Begin typing your search above and press return to search.

ధీరగంభీర వ్యాఖ్యానం సిద్ధమైన నాలుగోసింహం!

By:  Tupaki Desk   |   14 Oct 2015 4:19 AM GMT
ధీరగంభీర వ్యాఖ్యానం సిద్ధమైన నాలుగోసింహం!
X
పోలీసు పాత్రలను ఇప్పటివరకూ మన తెలుగు వెండితెర మీద ఎంతో మంది చేసి ఉంటారు. కానీ, ''కనిపించని ఆ నాలుగో సింహమేరా పోలీస్‌'' అనే డైలాగును పసిపిల్లలకు అలవాటు అయ్యేలా చేయగలిగిన ధీరగంభీర స్వరసంపన్నుడు సాయికుమార్‌ కు పాత్రల్లో వచ్చినంత పేరు మరెవ్వరికీ రాలేదంటే అతిశయోక్తి కాదు. తెలుగునాట నిన్నటితరం హీరోల్లో సీరియస్‌ నెస్‌ తొణికిసలాడే స్వరం కోసం అనేక మంది పరభాషా హీరోలు సాయికుమార్‌ గళాన్నే అరువు తెచ్చుకునే వారనే సంగతి మనకు తెలియనిది కూడా కాదు. తెలుగులో సుప్రసిద్ధ డబ్బింగ్‌ కళాకారుడు, క్యారెక్టర్‌ నటుడు సాయికుమార్‌.. అమరావతి శంకుస్థాపనకు ప్రతిష్ఠాత్మకంగా జరగబోతున్న కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారట.

ఆయన స్వరంలోని విరుపుల్లో సభికులను సమ్మోహన పరిచే శక్తి ఉంటుంది. పైగా ఈ కార్యక్రమాన్ని వెటకారం - వెకిలితనాలకు అలవాటైన ఏ టీవీ యాంకర్లతోనే నడిపిస్తే చాలా వెగటుగా ఉంటుంది. అందుకే ధీర గంభీర స్వరంతో ఉండే సాయికుమార్‌ ను.. ప్రభుత్వం కార్యక్రమ వ్యాఖ్యాత గా ఏర్పాటుచేస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే కార్యక్రమానికి సాయికుమార్‌ ఒక్కరే కాకుండా.. మరొక ఇంగ్లిషు వ్యాఖ్యాత కూడా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే.. ఇది అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న కార్యక్రమం. జాతీయ అంతర్జాతీయ స్థాయి ప్రముఖులు ఎంతో మంది ఇందులో పాల్గొంటున్నారు. అలాంటప్పుడు ఇంగ్లిషులోకూడా వ్యాఖ్యానం ఉండడం ఎంతో అవసరం. భారీస్థాయిలో ఏర్పాటు అయ్యే బహిరంగ సభలో సభికులను రంజింపజేయడానికి వారికి అర్థమయ్యేలా వివరించడానికి సాయికుమార్‌ వ్యాఖ్యానం ఉపయోగపడుతుంది. అలాగే.. ఇతర ప్రాంతాలకుచెందిన వారికి విపులంగా తెలిసేలా.. ఇంగ్లిషు వ్యాఖ్యానం కూడా ఉండేలా నిర్ణయించినట్లు సమాచారం.

మొత్తం మూడు వేదికలు సభలో ఉంటాయిట. ప్రధాన వేదికపై 15 మందికి మాత్రమే అవకాశం ఉంటుంది. ఒకవేదికపై న్యాయమూర్తులు, ఇతర ప్రముఖులు, మరొక వేదికపై విదేశీ ప్రతినిధులకు చోటు కల్పిస్తారుట.