Begin typing your search above and press return to search.

ఆ రెండు పార్టీలు..ఎన్డీఏకు బై చెప్పేందుకు రెడీ

By:  Tupaki Desk   |   3 Jun 2018 5:11 PM GMT
ఆ రెండు పార్టీలు..ఎన్డీఏకు బై చెప్పేందుకు రెడీ
X
ఓ వైపు పెట్రోలు - డీజిల్ - వంట గ్యాస్‌ ధ‌ర‌లు పెంచుతూ సామాన్యుల‌కు షాక్‌లు ఇచ్చే ప‌నిలో బీజేపీ సార‌థ్యంలోని కేంద్ర ప్ర‌భుత్వం ఉంటే....మ‌రోవైపు ఆ పార్టీకి మిత్ర‌ప‌క్షంగా ఉన్న నాయ‌కులు అంత‌కంటే షాక్‌లు ఇచ్చేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఇప్ప‌టికే ఇర‌కాటంలో ప‌డిపోయిన ఎన్డీఏకు మ‌రింత బీపీ పెంచేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. దేశవ్యాప్తంగా నాలుగు లోక్‌ సభ - పది అసెంబ్లీ స్థానాలకు ఇటీవలి ఉపఎన్నికల ఫలితాలు ప్రధాన ఎన్డీఏ పక్షాలైన శివసేన - జనతాదళ్ (యూ) పార్టీల్లో గుబులు రేకెత్తిస్తున్నాయి. ఎన్డీఏలో కొనసాగడంపై లాభ - నష్టాలను అవి అంచనాలు వేసుకోవడం ప్రారంభించాయి. ఇంకా స్ప‌ష్టంగా చెప్పాలంటే గుడ్ బై చెప్పేందుకు సిద్ధంగా ఉన్నాయ‌ని అంటున్నారు విశ్లేష‌కులు.

శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే - జేడీయూ అధ్యక్షుడు - బీహార్ సీఎం నితీశ్‌ కుమార్‌ లకు ఎన్డీఏలో ఉండటం అంత సౌకర్యగా ఉన్నట్టు కనిపించడం లేదు. బీజేపీ విస్తరణవాదం - దూకుడు తమ రాజకీయ భవిష్యత్‌ కు ఎసరు తెచ్చే ప్రమాదం ఉన్నదని వారు భావిస్తున్నారు. మహారాష్ట్రలో సహ భాగస్వామి శివసేన.. తనకు రాష్ట్రవ్యాప్తంగా బలం లేక బీజేపీని గట్టిగా ఏమీ అనలేకపోతోంది. బీహార్‌లో జేడీయూనే ప్రధాన పక్షమైనా ఇటీవలి అసెంబ్లీ ఉపఎన్నికలో దారుణ ఓటమి తర్వాత భవిష్యత్ ఏమిటనే బెంగ పీడిస్తోంది. దీంతో త‌మ దారి తాము చూసుకునేందుకు ఆ రెండు పార్టీలు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు స‌మాచారం. కీల‌క‌మైన మ‌హారాష్ట్ర విష‌యానికి వ‌స్తే...కాంగ్రెస్-ఎన్సీపీ-శివసేన-ఎమ్మెన్నెస్‌ లకు బీజేపీ ఉమ్మడి శత్రువుగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. శివసేన తరహా హిందుత్వవాదంతో కాంగ్రెస్ - ఎన్సీపీలకు ఇబ్బంది లేదు. ఎందుకంటే బీజేపీని శివసేన అడ్డుకుంటుందని కాంగ్రెస్ - ఎన్సీపీలకు తెలుసు. మ‌రోవైపు శివ‌సేన నుంచి విడివ‌డిన ఎమ్మెన్నెస్ అధినేత రాజ్ ఠాక్రే ఇప్పటికే మోడీ ముక్త్ భారత్ అని నినదించి బీజేపీయేతర పక్షాల అభిమానం పొందారు. పాల్‌ గఢ్ లోక్‌ సభ ఉపఎన్నిక సందర్భంగా శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే కమ్యూనిస్టులతోపాటు అన్ని పార్టీలు ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చి తన పార్టీని అవమానిస్తున్న బీజేపీకి బుద్ధిచెప్పడానికి ఎక్కడివరకైనా వెళ్తానని సంకేతాలిచ్చారు. కాంగ్రెస్ - ఉద్ధవ్ - రాజ్ ఠాక్రేలతో కలిసే అవకాశాలపై ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ కూడా టిసారించినట్లు సమాచారం.

ఇక బీహార్ సీఎం నితీశ్‌ కుమార్‌ ది మ‌రో చిత్ర‌మైన ప‌రిస్థితి. ఆయ‌నకు రాజ‌కీయంగా అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. మహాకూటమి నుంచి దూకేసిన నితీశ్.. కాంగ్రెస్ - ఆర్జేడీలతో శత్రుత్వం తెచ్చుకున్నారు. నితీశ్ సొంతంగా అధికారానికి రాలేరు. దీం తో బీజేపీతో అంటకాగాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. నితీశ్‌ ను పూర్తిగా విశ్వసించని బీజేపీ.. జేడీయూను రెండోస్థానానికి పరిమితం చేయాలని శ్రమిస్తోంది. ఈ విధంగా అటు శివసేన - ఇటు జేడీయూ... ఎన్డీఏలో కొనసాగడంపై పునరాలోచిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో బీజేపీ సార‌థ్యంలోని కూట‌మి వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇలాగే కొన‌సాగుతుందా? అనే చ‌ర్చ తెర‌మీద‌కు వ‌స్తోంది.