Begin typing your search above and press return to search.

శైలేష్ కోసం దేవుడ్ని ప్రార్థించాల్సిన సమయమిది

By:  Tupaki Desk   |   8 Jan 2016 4:46 AM GMT
శైలేష్ కోసం దేవుడ్ని ప్రార్థించాల్సిన సమయమిది
X
ఒక వ్యక్తి చావు బతుకుల మధ్య నీరసంగా పోరాడుతున్నాడు. తనను కబళించాలని చూస్తున్న మృత్యుదేవతతో అతడు యుద్ధం చేస్తున్నాడు. అతనికి తోడుగా వైద్యులు తోడయ్యారు. ఇప్పుడీ శక్తి సరిపోదు. 130కోట్ల భారతీయులు ఏకం కావాల్సిన అవసరం ఉంది. అందరూ తమ ఆశీస్సులు అందించాలని సమయం వచ్చేసింది. ఏ దేశ క్షేమం కోసం తన ప్రాణాల్ని పణంగా పెట్టి శత్రువుతో పోరాడాడో.. ఇప్పుడు అదే దేశ ప్రజలంతా ఏకం కావాల్సిన అవసరం ఉంది. కోట్లాది మంది ఆశీస్సులు శైలేష్ కు రక్షణ కవచంలా మారాల్సిన అవసరం ఉంది.

ఇంతకీ ఈ శైలేష్ ఎవరు? ఇతని కోసం దేశ ప్రజలంతా ఎందుకు ప్రార్థనలు చేయాలి? మృత్యుదేవతతో నిత్యం పోరాడే వాళ్లు ఎందరో? వాళ్లల్లో ఇతగాడి ప్రత్యేకత ఏమిటన్న ప్రశ్నలు వచ్చాయా? మీ సందేహాల్ని తీర్చేస్తాం. పటాన్ కోట్ ఎయిర్ బేస్ మీద ఉగ్రవాదులు దాడులు చేసి.. అత్యంత కీలకమైన మెకానికల్ ఏరియా టెక్నికల్ ఏరియాలోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ ప్రదేశాన్ని దాటి టెక్నికల్ ఏరియాలోకి వెళితే.. అక్కడే అత్యంత కీలకమైన యుద్ధ క్షిపణులు సహా మొత్తం రక్షణ వ్యవస్థ మొత్తం ఉండేది. ఒకవేళ.. ఆ ప్రాంతం కానీ ఉగ్రవాదుల చేతికి చిక్కి ఉంటే.. ఎయిర్ బేస్ మొత్తం వారి కంట్రోల్ లోకి వచ్చి ఉండేది.

అంతటి కీలక ప్రాంతంలోకి వెళ్లకుండా నిరోధించాల్సిన బాధ్యత 12 మందితో కూడిన గరుడ్ కమాండోల మీద పడింది. జనవరి 2 రాత్రి రెండు గంటల సమయంలో భీకరమైన దాడులు జరుగుతున్న వేళ.. ఉగ్రవాదులు అడుగుముందుకు వేయకుండా జాగ్రత్తలు తీసుకుంటూ పోరాడుతున్నారు. ఉగ్రవాదులు కురిపిస్తున్న బుల్లెట్ల వర్షానికి ధీటుగా గరుడ్ కమాండోలు పోరాడుతున్నారు. వీరికి తోడుగా నిలిచేందుకు కమాండోలు రావటానికి కొద్ది గంటల సమయం పడుతుంది. అంతవరకూ ఉగ్రవాదుల్ని నిలువరించాల్సిన బాధ్యత వీరిపై పడింది.

శత్రువు కాల్పుల్లో కమాండోలు నేలకు ఒరుగుతున్న పరిస్థితి. ఇలాంటి సమయంలోనే శైలేష్ అనే కమాండో ఒంట్లోకి ఆరు బుల్లెట్లు దిగాయి. కడుపు కింది భాగంలో దిగిన బుల్లెట్లను పట్టించుకోకుండా.. ధైర్యం సడలకుండా ఉగ్రవాదుల మీద శైలేష్ కాల్పులు జరుపుతూనే ఉన్నాడు.

శైలేష్ అండ్ టీం జరిపిన ఎదురుకాల్పుల కారణంగానే.. ఉగ్రవాదులు మెకానికల్ ఏరియా దాటి ముందుకు వెళ్లలేకపోయారు. కమాండోలకు అండగా నిలిచేందుకు తోడుగా కమాండోలు వచ్చే వరకూ ఆయన తన గాయాల్ని పట్టించుకోకుండా పోరాడుతూనే ఉన్నాడు. అనంతరం ఆయన్ను ఆసుపత్రికి తరలించారు.

తన అసమాన ధైర్య సాహసాలతో శత్రువు అడుగు ముందుకు వేయకుండా కాపాడిన శైలేష్ ఇప్పుడు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడు. ఇలాంటి వీరుడి కోసం దేశ ప్రజలంతా ప్రార్థనలు చేయాల్సిన అవసరం ఉంది. ఆయనకు మనమంతా దన్నుగా నిలవాల్సిన బాధ్యత ఉంది. అందుకే ఆలస్యం చేయకుండా.. ఎదరుగా నిలిచిన మృత్యువుదేవతను.. కనిపించని దేవుడి ఆశీస్సుల కోసం ప్రార్థిద్దాం. చీకట్లో నక్కిన ఉగ్రవాదులు ఎక్కడున్నారో సరిగా తెలీకున్నా వారిని తుద ముట్టించాలన్న మొండి ధైర్యంతో తన ప్రాణాల్ని సైతం పణంగా పెట్టిన శైలేష్ లాంటి వారిని రక్షించుకోవాల్సిన అవసరం జాతి జనుల మీద ఎంతైనా ఉంది.