Begin typing your search above and press return to search.

స్థానిక ఎన్నిక‌లు..త‌మ‌కు బొట్టు పెట్టి పిల‌వ‌లేదంటున్న శైల‌జ‌నాథ్!

By:  Tupaki Desk   |   8 March 2020 8:27 AM GMT
స్థానిక ఎన్నిక‌లు..త‌మ‌కు బొట్టు పెట్టి పిల‌వ‌లేదంటున్న శైల‌జ‌నాథ్!
X
అస‌లు ఏపీలో స్థానిక ఎన్నిక‌ల ప్ర‌క‌ట‌నే అప్ర‌జాస్వామ్యికం అని అనేసింది కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ ఏపీ పీసీసీ అధ్య‌క్షుడు శైల‌జ‌నాథ్ ఈ ప్ర‌క‌ట‌న చేసేశారు. ఏపీలో స్థానిక ఎన్నిక‌ల షెడ్యూల్ ను ప్ర‌క‌టించ‌డాన్ని ఆయ‌న ఆక్షేపించారు. అస‌లు ఏపీలో కాంగ్రెస్ పార్టీ బ‌లం ఏ పాటిదో అంద‌రికీ తెలిసిందే. ఇలాంటి క్ర‌మంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నిక‌ల ప్ర‌క‌ట‌న‌నే అప్ర‌జాస్వామ్యికం అనేయ‌డం ద్వారా త‌న బరువును దించుకునే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్టుగా ఉంది!

ఏ పార్టీ అయినా ఎన్నిక‌ల్లో ఓడిపోయాకా ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌ను విమ‌ర్శిస్తూ ఉంటుంది. ఎన్నిక‌ల్లో ఓడిపోయిన పార్టీలు.. ఎన్నిక‌లు ప్ర‌జాస్వామ్యయుతంగా జ‌ర‌గ‌లేదు అన‌డం మామూలే. అయితే కాంగ్రెస్ పార్టీ ముందే ఆ స్వ‌రాన్ని వినిపించింది. ఏపీలో స్థానిక ఎన్నిక‌ల ప్ర‌క‌ట‌నే ప్ర‌జాస్వామ్య‌యుతంగా లేద‌ని ఆ పార్టీ అంటోంది. అందేమంటే.. ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ గురించి ఈసీ ఎన్ని పార్టీల‌నూ పిలిచి మాట్లాడాల్సింద‌ని శైల‌జ‌నాథ్ చెప్పుకొచ్చారు.

ఒక‌వైపు స్థానిక ఎన్నిక‌లు ఎప్పుడో జ‌ర‌గాల్సింది. రెండేళ్ల కింద‌టే వీటిని నిర్వ‌హంచాల్సింది. అయితే అప్ప‌ట్లో చంద్ర‌బాబు నాయుడి ప్ర‌భుత్వం వీటి నిర్వ‌హ‌ణ‌కు ముందుకు రాలేదు. ఎట్ట‌కేల‌కూ ఇప్పుడు అయినా జ‌రుగుతున్నాయి. ఇంకా లేట్ అయితే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా ఆగిపోయే ప‌రిస్థితి ఉంది. ఇలాంటి నేప‌థ్యంలో.. ఈ కాంగ్రెస్ వాళ్లు త‌మ‌ను పిల‌వ‌లేదు, పిలిచి బొట్టు పెట్ట‌లేదు.. అన్న‌ట్టుగా మాట్లాడ‌టం కామెడీనే.

ఆడ‌లేన‌మ్మ మ‌ద్దెల ఓటు.. అన్న‌ట్టుగా, సున్నా పాయింట్ ఫైవ్ ప‌ర్సెంట్ ఓటు బ్యాంకును కూడా ఏపీలో నిల‌బెట్టుకోలేక‌పోయిన కాంగ్రెస్ పార్టీ ఇలా ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌ను విమ‌ర్శిస్తూ ఉండ‌టం ప్ర‌హ‌స‌నంగా మారుతోంది.