 కోట్లను తీసుకున్నార‌న్నారు. ప్ర‌ముఖ సంస్థ స‌హారా గ్రూప్ నుంచి ఈ ముడుపులు ఆయ‌న‌కి ముట్టాయ‌నీ, దీనికి సంబంధించిన అన్ని ఆధారాలు త‌న ద‌గ్గ‌ర ఉన్నాయ‌ని రాహుల్ గాంధీ స్ప‌ష్టం చేశారు. అంతేకాదు, ఈ మొత్తం ముడుపుల్ని తొమ్మిది ద‌ఫాలుగా న‌రేంద్ర మోడీకి ఇచ్చారని చెప్పారు. ఈ ఆధారాలు సాక్ష‌త్తూ ఆదాయ ప‌న్ను శాఖ ద‌గ్గ‌రే ఉన్నాయ‌న్నారు. ఐటీ రికార్డులు ప‌రిశీలిస్తే మొత్తం వ్య‌వ‌హారం వెలుగులోకి వ‌స్తుంద‌ని చెప్పారు.

2013, అక్టోబ‌ర్ నెలాఖ‌రున రూ. రెండున్న కోట్లు - న‌వంబ‌ర్ 12న 5 కోట్ల రూపాయ‌లు - అదే నెల‌లో 27వ తేదీన మ‌రో రెండున్న కోట్లు - 29వ తేదీన రూ. 5 కోట్లు - డిసెంబ‌ర్ 6న మ‌రో రూ. 5 కోట్లు - డిసెంబ‌ర్ 19న రూ. 5 కోట్లు - 2015 జ‌న‌వ‌రి 13న రూ. 5 కోట్లు - అదే నెల 28న మ‌రో రూ. 5 కోట్లు - ఫిబ్ర‌వ‌రి నెల‌లో ఇంకో రూ. 5 కోట్లు... ఇలా విడత‌ల వారీగా న‌రేంద్ర మోడీకి ముడుపులు అందాయ‌ని రాహుల్ గాంధీ ఆరోపించారు. రెండున్న‌రేళ్ల కింద‌ట స‌హారా గ్రూప్ మీద ఐటీ దాడులు జ‌రిగాయ‌నీ, ఆదాయ‌ప‌న్ను శాఖ అధికారుల వ‌ద్ద ఈ వివ‌రాలు ఉన్నాయ‌ని రాహుల్ అంటున్నారు. ఈ ముడుపు వ్య‌వ‌హారంపై వెంట‌నే ద‌ర్యాప్తున‌కు ఆదేశించాల‌నీ ఆయ‌న డిమాండ్ చేశారు.

ప్ర‌ధాన‌మంత్రిపై ఈ రేంజిలో రాహుల్ ఆరోప‌ణ‌లు చేయ‌డం సంచ‌ల‌న‌మే. అయితే, ఈ విష‌యాన్ని భాజ‌పా నాయ‌కులు ఈజీగా కొట్టి పారేశారు. మోడీ మీద ఎప్ప‌టిక‌ప్పుడు విమ‌ర్శ‌లు చేయ‌డం కాంగ్రెస్ కు అల‌వాటే అని భాజ‌పా నేత‌లు అంటున్నారు. అంతేకాదు, రాహుల్ గాంధీ ఒక తాత్కాలిక రాజ‌కీయ నాయ‌కుడ‌ని కూడా భాజ‌పా నేత‌లు ఎద్దేవా చేశారు. అయితే, రాహుల్ చేసిన ఆరోప‌ణ‌ల్ని ఇలా కొట్టిపారేస్తే స‌రిపోతుందా..? మోడీకి ఎప్పుడెప్పుడు ఎంతెంత మొత్తంలో ముడుపులు ముట్టాయో కూడా తేదీలూ లెక్క‌ల‌తో స‌హా ఆరోపిస్తున్నారు. ఆ లెక్క‌లు త‌ప్పు అని భాజ‌పా ప్ర‌తివిమ‌ర్శ‌కు దిగితే బాగుంటుందే తప్ప ఇలా కేవలం వ్యక్తిగతంగా ప్రతివిమర్శలు చేయడం వల్ల... రాహుల్ ఆరోపణలకు బలం చేకూరుతుందనే వాదన విశ్లేషకులు వ్యక్తపరుస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/