Begin typing your search above and press return to search.

మళ్లీ ప్రపంచ శిఖరంపై సైనా

By:  Tupaki Desk   |   20 Aug 2015 10:03 AM GMT
మళ్లీ ప్రపంచ శిఖరంపై సైనా
X
సైనా నెహ్వాల్ మళ్లీ సాధించింది. ప్రపంచ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్ లో తిరిగి నెంబర్ వన్ ర్యాంకును సొంతం చేసుకుంది. ఇటీవలే ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ మహిళల సింగిల్స్ లో సైనా రజతం గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలు ఆమే. ఈ పతకంతో పాటే ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకు కూడా ఆమె సొంతమైంది. సైనా నెంబర్ వన్ ర్యాంకుకు చేరుకోవడం ఇది తొలిసారి కాదు. ఆమె కొన్ని నెలల కిందటే ఈ ర్యాంకును అందుకుని చరిత్ర సృష్టించింది. ఐతే మళ్లీ రెండో ర్యాంకుకు పడిపోయింది. ఐతే ప్రపంచ ఛాంపియన్ షిప్ లో అగ్రశ్రేణి క్రీడాకారుల్ని ఓడించి ఫైనల్ చేరడం ద్వారా భారీగా ర్యాంకింగ్ పాయింట్లు చేజిక్కించుకుని నెంబర్ వన్ ర్యాంకును అందుకుంది.

ఒకప్పుడు ఓ భారత ప్లేయర్ టాప్-10లో ఉండడమే గొప్ప అనుకున్నాం. కానీ సైనా అద్భుత ప్రదర్శనలతో టాప్-5లోకి వచ్చి ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు ఏకంగా నెంబర్ వన్ ర్యాంకునే అందుకుంది. కొన్నేళ్ల కిందటి మన బ్యాడ్మింటన్ ప్రమాణాల ప్రకారం చూస్తే ఇది ఊహకైనా అందని విషయం. ముఖ్యంగా ప్రపంచ బ్యాడ్మింటన్ లో తిరుగులేని శక్తి అయిన చైనాను దాటి మనమ్మాయి నెంబర్ వన్ ర్యాంకును సాధించడమంటే చిన్న విషయం కాదు. ఐతే ఇదే సైనా గత ఏడాది ప్రపంచ తొమ్మిదో ర్యాంకుకు పడిపోయిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఇక ఆమె పనైపోయిందనుకున్న దశలో హైదరాబాద్ లో గోపీచంద్ కు గుడ్ బై చెప్పేసి.. బెంగళూరులో విమల్ కుమార్ దగ్గర శిక్షణకు చేరడం ఆమె కెరీర్ ను మళ్లీ మలుపు తిప్పింది. తనను ఎన్నో ఏళ్లుగా ఊరిస్తూ వచ్చిన ప్రపంచ ఛాంపియన్ షిప్ పతకాన్ని ఒడిసిపట్టడమే కాక.. నెంబర్ వన్ ర్యాంకునూ సొంతం చేసుకుంది సైనా.