Begin typing your search above and press return to search.

పిల్ల కాంగ్రెస్ దారిలో తల్లి కాంగ్రెస్

By:  Tupaki Desk   |   20 Oct 2015 8:05 AM GMT
పిల్ల కాంగ్రెస్ దారిలో తల్లి కాంగ్రెస్
X
అమరావతి శంకుస్థాపనకు పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రులు కూడా వస్తున్నారు కానీ రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షం వైసీపీ మాత్రం రావడం లేదు. తాజాగా కాంగ్రెస్ పార్టీ కూడా రానని తెగేసి చెప్పేసింది. శంకుస్థాపనకు వెళ్లరాదని పార్టీ నిర్ణయం తీసుకుంది. అయితే... ఇందుకు చెబుతున్న కారణం మాత్రం నవ్వు తెప్పిస్తోంది. చంద్రబాబు కాంగ్రెస్ నేతలను సరిగా పిలవలేదట, అందుకే వారు వెళ్లరట.

ఏపీ కాంగ్రెస్ నేత శైలజానాథ్ మంగళవారం నాడు మాట్లాడుతూ రాజధాని శంకుస్థాపనకు హాజరు కాకూడదని ఏపీ కాంగ్రెస్ నిర్ణయించిందని చెప్పారు. మూడు పంటలు పండే భూములను బలవంతంగా లాక్కున్నారని శైలజానాథ్ ఆరోపించారు. రాజధాని శంకుస్థాపనకు తమను సరిగా పిలవలేదని బాబుపై ఆరోపణ చేశారు. అయితే... ఆంధ్రప్రదేశ్ లో సోదిలోకి కూడా కనిపించకుండా పోయిన కాంగ్రెస్ నేతలు తమను చంద్రబాబు సరిగా పిలవలేదని అందుకే వెళ్లడం లేదని చెప్పడంపై రాజకీయవర్గాలు నవ్వుకుంటున్నాయి. అసెంబ్లీలో ఒక్క ఎమ్మెల్యే కూడా లేని కాంగ్రెస్ ను పిలవడమే గొప్పని అంటున్నారు కొందరు.

మరోవైపు పక్కనే ఉన్న తెలంగాణలోని కాంగ్రెస్ నేతలు చంద్రబాబు పంపించిన ఆహ్వానాలు అందుకుని ప్రతిగా శుభాకాంక్షలు, కృతజ్ఙతలు చెబుతూ లేఖలు రాశారు. చంద్రబాబు కృషిని మెచ్చుకున్నారు. ఇక తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే తాను అమరావతికి వెళ్లాలనుకుంటున్నట్లు చెప్పారు. జానారెడ్డి కూడా చంద్రబాబు అమరావతి నిర్మాణంలో చేస్తున్న కృషిని పొగిడారు. షబ్బీర్ అలీ కూడా రావడానికి ఆసక్తిగా ఉన్నారు. వి.హనుమంతరావు కూడా చంద్రబాబు పంపిన ఆహ్వానం అందుకుని సంతోషం వ్యక్తంచేశారు. అలాంటిది ఏపీ కాంగ్రెస్ నేతలు మాత్రం వంకలు పెడుతూ నిందలు వేయడంపై విమర్శలు వస్తున్నాయి. తెలంగాణ కాంగ్రెస్సే కాదు, ఏపీ కాంగ్రెస్ లోనూ కొందరు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. రాజకీయాలు ఎలా ఉన్నా చారిత్రక ఘట్టంలో పాల్గొనాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.

ఇదంతా ఎలా ఉన్నా ఇప్పటికే తాను రానని చెప్పిన పిల్లకాంగ్రెస్(వైసీపీ) నేత జగన్ దారిలోనే తల్లి కాంగ్రెస్ కూడా పయనిస్తున్నట్లు కనిపిస్తోంది. రాష్ట్రమంతా అమరావతికే దారి తీస్తున్న సమయంలో జగన్, కాంగ్రెస్ నేతలు ఆ రోజు ఇంట్లో కూర్చుని ఏం చేస్తారో మరి. అంతా కలిసి టీవీలో శంకుస్థాపన కార్యక్రమం చూస్తూ తిట్టుకుంటారేమో.